ప్రభుత్వ తాత్సారంతోనే హోదా వెనుకడుగు
పట్నంబజారు(గుంటూరు) : ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీధి నాటకాలు ఆడుతున్నాయని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. నవ్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలు శనివారం ముగిశాయి. వైఎస్పార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ హాజరై విద్యార్థులకు నిమ్మరసాన్ని తాగించి దీక్షలు విరమింపచేశారు.
ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఆనాడు పార్లమెంటు సాక్షిగా కాంగ్రెస్, బీజేపీలు ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజన చేసి పునర్విభజనలో పేర్కొన్న హామీలను అమలు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ తాత్సారంతోనే హోదా వెనుకడుగు పడుతుందన్న విషయం ప్రజలకు అర్ధమైందన్నారు.
టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేయాలి..
అప్పిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికైనా రోడెక్కి ఆందోళన చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేవలం ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందులు తలెత్తితే కేంద్రం సర్దిచెబుతుందనే అంశంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి తేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ హోదా ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు.
జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.అయ్యస్వామి మాట్లాడుతూ నేడు విద్యార్థులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా విద్యార్థి సంఘాల నేతలకు రుణపడి ఉంటామన్నారు. నేడు జిల్లాలో చేపట్టిన దీక్షను రాష్ట్రస్థాయిలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈనెల 26వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పలు విభాగాల నేతలు ఆతుకూరి ఆంజనేయులు, కావటి మనోహర్‌నాయుడు, కొత్తాచినప్పరెడ్డి, 13 జిల్లాల జేఏసీ ప్రతినిధులు లీలామోహన్, మర్రి వేముల శ్రీనివాస్, టి.సూర్యం, వెంకటరెడ్డి, కోటేశ్వరరావు, కుర్రా శ్రీనివాసరావు, చిన నాగేంద్రం, ఆదినారాయణ, రాజేష్, అంజి, నాగరాజు, వంశీ, మంత్రునాయక్, భూక్యా నాయక్, తదితరులు పాల్గొన్నారు.