అసలే వర్షాధారం... రిజర్వాయర్ ఉందనుకుంటే ఆదుకునే పరిస్థితి లేకపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు.
- ఆరురోజులైనా అందని కల్యాణపులోవ నీరు
- కాలువల్లో తుప్పలు, ఎగువ ప్రాంత రైతుల ఆటంకాలే కారణం
- శివారు భూముల్లో ఎండుతున్న నారు మడులు
- ఆందోళన చెందుతున్న రైతులు
రావికమతం : అసలే వర్షాధారం... రిజర్వాయర్ ఉందనుకుంటే ఆదుకునే పరిస్థితి లేకపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. జూలైలో కురిసిన అరకొర వర్షాలకు రైతులు నారుమడులు సిద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత వర్షాలు ఎత్తేయడంతో ప్రస్తు తం నారు ఎండిపోతోంది.
ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ నీరు విడిచిపెట్టడంతో రైతులు కొంత ఆనందించినా ఆరు రోజులైనా తమ భూములకు నీరు చేరక పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కళ్యాణపులోవ నీరు విడుదలైనా శనివారం నాటికి కూడా ఆయకట్టుకు చేరలేదు. గంపవానిపాలెం, జెడ్.కొత్తపట్నం గ్రామాలకే అంతంతమేర నీ రందింది. ఓవైపు నారుమడులు ఎండిపోతున్న పరిస్థితుల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ నీరు 5న విడుదల చేసిన విషయం తెలిసిందే.
నీరు విడుదల చేసిన ఆరు గంటల వ్యవధిలో శివారు భూములకు చేరాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు సిమెంటు లైనింగ్ పనులు చేపట్టిన కాలువల్లో బలంగా తుప్పలు పెరిగి ఉండడం, ఎగువ ప్రాంత రైతులు కాలువకు అడ్డంగా గట్లువేసి నిలిపివేస్తుండడమే కారణమని దిగువ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. రిజర్వాయర్ ప్రధాన తూము ద్వారా 30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎండ ధాటిగా ఉండడంతో వచ్చిన నీరు వచ్చినట్లే పొలాల్లో ఇంకిపోతోంది.
దీంతో నీరు కట్టుకున్న రైతులే మళ్లీమళ్లీ కడుతుండడంతో కిందికి నీరు రావడం లేదు. పైగా కాలువలో అధికారికంగా వేసిన తూములకు అదనంగా పలు చోట్ల రైతులు అనధికారికంగా వేసిన తూముల ద్వారా నీటిచౌర్యానికి పాల్పడుతుండడం సమస్యకు కొంత కారణం. నీరు శివారు భూములకు సరిగా చేరడం లేదు.అధికారులు తక్షణం స్పందించి కాలువ ఆసాంతం పర్యవేక్షించి తమకు న్యాయం చేయాలని దొండపూడి, కొత్తకోట, మర్రివలస, వమ్మవరం రైతులు కోరుతున్నారు.
రెండు రోజుల్లోనే చేరేది
గత ఏడాది నీరు విడుదల చేసిన రెండు రోజులకే మా భూములకు చేరింది. ఈ ఏడాది ఆరు రోజులైనా నీ టి చుక్క జాడలేదు. నారు మడులు ఎండిపోతున్నా యి. అధికారులు స్పందించి నీరందేలా చేయాలి.
- గుమ్ముడు దొరబాబు, రైతు, కొత్తకోట