కొంపముంచారు | stoped to 4.277 homes of the Indiramma | Sakshi
Sakshi News home page

కొంపముంచారు

Published Thu, Nov 13 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

కొంపముంచారు

కొంపముంచారు

నిలిచిన ఇందిరమ్మ ఇళ్లు 4,277

బిల్లులు చెల్లించకపోవడంతో ఆందోళన
పాకల్లో చలికి వణుకుతున్న లబ్ధిదారులు ప్రభుత్వంపై ఆగ్రహం

 
‘ఇందిరమ్మ ఇల్లిచ్చారు... ఉన్న గుడిసెను పీకేస్తే మిద్దె కట్టుకోవచ్చు. సొంత మిద్దెలో ఉండాలన్న ఏళ్ల నాటి కల త్వరలో తీరనుంది. అందులో ఎంచక్కా ఆనందంగా ఉండొచ్చు. ఇక వరదల బాదర బందీలేమీ ఉండవు’ ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మొదట్లో ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. ఉన్న గుడిసెను పీకేసి తీరా నిర్మాణం ప్రారంభించాక అసలు సంగతి తెలిసింది. ప్రభుత్వ మాయలో పడి ఎంతగా చితికిపోయామోనని మధనపడుతున్నారు.     
 
నందిగామ రూరల్ :  మండలంలో ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉన్న గుడిసెలను పీకేసి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన వారికి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. బిల్లులు రాకపోవడంతో పలు దశల్లో నిర్మాణాలు నిలిచిపోయాయి. దీంతో ఇళ్లను ప్రారంభించిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. బిల్లుల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల అప్పులు చేశామని, నిర్మించిన దశలకు బిల్లులు వస్తాయో, రావో కూడా అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదవారంటే ప్రభుత్వానికి అలుసని, అందువల్లే బిల్లుల చెల్లింపుపై దృష్టి పెట్టడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు బిల్లులు చెల్లించాలని లబ్ధిదారులు ముక్తకంఠంతో కోరుతున్నారు.
 
ఇందిరమ్మ ఇళ్ల వివరాలు


మండలానికి 2006 నుంచి ఇప్పటి వరకు ఫేజ్ 1, 2, 3లలో మొత్తం 8,625 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో కేవలం 4,348 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన 4,277 ఇళ్లు పలు నిర్మాణ దశల్లో నిలిచిపోయాయి. వీటికి సంబంధించిన రూ.90,36,100 లక్షల బిల్లులు నిలిచిపోయాయని అధికారులే చెబుతున్నారు.
 
గుడిసెల నుంచి పాకల్లోకి...

ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకునేందుకు ఉన్న ఇంటిని పడవేసిన కొందరు లబ్ధిదారులు చిన్నచిన్న పాకలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని ఉంటున్నారు. కొందరైతే వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూ వాటిల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏడాది గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో మొండి గోడలతో ఇందిరమ్మ ఇళ్లు వెక్కిరిస్తున్నాయి. లబ్ధిదారులకు అధికారుల లెక్కల ప్రకారం 7 నెలలుగా బిల్లులు నిలిచిపోయాయి.
 
 ఉన్న ఇల్లు పీకేశాం

8 నెలల క్రితం మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దాన్ని నిర్మించుకునేందుకు ఉన్న ఇంటిని పడే శాం. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు బేస్ మట్టాల స్థాయిలో నిలిచింది. ఒక్క బిల్లూ ఇవ్వలేదు. పాకలో ఉంటున్నాం. ప్రస్తుతం చలికి ఇబ్బంది పడుతున్నాం.
 - పత్తిపాటి సుశీల
 
 పాకే గతైంది

ఇందిరమ్మ ఇల్లు మంజూరైందా కదా అన్న సంతోషంతో ఉన్న ఇంటిని పడవేసి లక్ష రూపాయల ఖర్చుతో కొత్త ఇల్లు నిర్మాణం మొదలుపెట్టాం. ఏడాది నుంచి బిల్లు రాలేదు. మా కుటుంబంలో ఐదుగురం. అప్పటి నుంచి పక్కనే పాక ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నాం. చాలా ఇబ్బందిగా ఉంది.
 - దుడ్డు భాగ్యమ్మ
 
 ఆధార్ అనుసంధానం చేస్తున్నాం

 నందిగామ ప్రాంతంలో 7 నెలలుగా లబ్ధిదారులకు బిల్లులు నిలిచిపోయాయి. పలు స్టేజీల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఆధార్ వివరాలను సేకరించి వాటిని ఆన్‌లైన్‌లో అనుసంధానం చేస్తున్నాం. ప్రస్తుతం మండలంలో రూ.90,36,100 లక్షల బిల్లులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు లబ్ధిదారులకు అందజేస్తాం.
 - ఎన్‌వీఎస్ ప్రకాశరావు,
 హౌసింగ్ ఏఈ నందిగామ
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement