మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఏ దైవమైన, ఏ ధర్మమైన నీలోనే చూశాము సాయి రావా బాబా.. రక్షా దక్షా నీవే కదా మా బాబా!
‘అందరినీ ప్రేమించు. ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవ సేవే మాధవ సేవ’ అనే సత్యసాయి బోధన విశ్వ వ్యాప్తంగా సేవాకాంతులు ప్రజ్వలిస్తోంది. కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఆయన భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన.. మెరుగైన వైద్యం.. ప్రకృతి వైపరీత్యాల్లో సేవా కార్యక్రమాలు.. ఉన్నత వ్యక్తిత్వం పెంపొందించేందుకు సత్య బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రపంచ సంతోషమే.. తమ సంతోషం’ అని చాటుతున్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ.. బాబా సేవలు అజరామరం.
ఇప్పటి వరకూ ‘సత్యసాయి సెంట్రల్ ట్రస్టు’ ఇండియాలో ఏం చేసిందనేది అందరికీ తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రస్టు ఏం చేస్తోంది? భారత్ మినహా ఆఫ్రికా దేశానికి మాత్రమే వెళ్లిన సత్యసాయి విశ్వమానవాళిని ఎలా ప్రభావితం చేశారు? ‘ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపిస్తున్న ‘సాయిలీల’ ఏమిటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షిప్రతినిధి, అనంతపురం: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలపై బాబా ఉన్నన్నిరోజులు వీటి గురించి ఎక్కడా మీడియాలో కథనాలు రాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే ‘నా ఇంట్లోకి పది మంది బంధువులు వచ్చి భోజనం చేసి వెళతారు. ఇది పత్రికకు వార్త కాదు కదా? అలాగే ప్రపంచమంతా నా కుటుంబం. మన ఇంట్లోవారికి చేసే సాయానికి ప్రచారమెందుకు?’ అని బాబా చెప్పిన మాటలను ట్రస్టు సభ్యులు గుర్తు చేశారు. భారత్ మినహా బాబా ఆఫ్రికాకు మాత్రమే ఒకసారి వెళ్లారు. అది మినహా మరేదేశానికీ వెళ్లలేదు. పుట్టపర్తికి వచ్చి బాబా బోధనలు విన్న విదేశీభక్తులు ‘స్ఫూర్తి’పొంది విదేశాల్లో సేవ చేయడం మొదలెట్టారు. దీన్ని అక్కడి వారు నిశితంగా గమనించారు. ‘ఉచితంగా రక్తం ఇస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. భోజనం పెడుతున్నారు. చదువు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.’ ఇంత మంచి కార్యక్రమాల్లో మనమూ భాగస్వాములు కావాలని భావించారు. ‘సాయిసేవ’లో సభ్యులయ్యారు. ఎంతలా అంటే అమెరికాలోని కొన్ని హెల్త్‌యూనివర్శిటీల డీన్లు కూడా సభ్యులుగా చేరి ‘సాయి మెడికల్ క్లినిక్’లలో సేవ చేస్తున్నారు. సత్యసాయిసేవలు విశ్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ ఘటనలతో సుస్పష్టమవుతుంది.
సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వరూపం
ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలున్నాయి. ఇందులో 123 దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోంది. ప్రశాంతి సొసైటీ, వరల్డ్ ఆర్గనైజింగ్ కమిటీ, యూత్‌వింగ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ మొత్తం దేశాలను తొమ్మిది జోన్లుగా విభజించారు. అందులో రీజియన్లు, వాటిలో దేశాలుగా విభజించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వేల సెంటర్లుగా ఏర్పడిన ట్రస్టు... విద్య, వైద్యంతో పాటు పలు రకాల సేవలందిస్తోంది. ప్రశాంతి కౌన్సిల్ పేరుతో జరిగే ఈ కార్యక్రమాకు చైర్మన్‌గా లాస్ ఏంజెల్స్‌లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేంద్రనాథరెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
వైద్య సేవ
అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, వెనుజులా, జర్మనితో పాటు చాలాదేశాల్లో ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్లు కూడా సత్యసాయి భక్తులయ్యారు. వీరు తమ వత్తి చేసుకుంటూనే ఏడాదిలో రెండుసార్లు పుట్టపర్తికి వస్తారు. గురుపౌర్ణమి, సత్యసాయి జయంతికి ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు పేదరోగులకు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. దీంతోపాటు వారు నివసిస్తోన్న దేశాల్లో కూడా ‘ఫ్రీ మెడికల్ క్లినిక్’లు నిర్వహిస్తున్నారు. ‘మొబైల్ క్లినిక్’లకు కూడా శ్రీకారం చుట్టారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్‌తో పాటు చాలా దేశాల్లో మెబైల్ క్లినిక్‌లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు.
యువ రక్తం...సేవా మార్గం
సత్యసాయి యూత్‌వింగ్ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాది పుట్టపర్తిలో వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో 36 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూత్‌వింగ్ ప్రపంచాన్ని 11 జోన్లుగా విభజించి, 11 యువజన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కువగా ప్రకతి వైపరీత్యాలు జరిగే ప్రాంతాలకు హాజరవుతుంటారు. వీటితో పాటు మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, అన్నదానాలు, విద్యాబోధన చేయడంతో పాటు తోటి మనిషిపై సాటి మనిషి ఎలా ప్రేమ చూపాలి అనే కోణంలో అక్కడి ప్రజలకు చైతన్యం కల్గిస్తుంటారు.
విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ
భారత్ కాకుండా ఇతర దేశాల్లో 41 సత్యసాయి స్కూళ్లు ఉన్నాయి. 39 సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన, ఉన్నత విలువలతో కూడిన విద్యతో పాటు ‘సేవా మార్గాన్ని’ బోధిస్తున్నారు. బాబా సూక్తులు, వచనాలు, మనిషి పట్ల, సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతలపై బోధిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లో బోధన, క్రమశిక్షణ చూసి అక్కడి పాఠశాలల యాజమన్యాలు ఇలాంటి బోధన జరిగేలా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అడిగారు. ఆస్పత్రులలో కూడా సత్యసాయిభక్తులు రోగుల పట్ల వ్యవహరించే తీరు, చూపించే ప్రేమ తమ ఇన్‌స్టిట్యూట్లలో కూడా అందాలని అక్కడి ఆస్పత్రుల యాజమన్యాలు ట్రస్టులోని డాక్టర్లను తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తోంది.
గతేడాది ట్రస్టు చేసిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు
♦ నైజీరియా, క్యూబాలో సాయి వాటర్ ప్రాజెక్టు నిర్మించి తాగునీరు అందించారు.
♦ కెన్యాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్స చేశారు.
♦ చైనాలో మొక్కలునాటే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రెగ్యులర్‌గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు.
♦ దుబాయ్‌లో సత్యసాయి యువజన విభాగం ఆధ్వర్యంలో పేరెంట్స్ వర్క్‌షాపు నిర్వహించి, పిల్లలను ఎలాపెంచాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. స్వామి ప్రవచనాలను బోధించారు
♦ అబుదాబిలో అన్నదానం, రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
♦ బహ్రేయిన్‌లో స్కూలు పిల్లలతో మొక్కలు నాటించి పర్యావరణంపై వర్క్‌షాపు నిర్వహించారు.
♦ కాలిఫోర్నియాలో 400 మంది డాక్టర్లతో ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు.
♦ సౌదీలో రంజాన్ సందర్భంగా అన్నదానం చేశారు.
♦ ఒమెన్‌లో 45 వర్క్‌షాపులు నిర్వహించారు. వీటిని మెచ్చుకుని అక్కడి విద్యాశాఖమంత్రి ట్రస్టుకు ప్రశంసాపత్రం అందజేశారు.
♦ కువైట్‌లో స్పెషల్‌నీడ్ చిల్డ్రన్స్‌కు పలు సేవలు చేశారు. యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమ్మర్‌క్యాంపు చేపట్టి సేవా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు.
♦ నేపాల్ భూకంపం సమయం నుంచి అక్కడి శరణార్థులకు సేవలందిస్తున్నారు. ఖాట్మండు,, పొకారా, భరత్‌పూర్‌లో పైపులైన్లు ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించారు.
♦ వెస్టిండీస్, ఇటలీలో పక్కా ఇళ్లు నిర్మించారు.
♦ 25 దేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిచారు.
ఈ ఫొటోలో కన్పిస్తోన్న నర్సుపేరు కృష్ణలీల. ఆస్ట్రేలియా మహిళ. బాబా బోధనలకు ముగ్ధురాలై భక్తురాలైంది. కృష్ణలీల అని పేరు మార్చుకుంది. ఈమె బాబా జయంతి నవంబర్ 23 అంటే పది రోజులు ముందు వస్తుంది. మెడికల్ క్యాంపునకు కావల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూస్తుంది. సొంత ఖర్చులతో మలేషియా నుంచి నర్సులను తీసుకొచ్చి ఇక్కడి సేవ చేయిస్తుంది. నెబులైజేషన్, బెడ్స్, మెడిసిన్స్ అన్నీ దగ్గరుండి చూస్తుంది. పేరు ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నిస్తే ‘మతాలకు, కులాలకు అతీతమైంది మానవ సంబంధం. సాయిబోధనలో ఇది స్పష్టమైంది. ఈ విషయాలు పలు దేశాల్లో చెబితే మేమూ మీతో ఓ గంట సేవ చేస్తాం’ అని ముందుకొస్తున్నారు. పాత పేరు ఉంటే ఏంటని ప్రశ్నిస్తే...అది గతం. నాపేరు కృష్ణలీల. నేను పాటించేది ఇక్కడి సంస్కృతి అని అంటారు.
తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం
సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకోసం వచ్చే బంధువులకు భోజనం లభించడం కష్టమవుతోంది. దీంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, ఏలూరు, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, కడప, మెట్‌పల్లి, కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్ ఆస్పత్రులలో రోజూ 3,500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు.
20న గవర్నర్ రాక
అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఈ నెల 20న పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు శాంతి భవన్ చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని 8.35 గంటలకు సాయి కుల్వంత్ హాల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి వేద కాన్ఫరెన్స్, మల్టీ ఫెయిత్ సింపోజిమ్ ఆన్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారు.
ఏటా వస్తుంటా
నా వయస్సు 74 ఏళ్లు. 1984 నుంచి సేవాదల్‌లో పనిచేస్తున్నా! సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపునకు హాజరవుతాంటా! పేదవారికి సేవ చేసినప్పుడు కలిగే తప్తి మళ్లీ పుట్టపర్తికి వచ్చే వరకూ ఉంటుంది. సత్యసాయి భోదనలు ఒంటపడితే అందరూ ప్రేమ, సేవకు బానిసలు కావల్సిందే! అదే సాయిలీల మహత్యం. – ఉడో ఫ్రెజల్, జర్మనీ
సేవలతో ప్రభావితం
ఏడాదికి రెండుసార్లు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటాం. నా భార్యతో కలిసి కొద్దిరోజులు ముందుగానే వచ్చి ఏర్పాట్లు చూసుకుంటా. ఇక్కడ చికిత్స చేసే డాక్టర్ల పిల్లలతో పాటు సేవలందించే విదేశీ భక్తుల పిల్లలు మెడికల్ క్యాంపు చూసి, వారు కూడా డాక్టర్ కావాలని తల్లిదండ్రులతో చిన్నపుడే చెబుతున్నారు. పదేళ్ల వయసు నుంచే డాక్టర్ కావాలనే సంకల్పంతో చదివి డాక్టర్లు అయిన వారూ ఉన్నారు. విదేశీయుల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దీన్నిబట్టే సత్యసాయి సేవలు ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. – డాక్టర్ బంగార్రాజు, జనరల్ మెడిసిన్, యూఎస్‌ఏ
సత్యసాయి బోధనలే నడిపిస్తున్నాయి
123 దేశాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. అమెరికాలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా కష్టం. అక్కడ ఉచిత వైద్యం అంటే ప్రజలు నమ్మరు. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమస్య. కానీ సత్యసాయి క్యాంపులకు అక్కడి ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి. కెన్యా, నైజీరియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలోని రూరల్ ప్రాంతాలకు కూడా వెళ్లి సేవ చేస్తున్నాం. విద్య, వైద్యం చాలా గొప్పగా ఉంటోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నాయి. ఏడాదికేడాదికీ సత్యసాయి సేవలను మరింత మెరుగ్గా చేస్తాం. 2019లో 95 దేశాలలోని 95 కమ్యూనిటీలతో సదస్సు నిర్వహించి వారిని దత్తత తీసుకుంటాం. తాగునీరు, ఇళ్లు, వైద్యం, విద్య అన్ని రకాలుగా సేవలందిస్తాం. వచ్చే ఏడాది జూలైలో గోగ్రీన్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. – డాక్టర్ నరేంద్రనాథరెడ్డి, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్, యూఎస్‌ఏ
బాబా బాటలో వెళుతున్నా
మా తల్లి సైక్రియాట్రిస్టు. వాళ్లు బాబా భక్తులు. ఇక్కడికి సేవ చేసేందుకు వచ్చేవారు. వారి స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా. హెపాటాలజీ ప్రొఫెసర్‌గా కూడా ఉన్నా. అమెరికాలో హెపటాలజీ విభాగపు డాక్టర్లకు శిక్షణ ఇస్తుంటా. ఎయిమ్స్‌లో కూడా సేవలందిస్తున్నా. ఉన్నత పదవుల్లో ఉన్నా అంకిత భావం, ప్రేమ ఉండాలని బాబా బోధించిన బాటలోనే వెళుతున్నా!
–హరి కంజీవరం, గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్, యూఎస్‌ఏ
మానవతా విలువలు పెంపొందాలంటే సేవే మార్గం
48 ఏళ్లుగా సత్యసాయి సేవలో ఉన్నా. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు విశ్వవ్యాప్తమయ్యాయి. సాయి చూపిన సేవా మార్గంలో కోట్లాదిమంది భక్తులు నడుస్తున్నారు. ఆయన ప్రేమ–సేవ మార్గాన్ని ప్రపంచదేశాలు ఆచరిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా దృక్పథంలో మార్చు వచ్చి అందరూ పుట్టపర్తికి వస్తున్నారు. మానవతా విలువలు ఇంకా పెంపొందాలి. దీనికి సేవే సరైన మార్గం.
– హెచ్‌జే దొర, మాజీ డీజీపీ, సత్యసాయి వరల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్, హైదరాబాద్.
సాయి వాక్కుతో పీడియాట్రిక్ సర్జన్ అయ్యా..
మా తల్లిదండ్రులు యూఎస్‌లో స్థిరపడ్డారు. నేను నాసాలో ఎలక్ట్రిక్ ఇంజినీర్‌గా ఉండేవాన్ని. పుట్టపర్తిలో బాబా దర్శనానికి వెళితే ‘యూ ఆర్ మై ‘పీడియాట్రిక్ సర్జన్’ అన్నారు. మొదట అర్థం కాలేదు. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ రాసి ఈ రోజు పీడియాట్రిక్ న్యూరో సర్జన్‌గా ఉన్నా. అత్యాధునిక పద్ధతుల్లో రోబోటెక్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నా. వారం కిందట కేరళలో మెదడుకు సంబంధించి అరుదైన ఆపరేషన్ చేశా. పుట్టపర్తి, బెంగళూరులో ఆస్పత్రులు నిర్మించి డాక్టర్లు ఎలా ఉండలో, వైద్యం ఎలా సేవగా భావించాలో ప్రపంచానికి చెబుతాను. – డాక్టర్ వెంకట సదానంద్, పీడియాట్రిక్, న్యూరోసర్జన్
Comments
Please login to add a commentAdd a comment