మునగాల, న్యూస్‌లైన్
విద్యుత్‌కోతలు ఎత్తివేసి వ్యవసాయానికి ఏడుగంటలు, ఎత్తిపోతల పథకాలకు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య మాట్లాడుతూ వ్యవసాయానికి 7 గంటలు, సాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తి పోతల పథకాలకు 16 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ నేడు కనీసం మూడు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రబీలో పంటలు సాగు చేసిన రైతులు నీటి కోసం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
తక్షణమే అప్రకటిత విద్యుత్ కోతలను ఎత్తివేసి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే రైతులను సమీకరించి విద్యుత్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఏఈ దుర్గాప్రసాద్‌కు వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, రైతుసంఘం నాయకులు చందా చంద్రయ్య, బుర్రి శ్రీరాములు, పోటు పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చిర్రా శ్రీనివాస్, మిట్టగణుపుల సుందరం, షేక్ సైదా, ఎల్‌పి.రామయ్య, ఖాజాబీ తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ కోతలకు నిరసనగా ధర్నా
Published Tue, Jan 21 2014 1:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement