
ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయండి
ఎక్కడికక్కడ హోదా ఉద్యమంపై ధీటుగా దాడి చేయండి. మన వాణిని సమర్థంగా వినిపించిండి.
- ఉద్యమం ప్రజల్లోకి చొచ్చుకుపోయే వీలుంది
- ప్రతిపక్షాలపై ఎదురుదాడి తీవ్రం చేయండి
- ప్రజల దృష్టిని మరల్చండి
- పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చంద్రబాబు
- హోదా ఉద్యమంపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీకి ఆదేశాలు
సాక్షి, అమరావతి: ‘తమిళులంతా ఐక్యంగా పోరాడి జల్లికట్టుపై ఆర్డినెన్స్ సాధించుకున్న నేపథ్యంలో మన రాష్ట్రంలోనూ ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఇందుకు తెలుగుదేశం పార్టీ పరంగా ఘాటుగా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ హోదా ఉద్యమంపై ధీటుగా దాడి చేయండి. మన వాణిని సమర్థంగా వినిపించిండి. ఉద్యమం తీవ్రమైతే మనం చేసేది, చేయగలిగేది కూడా ఏమీ ఉండదు. అందుకే ఈ దశలోనే మన సత్తా చూపాలి. ఉద్యమాన్ని మొగ్గలోనే తుంచేయాలి’ అని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు.
ఆయన బుధవారం ఉదయం విజయవాడలోని తన అధికారిక నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ నేతల భేటీలో పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పలువురు రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఆ తరువాత చంద్రబాబునాయుడు అదే అంశంపై ప్రధానంగా చర్చ జరిపారనేది సమాచారం.
ప్రత్యేక హోదా అంశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టమవుతోందని, ప్రజల్లోకి ఉద్యమం ఇంకా చొచ్చుకునిపోయే పరిస్థితులకు అవకాశాలు ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా ప్రాంతాల్లోని స్థానిక నాయకత్వాలపై ఉందని స్పష్టం చేశారు. ప్రజల్లో ప్రత్యేక హోదా డిమాండ్ ప్రబలితే ఆపడం ఎవరి తరమూ కాదని, ఆ దృష్ట్యానే ముందే పార్టీ నేతలు ఐక్యంగా ప్రతిపక్ష పార్టీలపై ఎదురుదాడికి సిద్ధం కావాలని చెప్పారు. ముందుగా జిల్లాల్లో తగవులు మాని పార్టీ పరంగా చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలని సూచించారు. ఇక తాను పార్టీ వ్యవహారాలపైనా ఎక్కువ దృష్టి పెడతానని, ఎక్కడా తేడాలు వచ్చినా క్షమించేది లేదని హెచ్చరించారు.
సమావేశం తరువాత డీజీపీకి పిలుపు
ఆ తర్వాత కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో డీజీపీ సాంబశివరావును ముఖ్యమంత్రి పిలిపించారు. గురువారం విశాఖలో జరగనున్న కొవ్వొత్తుల ర్యాలీతో సహా అన్ని కార్యక్రమాల విషయంలోనూ గట్టిగా వ్యవహరించాలని ఆదేశించారు. ‘భాగస్వామ్య సదస్సుకు 42 దేశాల నుంచి ప్రతినిధులు, కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు వస్తున్నారు. ఒక్క చిన్న సంఘటన జరిగినా పరువంతా పోతోంది. మొత్తం డైవర్ట్ అవుతుంది. మొత్తం అలర్ట్ చేయండి’ అని సూచించారని సమాచారం. సీఎంతో సూచనల తరువాతే డీజీపీ అన్ని జిల్లాల పోలీసు అధికారులకు ఆందోళనకారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిసింది.