సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురందించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల రాయితీ బస్ పాస్ పరిధి పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న 35 కిలోమీటర్ల పరిమితిని 50 కిలో మీటర్లకు పెంచుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 35 కిలోమీటర్ల పరిధితో రాష్ట్రంలోని విద్యార్థులు ఇప్పటివరకు నానా అగచాట్లు పడుతున్నారు. రాష్ట్రంలో అధిక శాతం విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో విద్యార్థులు ఇంటి నుంచి పాఠశాల, కళాశాలకు వెళ్లాలంటే 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటోంది.
ఈ కారణంగా రాయితీ బస్ పాస్‌లకు అర్హత కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే అధిక దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. దీంతో రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధి 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచింది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. దీని కారణంగా ప్రభుత్వంపై ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఆర్టీసీ అందించే అన్ని రకాల బస్ పాస్‌లకు ప్రభుత్వం సంస్థకు వంద శాతం నిధుల్ని రీయింబర్స్ చేస్తుంది. ఈ బస్ పాస్‌లకుగాను ఏటా రూ.290 కోట్ల మేర ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment