రైలు కింద పడి విద్యార్థి మృతి
మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : రైలు దిగబోతూ దానికిందేపడి మృతిచెందిన విద్యార్థి ఉదంతం మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విద్యార్థి శరీరం రెండు ముక్కలు కావడం తోటి ప్రయాణికులను కలచివేసింది. జరిగిన ఘోరాన్ని తెలుసుకుని ప్రమాద స్థలికి చేరుకున్న తల్లితండ్రులు విగతజీవిగా పడి ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా విలపించారు.
మచిలీపట్నంలోని బలరామునిపేటకు చెందిన లంకా ప్రసాద్ (16) ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాశాడు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం చిలకలపూడిలోని శ్రీవరలక్ష్మి పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ పొందుతున్నాడు. బుధవారం శిక్షణ ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి వస్తూ మచిలీపట్నం వచ్చే ప్యాసింజర్ రైలు ఎక్కాడు. మచిలీపట్నంలో ప్లాట్‌ఫామ్ వద్దకు రైలు చేరుకోగా ఆగేలోపు దిగేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి రైలు కిందపడిపోయాడు.
ఈ ఘటనలో ప్రసాద్ శరీరం రెండు ముక్కలు కాగా.. జరిగిన ఘోరాన్ని కళ్లారా చూసిన తోటి ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆదినారాయణ, సత్యవతి ఊహించని రీతిలో కన్నబిడ్డ చనిపోవటాన్ని చూసి దిక్కులు పిక్కటిల్లేలా విలపించారు. గుడివాడ రైల్వే హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు వివరాలు సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
బాధిత కుటుంబానికి పేర్ని పరామర్శ
రైలు ప్రమాదంలో మరణించిన ప్రసాద్ కుటుంబాన్ని బందరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని వెంకట్రామయ్య (నాని) బుధవారం పరామర్శించారు. ఎన్నికలను పురస్కరించుకుని బందరుకోటలో ప్రచారం నిర్వహిస్తున్న నాని జరిగిన ఘోరాన్ని తెలుసుకుని హుటాహుటిన రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. తల్లిదండ్రులు, బంధువులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. నానితో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ సలార్‌దాదా, మండల అధ్యక్షుడు లంకే వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి మాదివాడ రాము, మార్కెట్ యార్డు చైర్మన్ మోకా భాస్కరరావు, అర్బన్ బ్యాంకు మాజీ చైర్మన్ బొర్రా విఠల్ పాల్గొన్నారు.