మోడీ ప్రసంగానికి మంగళం!
శ్రీకాకుళం సిటీ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు తన ‘గురు’ ప్రసంగాన్ని వినిపిద్దామనుకున్న దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆకాంక్షకు జిల్లాలోని పలువురు టీచర్లు ఝలక్ ఇచ్చారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మునిగిపోరుు ప్రసంగం గురించేమరచిపోయూరు. శుక్రవారం సాయంత్రం 3 గంటల నుంచి 4.45 గంటల వరకు మోడీ ఇచ్చే ప్రసంగం వినేందుకు పలు చోట్ల విద్యార్థులే కనిపించలేదు. ఏర్పాట్లు కూడా చేయలేదు.
ఆమదాలవలస మండల కేంద్రంలోని ఎమ్మార్సీ భవనంలో విద్యార్థులకు బదులుగా కేవలం మండల, మున్సిపల్ ఉపాధ్యాయులే ఈ కార్యక్రమాన్ని వీక్షించేలా అక్కడి మండల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చే సారంటే జిల్లాలో మోడీ ప్రసంగ కార్యక్రమం నిర్వహణ తీరు ఏమేరకుందో ఇట్టే అర్ధమవుతోంది. హిందీలో ప్రసంగం కావడంతో విద్యార్థులెవ్వరికీ ప్రసంగ సారాంశం అర్ధం కాలేదు.
టీచర్లంతా ఉపాధ్యాయదినోత్సవ వేడుకల్లో మునిగితేలారని, అందుకే ప్రసంగానికి ప్రాధాన్యం ఇవ్వలేదని పేరు చెప్పడం ఇష్టం లేని ఓ విద్యాశాఖాధికారి ‘సాక్షి’కి వివరించారు. ఇదిలావుంటే జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు చోట్ల వర్షం కురియడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇదే విషయూన్ని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి వద్ద ప్రస్తావించగా జిల్లాలో మోడీ ప్రసంగం అన్ని చోట్ల బాగానే జరిగిందని చెప్పుకొచ్చారు. ఆమదాలవలస విషయం ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఎక్కడెక్కడ ఏం జరిగిందో సమీక్షిస్తామన్నారు.