
మంత్రివర్యా.. ఇలాగైతే చదువుకునేదెలా..?
అసలే కార్పొ‘రేటు’ విద్య...
అసలే కార్పొ‘రేటు’ విద్య. భారీ ఫీజులు తలకుమించిన భారం కావడంతో పట్టణాల్లోని హాస్టళ్లలో ఉండేందుకు ఆర్థిక స్థోమత లేని విద్యార్థులు స్వగ్రామాల్లోని ఇళ్ల నుంచే రోజూ రాకపోకలు సాగిస్తూ చదువుకుంటున్నారు. అందుకోసం స్టూడెంట్ బస్‌పాస్‌లు తీసుకుని ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఉదయం 10 గంటలకు కళాశాలలు ప్రారంభమవుతాయి. అంటే 8.30 నుంచి 9 గంటల మధ్యలో వారివారి గ్రామాల నుంచి బయలుదేరాలి. కానీ, ఆ సమయంలో ఒకేఒక్క ఆర్టీసీ బస్సు మాత్రమే ఉంటోంది. అధిక సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరత్రా పనులపై పట్టణాలకు బయలుదేరే ప్రజలతో ఆ బస్సు కాస్తా కిక్కిరిసిపోతోంది.
విద్యార్థులు డోర్ వద్ద వేలాడుతూ నిత్యం నరకం చూస్తున్నారు. యువకులు ఒంటికాలిపై నిలబడి ఎలాగోలా ప్రయాణిస్తుండగా, యువతుల మాత్రం కాలుపెట్టేందుకు కూడా ఖాళీలేని బస్సుల్లో ప్రయాణించలేక ఆటోలను ఆశ్రయిస్తున్నారు. బస్‌పాస్‌లు ఉన్నప్పటికీ ఆటోలకు అదనంగా ఖర్చుచేస్తున్నారు. ఇదంతా ఎక్కడో పశ్చిమ ప్రకాశంలోని మారుమూల పల్లెల్లో అనుకుంటే పొరపాటే. జిల్లా నడిబొడ్డునున్న రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖామంత్రి శిద్దా రాఘవరావు సొంత నియోజకవర్గమైన దర్శిలో. ఈ నియోజకవర్గంలోని దొనకొండ-దర్శి, బొద్దికూరపాడు-దర్శి, తూర్పుగంగవరం-దర్శి, ఇతర అన్ని రూట్లలో విద్యార్థులకు నిత్యం ఇలాంటి సినిమా కష్టాలు తప్పడం లేదు. దర్శి పట్టణంలో చదువుకునే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఉదయం, సాయంత్రం మరో బస్సును అదనంగా తిప్పి ఈ సమస్య పరిష్కరించాలంటూ యువతీయువకులు ఇప్పటికే అనేకసార్లు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. అయినాగానీ సమస్య పరిష్కారం కాకపోవడంతో... మంత్రిగారూ..ఇలాగైతే మేమంతా చదువుకునేదెలా అంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.