సబ్‌ప్లాన్ ఫెయిల్ | Sub plan Fail | Sakshi
Sakshi News home page

సబ్‌ప్లాన్ ఫెయిల్

Published Thu, Dec 26 2013 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

సబ్‌ప్లాన్ ఫెయిల్

సబ్‌ప్లాన్ ఫెయిల్

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూపొందించిన సబ్‌ప్లాన్‌ను సర్కారు పరిహాసం చేస్తోంది. చట్టం అమలుకు నియమ నిబంధనలను రూపొందించకుండా...

=ఏడాదైనా కేటాయింపులు లేవు
 =అభివృద్ధికి దూరంగా ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు

 
 విశాఖ రూరల్, న్యూస్‌లైన్ :  ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూపొందించిన సబ్‌ప్లాన్‌ను సర్కారు పరిహాసం చేస్తోంది. చట్టం అమలుకు నియమ నిబంధనలను రూపొందించకుండా,విడుదల చేయకుండా ఆ రెండు వర్గాల సంక్షేమానికి తూట్లు పొడుస్తోంది. రాజకీయ లబ్ధి కోసం ఆగమేఘాల మీద ఈ ఏడాది జనవరి 24న ఈ చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దాని ప్రచారానికి రూ. కోట్లు ఖర్చు పెట్టింది. కానీ 27 శాఖలకు సంబంధించి వారి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం. ఫలితంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ
 
 ఆవాసాల్లో మౌలిక వసతులు కొరవడ్డాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. రాష్ర్ట స్థాయిలో సోషల్ వె ల్ఫేర్‌కు రూ.2170.28 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు, నీటి పారుదల శాఖకు రూ.1050 కోట్లు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు రూ.600 కోట్లు, హౌసింగ్‌కు రూ.600 కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.350 కోట్లు, గ్రామీణ నీటి సరఫరాకు రూ.200 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.100 కోట్లు, స్కూల్ ఎడ్యుకేషన్‌కు రూ.453 కోట్లు, ఫ్యామిలీ వెల్ఫేర్‌కు రూ.311 కోట్లు, మహిళా, శిశు సంక్షేమానికి రూ.198 కోట్లు, విద్యుత్‌కు రూ.100 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.210 కోట్లు, ప్లానింగ్‌కు రూ.120 కోట్లు ఇలా 26 శాఖలకు మొత్తంగా 7927.45 కోట్లు మంజూరు చేసింది.

సబ్‌ప్లాన్ వచ్చిన 9 నెలలకు చట్టం అమలు, నిధుల కేటాయింపులు, వాటిని ఏ విధంగా ఖర్చు చేయాలి వంటి విషయాల పర్యవేక్షణకు నవంబర్‌లో జిల్లా స్థాయి మోనిటరింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. దీనికి చైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కన్వీనర్‌గా ఐటీడీఏ పీవో, అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులను సభ్యులుగా చేర్చింది. అయినా చట్టం అమలుకు సంబంధించిన విధి విధానాలను ఇప్పటికీ పూర్తి స్థాయిలో రూపొందించలేదు.
 
అభివృద్ధి దూరంగా ఎస్సీ, ఎస్టీ ఆవాసాలు
 
జిల్లాలో సుమారు 175 ఎస్సీ, 3696 ఎస్టీ మొత్తంగా 3871 గ్రామాలు ఉన్నాయి. వీటిలో 693 కాలనీలకు కనీసం రోడ్డు మార్గాలు లేవు. 390 ఆవాసాలు విద్యుత్ సౌకర్యం లేక అంధకారంలో మగ్గుతున్నాయి. ఏజెన్సీలో 245 ఎస్టీ కాలనీలకు డ్రైనేజీ సదుపాయం లేక అధ్వాన్నంగా ఉన్నాయి. 47 గ్రామాలకు తాగు నీటి సదుపాయం లేదు. ఇలా అనేక ఎస్సీ, ఎస్టీ హేబిటేషన్లు సదుపాయాలకు దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సబ్‌ప్లాన్ ద్వారా నిధుల కేటాయింపులు జరిగితే ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయని ఆయా వర్గాలు సంబరపడ్డాయి. కానీ  ఏడాదవుతున్నా ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో సబ్‌ప్లాన్ కింద చేపట్టాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, పనులు ఒక్కటీ ముందుకు సాగలేదు. చట్టం రాకముందు సాధారణ నిధులలో కొంతైనా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి వినియోగించేవారు.
 
ఈ సబ్‌ప్లాన్ అమలులోకి వచ్చిన తరువాత దీని కింద కేటాయింపులు జరగకపోవడం, సాధారణ నిధులలో కూడా వీరి అభివృద్ధికి వినియోగించకపోవడంతో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి దయనీయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓట్లను కొల్లగొట్టడానికే మాత్రమే చట్టాన్ని చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement