సబ్‌‘ప్లాన్’ | subplan | Sakshi
Sakshi News home page

సబ్‌‘ప్లాన్’

Published Thu, Nov 14 2013 4:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

subplan

సాక్షి ప్రతినిధి, నెల్లూరు :  సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్టుగా మారింది ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగం వ్యవహారం. ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న సబ్‌ప్లాన్ నిబంధనలకు అధికార పార్టీ నేతలే తూట్లు పొడుస్తున్నారు. సబ్‌ప్లాన్ కింద విడుదలైన నిధులను ఎస్సీ,ఎస్టీలు నివాసం ఉంటున్న కాలనీల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సి ఉన్నా అధికార పార్టీ నాయకులు తమకు ఇష్టమున్న ప్రాంతాల్లో ఖర్చు పెట్టాలని అధికారులపై ఒత్తిడి
 
 తెస్తూ, ఆ మేరకు పనులు చేజిక్కించుకుంటున్నారు. అందుకు వారు రకరకాల అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ఈ తరహాలో పనులు చేపడుతోంది మారుపల్లెల్లో కాదు. ఏకంగా జిల్లా కేంద్రమైన నెల్లూరులో కావడం గమనార్హం. ఈ పనుల కేటాయింపులు, నిధుల వినియోగం మొత్తం సొమ్మొకరిది..సోకొకరిది అన్నట్టుగా మారుతోంది. నెల్లూరు రూరల్ శాసనసభ్యులు ఆనం వివేకానందరెడ్డి అనుచరులైన మాజీ కార్పొరేటర్లు కొందరు కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి తెచ్చి అడ్డంగా పనులు చేసుకుంటున్నారు. ఎస్సీ,ఎస్టీలు లేని ప్రాంతాల్లో పనులకు అనుమతులు తెచ్చుకుంటూ నిధులను దారి మళ్లిస్తున్నారు. ఇంకొందరు ఎస్సీలు లేని కాలనీలకు ఎస్సీ కాలనీలుగా పేర్లు మార్చి కాంట్రాక్టులు పొందుతున్నారు.
 
 నగరంలో ఎప్పుడో ఎస్సీ,ఎస్టీలు నివాసం ఉండి అక్కడ నుంచి స్థానభ్రంశం చెందిన ప్రాంతాలను ఇప్పుడు వారు నివాసం ఉంటున్నట్టు చూపించి పనులు చేపడుతున్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమల్లోకి వచ్చిన తరువాత మొదటివిడతగా నెల్లూరు కార్పొరేషన్‌కు రూ. 4.98 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధుల్లో పాతికభాగం సబ్‌ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టేందుకు అనుమతించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మూలాపేట ప్రాంతంలోని పెన్షన్ వీధిలో ఎస్సీ కుటుంబాలు లేవు. ఇప్పటికే ఇక్కడ కార్పొరేషన్ సాధారణ నిధులతో రోడ్డు నిర్మించారు. మళ్లీ ఈ వీధిలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 20 లక్షల సబ్‌ప్లాన్ నిధులు విడుదల చేశారు.
 
 ఒకటి రెండు రోజుల్లో ఈ రోడ్డు పనులు ప్రారంభించేందుకు కార్పొరేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రూరల్ ఎమ్మెల్యే ఆనం అనుచరుడైన ఒక మాజీ కార్పొరేటర్ ఈ పనిని తన అనుచరులకు ఇప్పించుకున్నారు. శాంతినగర్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణం పూర్తి కొద్దిరోజుల కిందట పూర్తి  చేశారు. అయితే ఈ రోడ్డుకు ఎస్సీలు నివాసం ఉంటున్న వీధిగా రికార్డుల్లో చూపించి అనుమతులు తెచ్చుకున్నారు. ఎస్టీలు లేని సాదావారిపాలెం, చాకలివీధి తదితర ప్రాంతాలను ఎంపిక చేసి సబ్‌ప్లాన్ నిధులతో డ్రైన్లు, రోడ్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చిన కొన్ని పనులకు కేవలం డివిజన్ నంబర్లు మాత్రమే సూచించి అవి ఏ ప్రాంతాలు అనేది తెలియకుండా గోప్యత పాటిస్తున్నారు. ఈ రకంగా పెద్ద ఎత్తున సబ్‌ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారు. ఈ తరహా పనులు కోటిన్నర రూపాయలకు పైగా ఉన్నట్టు అధికారపార్టీ నాయకుల్లోనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సబ్ ప్లాన్ ఉద్దేశం నెరవేరే అవకాశాలు లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement