సాక్షి, నెల్లూరు: ఇందిర జలప్రథ పథకంతో ఎస్సీ,ఎస్టీల భూములు అభివృద్ధి చేసి బంగారు పంటలు పండిస్తున్నామని కిరణ్ సర్కారు గొప్పలు చెబుతోంది. మరోవైపు ఈ పథకం ముసుగులో కొందరు అధికారులు, అధికార పార్టీ నేతలు కలిసి కోట్లు స్వాహా చేస్తున్నారు. కొన్ని చోట్ల బోర్లు వేయకుండానే వేసినట్లు బిల్లులు చేసుకుంటుండగా, మరికొన్ని చోట్ల బోర్లలోని మోటార్లు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. కోట్లు మంజూరైనా భూములు బాగుపడకపోవడంతో లబ్ధిదారులు మాత్రం కూలీలుగానే మిగిలిపోయారు. ఈ పథకంలో భారీ ఎత్తున జరిగిన అవినీతిపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందినా జిల్లా అధికారుల్లో మాత్రం స్పందన కరువైంది. సాక్షాత్తు కలెక్టర్ శ్రీకాంత్ చీవాట్లు పెట్టినా స్పందించే పరిస్థితి కనిపించడం లేదు. అక్రమార్జనలో పలువురు జిల్లా అధికారులకు వాటాలు అందడంతోనే చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
25 వేల ఎకరాల అభివృద్ధి లక్ష్యం
ఎస్సీ, ఎస్టీలకు చెందిన 25 వేల ఎకరాలను ఇందిర జలప్రభతో అభివృద్ధి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఐదు నుంచి పది ఎకరాలను ఓ బ్లాకుగా ఏర్పాటు చేసి చదును చేయడంతో పాటు బోర్లు,మోటార్లు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించడం, మొక్కలు నాటడం ఈ పథకంలోని ప్రధాన ఉద్దేశాలు. ఇందుకోసం జిల్లాకు నాబార్డు నుంచి రూ.20 కోట్లు, ఉపాధి హామీ పథకం ద్వారా రూ.20 కోట్లు మంజూరయ్యాయి. డ్వామా ఆధ్వర్యంలో పథకం అమలు జరుగుతోంది.
అంతా కాకిలెక్కలే
ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 23,940 ఎకరాలను గుర్తించి, 22,800 ఎకరాలను చదును చేశారు. 1752 చోట్ల బోరు బావులు తవ్వాలని నిర్ణయించి, భూగర్భ జలాలు ఉన్న 1387 చోట్ల తవ్వారు. 1,244 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయి. వాటిలో 745 బోర్లకు మోటార్లు బిగించి విద్యుత్ సౌకర్యం కల్పించారు. అయితే అధికారులు చెబుతున్న అభివృద్ధి అంతా రికార్డులకే పరిమితమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాల వెల్లువ
ఈ పథకాన్ని అడ్డు పెట్టకుని కింది స్థాయి అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతలు లక్షలు దండుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆత్మకూరు, ఉదయగిరి తదితర ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఏఎస్‌పేట మండలం చౌట భీమవరం పంచాయతీలో బోర్లు వేయకుండానే రూ.4,52,396 స్వాహా చేసినట్లు గ్రామస్తులు కలెక్టర్ శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఒక్క బోరు బావి కూడా తవ్వకుండానే స్థానిక ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు నిధులు స్వాహా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన కలెక్టర్ అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు ఎందుకు పెట్టలేదంటూ డ్వామా పీడీ గౌతమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాపురం మండలం తుమ్మలతలుపూరులో అయితే ఏకంగా మోటార్లు అమ్మేసుకున్నారు. మర్రిపాడు మండలంలో అధికారులే మోటార్లు అమ్మేసుకున్నారని ఆరోపణలున్నాయి.
నిధుల స్వాహానే లక్ష్యంగా..
పథకం అమలు జరుగుతున్న తీరు చూస్తుంటే అడుగడుగునా నిధుల స్వాహానే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఎస్సీ,ఎస్టీల భూములను అధికారులు గుర్తించాలి. అయితే కొందరు అధికారులను లంచాలతో మచ్చిక చేసుకున్న నాయకులు తమ భూములనే చూపినట్లు సమాచారం.
పలుచోట్ల ఇప్పటికే సాగులో ఉన్న భూములను చూపి ప్రజల సొమ్ము కొల్లగొట్టినట్లు తెలిసింది. బోరుబావులు 80 శాతం 80 నుంచి 100 అడుగుల లోపే ఉండగా 200 నుంచి 250 అడుగుల తవ్వినట్లు బిల్లులు చేసుకున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన వారు విద్యుత్ కనెక్షన్లలోనూ చేతివాటం ప్రదర్శించారు. ఇక మోటార్ల విషయానికొస్తే నాసిరకమైనవి బిగించి రికార్డుల్లో మాత్రం ప్రముఖ కంపెనీల మోటార్లు బిగించినట్లు పేర్కొన్నట్లు సమాచారం. కొన్నిచోట్లయితే పాత మోటార్లే బిగించి, కొత్తమోటార్లుగా చూపినట్లు తెలుస్తోంది. పలు ప్రాంతాల్లో అయితే మోటార్లను కిందిస్థాయి అధికారులు అమ్మేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమాల అధికారులు
ఇందిర జలప్రభలో అక్రమాలకు అంతేలేదు. డ్వామాలో ఫీల్డు అసిస్టెంట్ మొదలుకొని టెక్నికల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్, ఏపీఓ నుంచి ఏపీడీ వరకు 80 శాతం మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. వీరిలో పలువురు భయము, బాధ్యత మరిచి అధికారులు, కిందిస్థాయి సిబ్బందితో కలిసి అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే అక్రమాలు వెలుగులోకి వస్తాయని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.
అవినీతి ప్రభ
Published Wed, Feb 12 2014 2:53 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement