
సుబ్రమణ్యం శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రమణ్యం శ్రీరామ్, అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ)గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్లు ఖరారైనట్లు తెలిసింది. నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా వీరి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత వీరి నియామకానికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు అడ్వొకేట్ జనరల్‌ను గవర్నర్ నియమిస్తారు. న్యాయవ్యవస్థలో అడ్వొకేట్ జనరల్ పోస్టుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ పోస్టు రాజ్యాంగబద్ధమైంది. ఏజీ నియామకం పూర్తయిన తరువాత ఆయన సొంత టీంను ఏర్పాటు చేసుకుంటారు.
ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నియమితులైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, వివిధ కార్పొరేషన్లకు స్టాండింగ్ కౌన్సిళ్లుగా వ్యవహరిస్తున్న న్యాయవాదులు తమ తమ పోస్టులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వీరి స్థానంలో కొత్త అడ్వొకేట్ జనరల్ అవసరాన్ని బట్టి ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాదులను నియమించుకుంటారు. జూన్ 3వ తేదీ నుంచి హైకోర్టు వేసవి సెలవులు పూర్తి చేసుకుని తన కార్యకలాపాలను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో, కేసుల విచారణ సందర్భంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఆ లోపు ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామకాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నియామకాల విషయంలో అడ్వొకేట్ జనరల్‌కు జగన్‌మోహన్ రెడ్డి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలిసింది. ప్రతిభ ఆధారంగానే నియామకాలు చేపట్టాలని ఏజీకి జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్ధేశం చేసినట్లు సమాచారం.