యాలాల, న్యూస్‌లైన్: ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందించే వివిధ రకాల విత్తనాల పర్మిట్లు ఇకపై ‘మీ సేవ’లో ముందస్తుగా దరఖాస్తు చేసుకున్న వారికే అందనున్నాయి. ఇందుకు కోసం వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. అవసరమైన మేరకే సబ్సిడీ విత్తనాలను రైతుకు అందించడంతో పాటు దుర్వినియోగాన్ని తగ్గించేందుకు ‘మీ సేవ’ సర్వీసును అనుసంధానం చే యనున్నట్లు తెలుస్తోంది. వచ్చే రబీసీజన్ నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రబీ సీజన్ నుంచి వేరుశనగ, శనగ, కుసుమ, జొన్న తదితర పంటలను రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఆయా పంటలకు సంబంధించి సబ్సిడీ విత్తనాలను వ్యవసాయ శాఖాధికారులు ప్రతి యేడాది రైతులకు అందజేస్తుంటారు. 50 శాతం నుంచి 70 శాతం మేలు రకం విత్తనాలను ప్రభుత్వం అందిస్తుంది. విత్తనాల పంపిణీలో భాగంగా ఆయా మండలాల వ్యవసాయాధికారులు రైతుల భూమి పట్టా పుస్తకాలకనుగుణంగా పర్మిట్లు ఇచ్చేవారు. దీంతో రైతులు సబ్సిడీ విత్తనాల కోసం వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరగడమే కాక కొన్నిసార్లు భారీ క్యూలలో వేచి చూడాల్సి వచ్చేది. ఈ సమస్యలను అధిగమించడంతో పాటు సబ్సిడీ విత్తనాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో పర్మిట్ల ప్రక్రియను ‘మీ సేవ’తో అనుసంధానం చేస్తున్నారు
.
‘మీసేవ’లో ఎలా తీసుకోవాలంటే...
కుల, ఆదాయ ద్రువీకరణ పత్రాలను ఎలాగైతే ‘మీ సేవ’ ద్వారా తీసుకుంటారో అదే ప్రక్రియలో సబ్సిడీ విత్తనాల కోసం రైతులు ముందుగా రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సబ్సిడీ పోగా మిగిలిన రుసుంను చెల్లించిన రైతుతో పాటు భూమి, పట్టా పుస్తకం నంబరు, సర్వేనంబర్ తదితర వివరాలతో కూడిన ఓ టోకెన్‌ను అందజేస్తారు. ‘మీ సేవ’ లో రైతు దరఖాస్తు చేసుకున్న అనంతరం, ఆ రైతుకు సంబంధించిన వివరాలు ఆయా మండలాల సబ్సిడీ జాబితాలో చేర్చుతారు. సబ్సిడీ విత్తనాల కోసం వెళ్లిన రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత వ్యవసాయ కార్యాలయంలో నిక్షిప్తమై ఉండటంతో టోకెన్ పొందిన రైతు నేరుగా సబ్సిడీ విత్తనాలు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కో రైతుకు ఒక హెక్టారుకు సంబంధించి సబ్సిడీ విత్తనాలు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
యంత్రపరికరాలు కూడా...
విత్తనాలతో పాటు వ్యవసాయ పనుల కోసం సబ్సిడీపై ఇచ్చే యంత్ర పరికరాలు, పనిముట్ల గురించి కూడా ముందస్తుగా ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకున్న వారికే అందజేసేందుకు చర్య లు తీసుకుంటున్నారు. కల్టివేటర్లు, రోటోవేటర్లు తదితర వాటిని తీసుకునే రైతులు ముం దుగా ‘మీ సేవ’లో దరఖాస్తు చేసుకుంటేనే సబ్సిడీ వర్తించే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ‘మీ సేవ’ల చుట్టూ తిరిగిన వారున్నారు. ఈ క్రమంలో సబ్సిడీ విత్తనాల పర్మిట్లు మీసేవకు అనుసంధానం చేస్తుండటంపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సబ్సిడీ పర్మిట్లు ఇక ‘మీ సేవ’లో !
Published Mon, Aug 12 2013 1:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement