ఉద్యమానికి ఉత్తేజం
Published Sun, Oct 27 2013 3:58 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : సమైక్య శంఖారావం సభ కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం కావడం సమైక్యవాదుల్లో ఉత్తేజాన్ని నింపింది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో శనివారం సభ నిర్వహించిన తీరు, ప్రతికూల పరిస్థితుల్లోనూ లక్షలాది మంది హాజరు కావడం అందరినీ అశ్చర్యపరిచింది. ఎడతెరిపిలేకుండా వర్షాలు కరుస్తుండటంతో అసలు సభ జరుగుతుందో లేదోననే అనుమానాలు అంతటా వ్యక్తమయ్యాయి. రవాణా సదుపాయాలు కూడా అంతంతమాత్రంగా ఉండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌తోపాటు అభిమానులు, సమైక్యవాదులు ఆందోళన చెందారు. శంఖారావం సభకు వెళ్లాలనే సంకల్పం ఆ అనుమానాలు, భయాలను పటాపంచలు చేసింది.
అడ్డంకులను అధిగమించి..
తొమ్మిదో నంబర్ జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలకు ఇబ్బంది తలెత్తినా.. ప్రత్యామ్నాయ మార్గంలో చాలామంది హైదరాబాద్ చేరుకున్నారు. మార్గమధ్యంలో సమైక్యవాదులు ప్రయూణించిన బస్సులు, కార్లను నల్గొండ, వరంగల్ జిల్లాల్లో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వర్థన్నపేట వద్ద దెందులూరు, ఉంగుటూరు నుంచి వెళ్లిన 30కిపైగా బస్సులను ఆపి వెనక్కు వెళ్లిపోవాలని బెదిరించినా లెక్కచేయలేదు. వైసీపీ శ్రేణులు, సమైక్యవాదులు వారితో గొడవపడి.. పోలీసుల సాయంతో హైదరాబాద్ చేరుకున్నారు. తణుకు, ఆచంట నుంచి వెళ్లిన బస్సులపైనా తెలంగాణవాదులు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇలా అడుగడుగునా అడ్డంకులు ఎదురైనా వేలాదిమంది పట్టువిడవకుండా సభకు హాజరై తమ సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు.
ఉత్సాహం నింపిన వైఎస్ జగన్ ప్రసంగం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించిన తీరు పార్టీ క్యాడర్‌తోపాటు సమైక్యవాదులను ఆకట్టుకుంది. ‘ఢిల్లీ కోటను బద్దలు కొడదాం’, ‘ఢిల్లీ అహంకారానికి, తెలుగుజాతి ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరాటం ఇది’ వంటి పదునైన మాటలతో.. రావి నారాయణరెడ్డి భావజాలాన్ని ఉటంకిస్తూ వైఎస్ జగన్ చేసిన ప్రసంగం అందరినీ ఆలోజింపజేసింది. విభజన వల్ల ఏర్పడే దుష్పరిణామాలను స్పష్టం చేయడంతోపాటు కవితాత్మక ధోరణిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగం గతం కంటే భిన్నంగా సాగి అందరినీ ఆకట్టుకుంది. ఉద్యోగులు, వ్యాపారులతోపాటు అన్ని రంగాలవారు సభా విశేషాలను, జగన్ ప్రసంగాన్ని టీవీల్లో ఆసక్తిగా తిలకించారు. మహిళలు సైతం టీవీలకు అతుక్కుపోయి సమైక్య శంఖారావ సభను వీక్షించారు.
కొత్త కోణం
తెలంగాణకు చెందిన వారు సైతం ఈ సభలో పాల్గొనడం సమైక్య ఉద్యమంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సభ విజయంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటికే ఉద్యమంలో కీల కపాత్ర పోషిస్తున్న శ్రేణులు సభ సక్సెస్ తర్వాత దానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉద్యమ బాధ్యతను మరింతగా భుజాన కెత్తుకునేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.
Advertisement
Advertisement