సాక్షి, అనంతపురం : రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ‘అనంత’లో సమైక్య ఉద్యమం మిన్నంటింది. వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన బంద్ పిలుపునకు పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు, వివిధ ప్రజా సంఘాలు స్పందించాయి. ఫలితంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు మూతపడ్డాయి. సమైక్య వాదులు ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. సోనియా గాంధీ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద పోలీసులు బందోబస్తు చేపట్టారు. పార్టీ కార్యాలయాల వద్ద కంచెలు వేశారు. ఆర్ట్స్ కళాశాల హాస్టల్ విద్యార్థులు బయటకు రాకుండా కట్టడి చేశారు. హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని హుకుం జారీ చేయడంతో కొందరు విద్యార్థులు ససేమిరా అన్నారు. దీంతో పలువురిని బలవంతంగా పంపించేశారు.
అనంతపురంలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ శంకరనారాయణ ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచి బంద్ పాటించారు. ర్యాలీ నిర్వహించి సప్తగిరి సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి యూపీఏ దిష్టి బొమ్మను దహనం చేశారు. మధ్యాహ్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. విభజన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్‌లో ఉద్యోగులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు ఓపీ సేవలను బహిష్కరించి నిరసన తెలిపారు. వైద్య ఆరోగ్య జేఏసీ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్‌యూసీఐ, యువ జేఏసీ ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారధి, మాజీ ఎంపీ కాలవ శ్రీనివాసులు, మహాలక్ష్మి శ్రీనివాసులు ర్యాలీ నిర్వహించి ఆర్ట్స్ కళాశాల హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు.
రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. రాజకీయ జేఏసీ, ఆర్టీసీ, ఏపీ ఎన్‌జీఓలు మద్దతు తెలిపారు. ధర్మవరం, బత్తలపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు వేర్వేరుగా ఆందోళన చేసి బంద్ పాటించారు. గుంతకల్లు, గుత్తిలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. పామిడిలో రాస్తారోకో చేశారు. హిందూపురంలో నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. విశాలాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువాలు, జెండాలను దహనం చేశారు. టీడీపీ నాయకులు, ఏపీ ఎన్‌జీఓలు ర్యాలీ చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. కదిరిలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్తలు ఇస్మాయిల్, షాకీర్.. కళ్యాణదుర్గంలో తిప్పేస్వామి.. పెనుకొండలో మంగమ్మ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది.
పుట్లూరు మండలంలో వైఎస్‌ఆర్ సీపీ నేత ఆలూరి సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. మడకశిరలో జిల్లా అధికార ప్రతినిధి వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ర్యాలీ, రాస్తారోకో చేశారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో టైర్లకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. అమరాపురం, అగళి, గుడిబండ, అమడగూరు, నల్లమాడ, బుక్కపట్నం, సోమందేపల్లి, పరిగి, రొద్దం, గోరంట్ల, రాప్తాడు, కనగానపల్లి, ఆత్మకూరు, సీకేపల్లి, రామగిరి, ఉరవకొండ, వజ్రకరూరు, కూడేరు, బెళుగుప్ప, కణేకల్లు, గుమ్మఘట్ట, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు బంద్ నిర్వహించారు. పెనుకొండలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. బుక్కరాయసముద్రంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారధి, ఎమ్మెల్సీ శమంతకమణి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు పైలా నర్సింహయ్య, సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరం నాగిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బంద్ పాటించారు. విడపనకల్లులో కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, శనివారం కూడా బంద్ కొనసాగించాలని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులకు పిలుపునిచ్చారు.
వైఎస్‌ఆర్‌సీపీ బంద్ విజయవంతం
Published Sat, Dec 7 2013 6:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement