అట్టుడికిన కలెక్టరేట్
- అఖిల పక్షం ఆధ్వర్యంలో ముట్టడి విజయవంతం
- నాయకులను అరెస్టు చేసిన పోలీసులు
- కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయిన ఆందోళనకారులు
అనంతపురం: మున్సిపల్ కార్మికులను కనీస వేతనాలు చెల్లించాలన్న డిమాండ్‌తో అఖిలపక్షం శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయ ముట్డడి కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఆందోళనలో పాల్గొనడంతో కలెక్టరేట్ కార్యాలయం అట్టుడికిపోయింది. సీఐలు శుభకుమార్, రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్‌ఐలు కె. వెంకటరమణ, నాగమధు, క్రాంతికుమార్, రఫీక్, జీటీ నాయుడు, సిబ్బంది కలెక్టరేట్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడి సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు ఆందోళనకారులు కలెక్టరేట్ గేటును తోసుకుని కార్యాలయంలోకి చొచ్చుకుపోయి.. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ముట్టడి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నదీం అహమ్మద్, మీసాల రంగన్న, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, సీపీఐ నాయకులు జాఫర్, ఏఐటీయూసి నాయకులు కె.రాజారెడ్డిలను వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఓబుళ, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రాంభూపాల్, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఆందోళనకారులు కలెక్టరేట్ కార్యాలయంలోకి వెళ్లి అరగంట పాటు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి డౌన్..డౌన్.. మంత్రి నారాయణ ఖబర్దార్ అంటూ.. నినాదాలు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
అనంతరం కలెక్టరేట్ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూవజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.రాజీవ్‌రెడ్డి, విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సోమశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ జానకి, సీపీఎం కార్పొరేటర్ భూలక్ష్మి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కొనరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ లారీ అసోసియేషన్ నాయకలు రంగ, విశ్వనాథ్‌రెడ్డి, పీరా, జేఎం బాషా, రిలాక్స్ నాగరాజు, భవన కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యాక్షుడు గౌసుల లక్ష్మన్న, నారాయణస్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బీసీఆర్ దాస్, మున్సిపల్ కార్మిక జేఏసీ నాయకలు గోపాల్, పెన్నోబులేసు, నరసింహులు, పెద్దన్న, ఆటో యూనియన్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఇంతియాజ్, సీపీఎం నాయకులు వలి, రాంరెడ్డి, నాగరాజు, నల్లప్ప, కే.వీరన్న, వందలాది మంది మున్సిపల్ కార్మికులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.