మహాత్ముడు కలలుగన్న పరిశుభ్ర భారతావనిని ఆవిష్కరించాలన్న మహోన్నత లక్ష్యంతో ప్రధాని మోదీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ ఉద్యమ పిలుపు కొందరి ప్రచార కండూతిని తీర్చే కార్యక్రమంగా మారుతోంది.
దేశం మొత్తాన్ని పరిశుభ్రం చేయాలన్న మంచి ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ 'స్వచ్ఛభారత్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కొంతమంది దాన్ని సజావుగానే చేస్తూ ఎంతోకొంత స్ఫూర్తినిస్తున్నారు. అయితే.. బీజేపీ మిత్రపక్షం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారపక్షమైన టీడీపీ ఎమ్మెల్యే ఒకరికి మాత్రం ఈ కార్యక్రమం కేవలం ప్రచారపర్వంగానే ఉపయోగపడింది. ఉన్న చెత్తను తుడవాల్సింది పోయి.. కొత్తగా చెత్త తెప్పించి, అక్కడ చల్లించి మరీ దాన్ని తుడిచినట్లుగా ఫొటోలకు పోజులిచ్చారు. తాను అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేనన్న విషయమే మర్చిపోయారో, లేక అసలు ఏదో చేపట్టాలి కాబట్టి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు వచ్చారో గానీ శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తన అనుచరులతో కలిసి ఈ కార్యక్రమం మొత్తాన్ని ఒక ఫార్సుగా మార్చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లి ఆదిత్యుని సాక్షిగా జరిగిన తంతు ఇదే. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో మూడు రోజులు స్వచ్ఛభారత్ నిర్వహించాలని దేవాదాయ శాఖ ఆదేశించింది. ఆ మేరకు అరసవల్లి దేవస్థానంలో మంగళవారం ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులను ఆహ్వానించారు. కానీ ఆలయం అంతటినీ సిబ్బంది యథా ప్రకారం ఉదయమే శుభ్రపరిచేశారు. అక్కడ స్వచ్ఛభారత్ చేయడం ఎలా అనుకున్నారో ఏమో గానీ.. అక్కడున్న పనివారితో బయట నుంచి చెత్త తెప్పించి ఆలయ ఆవరణలో పోయించారు. ఆనక ఎమ్మెల్యే తదితరులు చీపుళ్లు పట్టుకున్న ఆ చెత్తను ఊడ్చుతున్నట్లు ఫొటోలకు ఫోజులిచ్చారు. కార్యక్రమం అయ్యిందనిపించారు!
- ఫొటోలు కె. జయశంకర్, సాక్షి ఫొటోగ్రాఫర్