ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు | Sugar cane farmers concerned in Bobbili | Sakshi
Sakshi News home page

ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు

Published Sun, Sep 7 2014 1:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు - Sakshi

ఆగ్రహానికి ఆజ్యం పోసిన అరెస్ట్‌లు

 బొబ్బిలి: లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న చెరుకు రైతులు ఆందోళన ఉద్ధృతం చేశారు... జోరువానలోనూ రోడ్డెక్కి నినదించారు. పార్వతీపురం డివిజన్‌లోని లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో దాదాపుగా అన్ని మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున శనివారం రహదారుల దిగ్బంధంలో పాల్గొన్నారు. రైతు సంఘ నాయకులు బయట ఉంటే ఉద్యమం మరింత ఉద్ధృతమవుతుందన్న ఉద్దేశ్యంతో శుక్రవారం అర్థరాత్రి  నలుగురు చెరకు రైతు సంఘ నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. పార్వతీపురంలో రెడ్డి శ్రీరాంమూర్తిని, సాలూరులో గేదెల సత్యనారాయణను, సీతానగరంలో రెడ్డి ఈశ్వరరావును, రెడ్డియ్యవలసలో రెడ్డి లక్ష్ముంనాయుడులను ఇళ్ల వద్ద నుంచి తీసుకు వెళ్లి అరెస్టు చేశారు.  ఈ విషయం తెలుసుకున్న రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని   నిర్ణయించారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా తడుస్తూనే పోరాటాన్ని కొనసాగించారు.  
 
 ఆరు గంటల నుంచే ఆందోళన
 డివిజన్‌లోని బొబ్బిలి, బలిజిపేట, సీతానగరం, మక్కువ, బాడంగి, తెర్లాం తదితర మండలాల్లో రైతులంతా ఏపీ చెరకు రైతు సంఘం ఇచ్చిన పిలుపుమేరకు శనివారం ఉదయమే నాటుబళ్ల, టైరు బళ్లతో రహదారులపైకి  రావడం మొదలుపెట్టారు. పక్కి, చింతాడ, కోమటిపల్లి, కారాడ, అలజంగి, పణుకుపేట, అంటిపేట, కాశయ్యపేట, పిరిడి, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో నాటుబళ్లనురోడ్డుకు అడ్డంగా పెట్టి ఆందోళనలు చేశారు.  బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన రైతులు టైరుబళ్లను తీసుకొని బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్సు వద్దకు చేరుకున్నారు. ఇక్కడ ఏపీచెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటియు నాయకుడు రెడ్డి వేణు,పి శంకరరావు తదితరుల ఆధ్వర్యంలో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పార్వతీపురం న్యాయమూర్తి కారును అడ్డుకున్నారు.  న్యాయమూర్తి వాహనానికి దారి ఇవ్వాలని  పోలీసులు కోరినా మాకే న్యాయం లేదని మేం రోడ్డుమీదకు వస్తే మీకు దారికావాలా అంటూ ఆ వాహనం ముందుకు వెళ్లి నినాదాలు చేశారు..దీంతో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నుంచి మొదలైంది..
 
 నాయకుల అరెస్టు... పోలీసులతో వాగ్వాదం
 బొబ్బిలి కాంప్లెక్స్ జంక్షనులో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నాయకులనుడీఎస్‌పీ ఇషాక్ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మాత్తుగా అరెస్టు చేశారు.. అప్పటివరకూ మీడియాతో మాట్లాడుతున్న నాయకులను ఒక్కసారిగా పోలీసులు చుట్టుముట్టారు. రైతు సంఘ నాయకుడు మర్రాపు సూర్యనారాయణతో పాటు సీఐటీయూ నాయకుడు రెడ్డి నాయకుడు, రైతు సంఘ నాయకులు ఉడుముల భూషణరావు, తాళ్లపూడి వెంకటరమణలను అరెస్టు చేసి రామభద్రపురం పోలీస్ స్టేషనుకు తరలించారు. దీంతో అక్కడ పోలీసులకు, రైతులకు మధ్య తీవ్రస్తాయిలో వాగ్వాదం జరిగింది.   ‘‘మాకు రావలసిన బిల్లులు   అడగడం కోసం ఆందోళన చేస్తే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారని, అదే మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టిన వారి ఆస్తులకు కాపాలా కాసి, వారికి రాచమర్యాదలు చేస్తున్నారంటూ’’ దుయ్యబట్టారు.
 
 రోడ్డుపై బైఠాయించి మేం అందోళనను విరమించము. ఎంతమందిని పట్టుకెళ్తారో పట్టుకెళ్లండంటూ ఎదురుతిరిగారు.. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పుతుందనుకున్నారు. అయితే   పోలీసులే ఒక అడుగు వెనక్కి వేసి గంట కాలం ఆందోళన చేసుకోమని అనుమతి ఇచ్చి అక్కడ నుంచి వెళ్లి పోయారు. మధ్యాహ్నం రెండు గంటల వరకూ రైతులు ఆందోళనను చేశారు. అప్పటివరకూ వాహనాలు ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. అత్యవసర పరిస్థితులపై ఆస్పత్త్రి వెళ్లే వారి వాహనాలను రైతులు విడిచిపెట్టారు.  ఇక్కడ బందోబస్తు నిర్వహించేందుక ఆరు వందల మందికి అదనంగా   మరికొంత  మంది పోలీసులను విశాఖ జిల్ల నుంచి   రప్పించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement