సుజాతది ఆత్మహత్యే..
అనంతపురం క్రైం : ఏడాదికి పైగా మిస్టరీగా మిగిలిపోయిన న్యాయవాది ఎర్రిస్వామి భార్య సుజాత మిస్సింగ్ కేసు చిక్కుముడి దాదాపు వీడింది. జిల్లా ఎస్పీ ఎస్వీ రాజశేఖర్‌బాబు ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో దర్యాప్తు ముగింపు దశకు చేరుకుంది. గుర్తు తెలియనిదిగా పూడ్చిపెట్టిన సుజాత శవాన్ని మంగళవారం తహశీల్దారు సమక్షంలో వెలికితీసి వైద్య నిపుణుల బృందం రీపోస్టుమార్టం నిర్వహించింది. మృతదేహం ఎముకలు, ఎముకల మజ్జ సేకరించారు. వాటిని డీఎన్‌ఏ పరీక్షల కోసం హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపనున్నారు.
అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా ఈ కేసు పూర్తికానుంది. ఇప్పటిదాకా పోలీసులకు లభించిన ఆధారాలు, ఆనవాళ్లను పరిశీలిస్తే సుజాత రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చారు. వివరాలను ఎస్పీ రాజశేఖర్‌బాబు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘ఎర్రిస్వామికి 14 ఏళ్ల కిందట కంబదూరు మండలం మరిమేకలపల్లికి చెందిన సుజాతతో వివాహమైంది. వీరికి అమృతకర్, వర్షిత్‌కర్ అనే కుమారులు ఉన్నారు. జిల్లా కేంద్రంలోనే ఉండేవారు. ఖర్చులకు సరిపడా సంపాదన లేకపోవడంతో భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో రెండుసార్లు భర్తకు తెలీకుండా సుజాత పుట్టింటికి వెళ్లింది. ఇదే తరహాలో గతేడాది అక్టోబరు 29న కన్పించకుండా పోయింది. అదే ఏడాది నవంబరు 26న ఆమె తండ్రి బోయ చిన్న ఈరన్న కంబదూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఈ క్రమంలో అదే ఏడాది అక్టోబరులో ఓ గుర్తు తెలియని మహిళ శవం అనంతపురం సమీపంలోని నేషనల్ పార్కు వద్ద రైలుపట్టాలపై పడిఉంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శవం ఫోటోలను కంబదూరు పోలీసులకు ఇచ్చి గుర్తు పట్టమన్నారు. అయితే ఫోటోల్లో ఉన్న శవానికి నల్లటి గ్రీస్ అంటి ఉండడంతో గుర్తుపట్టేందుకు వీలు లేకుండా పోయింది.
సుజాత భర్త ఎర్రిస్వామి తన భార్య అదృశ్యంపై కొందరి వ్యక్తులపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు విన్నవించాడు. కేసును కంబదూరు పోలీస్‌స్టేషన్ నుంచి అనంతపురం టూటౌన్‌కు మార్చాలని విజ్ఞప్తి చేశాడు. దీంతో కేసును ఇక్కడికి బదిలీ చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ నేపథ్యంలో నేషనల్ పార్కు సమీపంలో రైలు కింద పడి మృతి చెందిన గుర్తు తెలియని మహిళ శవానికి, సుజాతకు పోలికలు పరిశీలించాం. ఇదే కోణంలో దర్యాప్తు సాగింది. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు (యూంటీమార్టం.. అంటే చనిపోక ముందు గాయూలు లేవని) పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. మృతురాలి చెంపపై పుట్టుమచ్చ ఉంది.
సుజాత ఫైల్ ఫోటోలను పరిశీలించగా పుట్టుమచ్చ సరిపోయింది. ఆమె ధరించిన చెవి కమ్మకు.. శవం వద్ద లభ్యమైన చెవికమ్మకు పోలిక ఉంది. వీటి ఆధారంగా ఆ శవం సుజాతదేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చామ’ని ఎస్పీ తెలిపారు. కాగా సుజాత అదృశ్యం వెనుక కొందరు బీజేపీ నాయకుల ప్రమేయమున్నట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేశామన్నారు. సుజాత ఉపయోగించిన సెల్‌ఫోన్ కాల్స్ డిటేల్స్‌ను తెప్పించి విశ్లేషించామన్నారు. ఇందులో బీజేపీ నాయకుల ప్రమేయం లేదని తేలిందన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.