‘సుజనా’ క్రియేటివ్స్‌.. మాయారాజ్యం | Sujana Chowdary scames Thousands of crores in the name of debt | Sakshi
Sakshi News home page

‘సుజనా’ క్రియేటివ్స్‌.. మాయారాజ్యం

Published Thu, Nov 29 2018 5:05 AM | Last Updated on Thu, Nov 29 2018 5:13 PM

Sujana Chowdary scames Thousands of crores in the name of debt - Sakshi

సాక్షి, బిజినెస్‌ ప్రత్యేక ప్రతినిధి:
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌!! 
కేమన్‌ ఐలాండ్స్‌!! 
ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌!! 
మారిషస్‌!!
పన్ను కట్టకుండా నల్లడబ్బును సొంత ఖాతాల్లోకి మళ్లించడానికి ఆర్థిక మోసగాళ్లు ఉపయోగించే పన్ను స్వర్గాలివి. అక్కడ కంపెనీలు పెట్టిన కొందరి పేర్లను గతంలో ప్యారడైజ్‌ పేపర్స్, పనామా పేపర్స్‌ వెల్లడించాయి!!. వారిపై దేశీయంగా దర్యాప్తు కూడా జరుగుతోంది!

చిత్రమేంటంటే సుజనా చౌదరి అలియాస్‌ యలమంచిలి సత్యనారాయణ చౌదరి వీటిలో ఏ ఒక్క దేశాన్నీ వదల్లేదు. దాదాపు అన్ని పన్ను స్వర్గాల్లోనూ పదుల కొద్దీ కంపెనీలు పెట్టేశారు. బినామీలను పెట్టి తాను బయటపడకుండా నడిపిస్తున్నారు. దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాల రూపంలో కొల్లగొట్టిన రూ.వేల కోట్ల రూపాయల్ని ఈ గొలుసుకట్టు కంపెనీల ద్వారా తన సొంత ఖాతాల్లోకి మళ్లించారనే  ఆరోపణలకు ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ జరిపిన సోదాల్లో ఆధారాలు దొరికినట్లుగా తెలిసింది. తన రాజకీయ భాగస్వామి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమితంగా ఇష్టపడే సింగపూర్‌తో ప్రారంభిస్తే... ప్రపంచంలో ఏ దేశాన్నీ వదలకుండా సుజనా చౌదరి పలు కంపెనీలు పెట్టారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న దాదాపు రూ.9,500 కోట్ల మేర రుణాల్లో అత్యధిక మొత్తాన్ని ఈ  కంపెనీల ద్వారా తన సొంత ఖాతాల్లోకి, కావాల్సిన వారి ఖాతాల్లోకి మళ్లించారు. అందుకు ఎంచుకున్న మార్గమేంటి? ఏఏ దేశాల్లో ఏ కంపెనీలున్నాయి? వాటికి సుజనా తరఫున ప్రస్తుతం ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నదెవరు? ఈ వివరాలన్నీ ఇవిగో...

సుజనా చౌదరి దేశంలోని బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు రూ.9,500 కోట్లపైనే. వీటిలో చాలా రుణాల చెల్లింపుల్లో ఇప్పటికే డిఫాల్టయ్యారు. కానీ దేశంలోని ఏ ఒక్క బ్యాంకూ ఆయన్ను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించలేదు. ఆయనపై దివాలా పిటిషన్‌ వేయటంగానీ, న్యాయస్థానాల్ని ఆశ్రయించటం గానీ చెయ్యలేదు. పరిస్థితులు దెబ్బతిని ఇంటి రుణం తిరిగి చెల్లించలేని వారిని సైతం ఎగవేతదారులుగా ప్రకటిస్తూ పత్రికల్లో ఫోటోలు వేసే బ్యాంకులు సుజనాపై ఉదారంగా వ్యవహరించటానికి ప్రధాన కారణం ఆయన రాజకీయ సంబంధాలే. ఆయన వెనకున్న చంద్రబాబు నాయుడే. దేశంలోనే కాదు! విదేశీ బ్యాంకులకూ భారీగా రుణాలు ఎగవేయటంతో మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు ఇక్కడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. పైపెచ్చు ఈ రుణాలపై ఎప్పుడు ఎవరేం అడిగినా... ‘‘నాకేం సంబంధం? నేను ఏ కంపెనీలోనూ డైరెక్టరుగా లేనే?’’ అని సుజనా ఎదురు తిరుగుతారు. బహుశా! అది తన రాజకీయ, వ్యాపార భాగస్వామి చంద్రబాబునాయుడి నుంచి నేర్చుకుని ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ప్రధానంగా ఈ అప్పులన్నీ తీసుకున్నది మూడు లిస్టెడ్‌ కంపెనీల పేరిటే. అవి...



1. సుజనా యూనివర్సల్‌ లిమిటెడ్‌ (ఎస్‌యూఐఎల్‌)
2. సుజనా టవర్స్‌ లిమిటెడ్‌ (ఇపుడు న్యుఆన్‌ టవర్స్‌)
3. సుజనా మెటల్‌ ప్రొడక్టŠస్‌ లిమిటెడ్‌ (ఇపుడు స్ల్సెండిడ్‌ మెటల్స్‌).
ఈ మూడింటికీ ఇప్పుడు డైరెక్టరుగా సుజనా చౌదరి రాజీనామా చేసి ఉండొచ్చు. కానీ వీటిని పెట్టింది ఆయన. ఇవి తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలపై హామీదారుగా సంతకం చేసింది ఆయన. ఇప్పటికీ ఈ కంపెనీల్లో ఆయనకు, ఆయన భార్య పద్మజతో పాటు కుటుంబీకులకు వాటాలున్నాయి. ఈ కంపెనీల్లో వాటాలను హోల్డ్‌ చేస్తున్న ఇతర కంపెనీల్లోనూ సుజనా కుటుంబానిదే మెజారిటీ వాటా. అలాంటి ఓ నాలుగు కంపెనీల్లో ఇప్పటికీ సత్యనారాయణ చౌదరి డైరెక్టరే!. మరి ఈ అప్పులతో తనకు సంబంధం లేదని ఎలా బుకాయిస్తారు? 

ఆ రుణాలు ఏమయ్యాయి?
ఇక్కడ సుజనా చౌదరి డైరెక్టరా? కాదా? అనేది పక్కనబెడితే... ఆయన బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.వేల కోట్ల రుణాలు ఏమయ్యాయన్నదే అసలు ప్రశ్న. నిజానికిలా తీసుకున్న అప్పుల్లో వ్యాపారానికి ఖర్చుపెట్టిందేమీ లేదు. ఇవన్నీ దేశంలో సుజనాకు చెందిన పలు షెల్‌ కంపెనీల్లోకి అడ్వాన్సులు, లోన్లు, ఇంటర్‌ కార్పొరేట్‌ ఇన్వెస్ట్‌మెంట్ల పేరిట మళ్లిపోయాయి. అక్కడి నుంచి విదేశీ అనుబంధ సంస్థల్లోకి వెళ్లాయి. మొదట అనుబంధ సంస్థల్లోకి మళ్లించటం... తరవాత తనకు సంబంధించిన వేరే ప్రైవేట్‌ కంపెనీల్లోకి మళ్లించటం... అక్కడి నుంచి సొంత ఆస్తులు పెంచుకోవటానికి వాడటం. ఇదే కథ. ఎందుకంటే 2015 మార్చి 31 నాటికే... వివిధ అనుబంధ సంస్థల నుంచి సుజనా సంస్థలకు రావాల్సిన మొత్తం ఏకంగా రూ.9,365 కోట్లు. దీనికి ఆ కంపెనీలు చెప్పే పేరు... ట్రేడ్‌ రిసీవబుల్స్‌!!.

అంతా అనుబంధ కంపెనీల మధ్యే...
నిజానికి గడిచిన రెండేళ్లుగా సుజనా గ్రూపు ఆర్‌వోసీకి కూడా బ్యాలెన్స్‌ షీట్లు, వార్షిక రిటర్నులు సమర్పించటం లేదు. ఎందుకంటే వాటిని అందజేస్తే మొత్తం వాస్తవాలు తెలియజేయాల్సి ఉంటుంది కనుక. అందుకోసం 2015 నాటి బ్యాలెన్స్‌ షీట్‌నే చూస్తే... ఆ ఏడాది టవర్స్, మెటల్స్, యూనివర్సల్‌ ఈ మూడు సంస్థలూ కలిసి ఏకంగా రూ.11,510 కోట్ల టర్నోవరు నమోదు చేశాయి. అంటే ఇవి రూ.11 వేల కోట్లకుపైగా వ్యాపారం చేశాయి. ఇంత వ్యాపారంపై చిత్రంగా వాటికి రూ.7 కోట్ల నష్టం వచ్చింది. ఇక ఈ టర్నోవర్‌లో ట్రేడింగ్‌ ఆదాయంగా చూపించింది రూ.6,998 కోట్లు. ఈ ట్రేడింగ్‌ జరిగింది కూడా అనుబంధ కంపెనీల మధ్యే. అంటే కాగితాలపైనే. ఎందుకంటే ఈ ట్రేడింగ్‌ పరిమాణాన్ని చూపించి బ్యాంకుల నుంచి మరిన్ని రుణాలు పొందటానికి. 

ట్రేడ్‌ రిసీవబుల్స్‌... గోల్‌మాల్‌
నిజానికి ఈ ట్రేడ్‌ రిసీవబుల్స్‌ అనేదే పెద్ద గోల్‌మాల్‌. ఏ కంపెనీకైనా చేసే వ్యాపారంలో కొన్ని అరువుపై ఇవ్వాల్సి వస్తుంది, కొందరికి అడ్వాన్సులు చెల్లించాల్సి వస్తుందనేది కాదనలేం. కానీ ఇది కంపెనీ టర్నోవర్లో రెండు నెలల మొత్తానికి మించి ఉండకూడదు. విలువలో చూసినా 15 శాతానికి మించి ఉండకూడదు. కానీ సుజనా గ్రూపులో మాత్రం ఇది 10 నెలల టర్నోవరుకు సమానంగా... విలువలో దాదాపు 85–90 శాతంగా ఉంది. దీన్నిబట్టి గోల్‌మాల్‌ ఇక్కడే జరిగిందని తెలియటం లేదూ?

విదేశీ కంపెనీలు... ఇన్వెస్ట్‌మెంట్లు
సుజనా కంపెనీల ఖాతాలు చూస్తే... అనుబంధ కంపెనీల ద్వారా భారీగా పెట్టుబడులు పెట్టినట్లు కనిపిస్తుంది. కానీ ఆ పెట్టుబడులు తీసుకున్న కంపెనీల కార్యకలాపాలు మాత్రం కనిపించవు. చివరికి అంత పెట్టుబడి తీసుకున్న కంపెనీలు కూడా నష్టాలు ప్రకటించటం... మెల్లగా వాటిని మూసేయటం... అంతా పద్ధతి ప్రకారం జరిగిపోతుంది. చివరికి ఆ డబ్బులు చేరాల్సిన వారికి చేరిపోతాయి. 

కార్పొరేట్‌ గ్యారంటీలు, ఎల్‌వోసీలు కూడా...
బ్యాంకు రుణాలకే పరిమితం కాకుండా సుజనా గ్రూపు సంస్థలు పలు కార్పొరేట్‌ గ్యారంటీలను జారీ చేశాయి. బ్యాంకు గ్యారంటీలు, స్టాండ్‌ బై లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌లు (ఎల్‌ఓసీ– నీరవ్‌ మోడీ పీఎన్‌బీని ముంచేసింది వీటి పేరిటే) కూడా పొందాయి. వీటి విలువ దాదాపు రూ.992 కోట్లు. దీంతో పాటు డాలర్లలో కూడా రూ.350 కోట్లకు సమానమైన గ్యారంటీలు జారీ చేశాయి. ఇవన్నీ కాక ఆదాయపు పన్ను శాఖ, ఎక్సైజ్, కస్టమ్స్‌ వంటి ప్రభుత్వ విభాగాలు సుజనా సంస్థలపై వేసిన కేసుల ఖరీదు రూ.962 కోట్లు. అంటే ఈ కేసుల్లో ఓడిపోతే ఇంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్న మాట. ఈ లెక్కన చూస్తే సుజనా కథ ఎన్ని వేల కోట్లతో ఆగుతుందన్నది ఈడీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి బయటపెడితే తప్ప మానవమాత్రులెవరూ ఊహించటం కష్టం.

కొన్ని అనుబంధం... కొన్ని సంబంధం
అధికారికంగా సుజనా యూనివర్సల్, సుజనా మెటల్స్, సుజనా టవర్స్‌కు విదేశాల్లో కొన్ని అనుబంధ సంస్థలున్నాయి. ఇవి కాక బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్, కేమన్‌ ఐలాండ్స్, ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ వంటి పన్ను స్వర్గాల్లోనూ తనకు ‘సంబంధించిన’ సంస్థలున్నాయి. సుజనా తండ్రి యలమంచిలి జనార్ధనరావు సింగపూర్‌ పర్మనెంట్‌ రెసిడెంట్‌ కనక అక్కడి కంపెనీలన్నీ ఆయన పేరిటే ఉన్నాయి. ఇతర దేశాల్లోని సంస్థల్ని మాత్రం  పలువురు ‘సంబంధీకుల’ ద్వారా సుజనా నడిపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన సంస్థలివీ...

విదేశీ కంపెనీలు (ఇన్‌ఛార్జులుగా ఉన్న వ్యక్తులు)
బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌
1. బ్రిస్టోలా ఏసియా ఇంక్‌   – వై.జనార్ధనరావు
2. ఆడ్రాయిట్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ – వి.రమేష్‌
3. లాండ్‌ఫోర్డ్‌ (ఏసియా) లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు

కేమన్‌ ఐలాండ్స్‌
1. ఆల్ఫా వెంచర్స్‌ లిమిటెడ్‌  – హేమంత్‌ (ఎస్‌ఎంపీఎల్‌)
2. సన్‌ ట్రేడింగ్‌ లిమిటెడ్‌ – హేమంత్‌ (ఎస్‌యూఐఎల్‌)

సెంట్రల్‌ అమెరికా 
1. స్టార్‌లైన్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ 

దుబాయ్‌
1. సుజనా హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ – రామ్‌ 
ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. దీన్లో భారీ పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు.

హాంకాంగ్‌ 
1. నాన్స్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ – వి.రమేష్‌ 
ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. దీనికి స్టాండర్డ్‌ బ్యాంకు రుణమిచ్చింది. 
2. డిజిటెక్‌ బిజినెస్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌– వి.రమేష్‌ 
ఇది సుజనా టవర్స్‌ అనుబంధ సంస్థ. దీన్లో భారీ పెట్టుబడులున్నా పెట్టినట్లు చూపించారు. 
3. ఏసియన్‌ టైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ – వి.రమేష్‌ 
ఇది సుజనా మెటల్స్‌కు అనుబంధ సంస్థ. భారీ పెట్టుబడులు పెట్టినట్లు చూపించారు. 
4. అసోసియేటెడ్‌ ఏసియా
5. ఇండ్‌చిన్‌ కార్పొరేషన్‌ – వి.రమేష్‌
6. రైన్, హాంకాంగ్‌ – వి.రమేష్‌
7. యునైటెడ్‌ ఇండస్ట్రియల్‌ గ్రూప్‌ – వి.రమేష్‌
ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ 
1. మ్యాగ్నమ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ – వి.రమేష్‌

మారిషస్‌
1. హెస్టియా హోల్డింగ్స్‌ – హేమంత్‌ 
ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధం. మారిషస్‌ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుంది. 
2. ఆప్టిమిక్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ 
ఇది సుజనా మెటల్స్‌కు చెందిన ఏసియన్‌ టైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు అనుబంధ సంస్థ. స్టాండర్డ్‌ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుంది.
3. గ్లోబల్‌ వయొలెట్‌ లిమిటెడ్‌ 
4. ఇంటిగ్రల్‌ ఏజెన్సీస్‌ లిమిటెడ్‌
5. ఎస్‌టీఎల్‌ ఆఫ్రికా లిమిటెడ్‌ – సుజనా టవర్స్‌ ఉద్యోగుల పేరిట ఉంది. 
6. టెలీ సూపర్‌కాన్‌ లిమిటెడ్‌ –  – సుజనా టవర్స్‌ ఉద్యోగుల పేరిట ఉంది. 
7. సెలీన్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ – హేమంత్‌ 
ఇది స్టాండర్డ్‌ బ్యాంక్‌ నుంచి రుణం తీసుకుంది. 

సింగపూర్‌ 
1. పీఏసీ వెంచర్స్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు 
ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధం. ఎగ్జిమ్‌ బ్యాంకు నుంచి రుణం తీసుకుంది. 
2. అపైస్‌ వెంచర్స్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు
3. అర్ష సొల్యూషన్స్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు
4. ఎవర్‌గ్రీన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌ 
5. ఫోస్టర్‌ వెంచర్స్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు 
ఇది ఫోస్టర్‌ ఇన్‌ఫిన్‌కు అనుబంధ సంస్థ. 
6. గామా మెర్షినరీ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు  
ఇది కూడా ఫోస్టర్‌ ఇన్‌ఫిన్‌కు అనుబంధమే. 
7. ఇన్‌ఫ్రా ఏసియా ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు
8. మంటన్‌ రిసోర్సెస్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు 
9. యలమంచిలి వెంచర్స్‌ పీటీఈ లిమిటెడ్‌ – వై.జనార్ధనరావు 
10. సన్‌ గ్లోబల్‌ ట్రేడింగ్‌ పీటీఈ లిమిటెడ్‌ – హేమంత్‌ 
ఇది సుజనా యూనివర్సల్‌కు చెందిన సన్‌ ట్రేడింగ్‌కు అనుబంధ సంస్థ. 

సీషెల్స్‌
1. మైక్రోపార్ట్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌
2. ఏసియా పసిఫిక్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ 

యూఏఈ
1. ఎంపైర్‌ గల్ఫ్‌ ఎఫ్‌జెడ్‌ఈ – రామ్‌ 
ఇది సుజనా యూనివర్సల్‌కు అనుబంధ సంస్థ. 
2. మ్యాక్స్‌ అరేబియన్‌ ఎఫ్‌జెడ్‌ఈ – రామ్‌
3. పాన్‌ అరేబియన్‌ ఇంటర్నేషనల్‌ ఎఫ్‌జెడ్‌ఈ – రామ్‌
4. ప్రాస్పరిటీ ఎంటర్‌ప్రైజెస్‌ ఎఫ్‌జెడ్‌ఈ – రామ్‌
5. సుప్రీమ్‌ ఇంటర్నేషనల్‌ ఎఫ్‌జెడ్‌ఈ – రామ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement