
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇన్ని రోజులు కావస్తున్నా ఇంత వరకూ క్లూలు దొరకడం లేదని, అసలు దర్యాప్తు సరైన రీతిలో నడుస్తోందో, లేదో? అని తనకు అనుమానంగా ఉందని వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం రాత్రి మీడియాకు తాను మాట్లాడి రికార్డు చేసిన వీడియోను విడుదల చేశారు. ‘మీరే చూస్తున్నారు కదండీ, నాన్న చనిపోయి ఇన్ని రోజులైనా ఎక్కడా ఏమీ క్లూస్ దొరకడం లేదు.
ఈ దర్యాప్తు సరైన రీతిలో నడుస్తోందో లేదోనని అనుమానంగా ఉంది. తీరు చూస్తూంటే.. ఉదాహరణకు ఆ సంఘటన జరిగిన రోజు సీఐ శంకరయ్య అక్కడున్నారు. అక్కడ ఆ మనిషి ఉన్నాడు. మేం హైదరాబాద్ నుంచి దారిలో వస్తూ ఉన్నాము. మేం ఇన్సిస్ట్ చేయాల్సి వస్తోంది. కేసు పెట్టు అని చెప్పి.. ఆయన ఓ సర్కిల్ ఇన్‌స్పెక్టర్. ఆయనకు తెలియదా? ఇది మర్డర్ కేసు పెట్టాలి అని చెప్పి.. ఆ సీన్‌లో లేకుండా ఉన్న మాకు అనుమానం వస్తోంది. చెప్పాల్సి వస్తోంది.. ప్లీజ్ కేసు పెట్టండి అనుమానం ఉంటే అని.. అంటే ఆయన ఏదైనా కవర్‌అప్ చేయాలని ప్రయత్నించాడా! ఎందుకలా ఆయన అప్పుడు ప్రవర్తించారు? కేసు పెట్టు అని చెప్పినాక కూడా తరువాత ఆయన బాడీని బయటకు మూవ్ చేయించాడు. గాయాలకు కట్లు కట్టించాడు. ఇన్‌స్పెక్టర్ గారికి తెలియదా? ఇది తప్పు.. పంచనామా జరగక ముందు భౌతికకాయాన్ని అలా తరలించకూడదని తెలియదా? అయినా ఆయన అలా ఎందుకు జరగనిచ్చారు? ఓకే అక్కడ ఉన్న మా మిత్రులు, బంధువులందరూ దుఃఖంలో మునిగి ఉన్నారు. వారికి అర్థం కావడం లేదు అనుకుందాం. ఈయనకు ఏమైంది? ఈయన ఇన్‌స్పెక్టర్ కదా? ఆయనకు రూల్స్ అన్నీ బాగా తెలుసు కదా? ఆయన కూడా ఈ నేరంలో భాగస్వామా? ఆయనకు ఎవరైనా ఆదేశాలిచ్చారా? ఈ దర్యాప్తును తారు మారు చేయడానికి సాయం చేయి అని? ఆయన పైన ఎవరున్నారు? లేక ఆయనకే నేరుగా ఇందులో ప్రమేయం ఉందా? నాకైతే అనుమానాలు వస్తున్నాయి. సొల్యూషన్స్ గానీ, జవాబులు గానీ అర్థం కావడం లేదు. దర్యాప్తు ప్రక్రియకు ఏమవుతోంది? ఇలా కావాలనే తప్పులు చేయమని ఎవరైనా పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారా? ఆ నేరానికి కుటుంబ సభ్యులే కారణమని నింద మోపమని చెప్పారా? నాకు దీనికి త్వరలో సమాధానం దొరుకుతుందని భావిస్తున్నాను. నాకైతే ఓపిక నశిస్తోంది’ అని ఆమె పేర్కొన్నారు.