జైల్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు సంఘీభావంగా కర్నూలు జిల్లాలో మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి.
జైల్లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌కు సంఘీభావంగా కర్నూలు జిల్లాలో మద్దతు దీక్షలు కొనసాగుతున్నాయి. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరింది. ఆత్మకూరులో బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఆమరణ దీక్ష మూడో రోజూ కొనసాగు తోంది. రాజశేఖర్‌రెడ్డికి సంఘీభావం తెలుపుతూ సీఎండీ రఫీ ఆధ్వర్యంలో శ్రీశైలం నుంచి ఆత్మకూరుకు సమైక్యవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. పత్తికొండలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి 48 గంటల దీక్ష చేపట్టారు. నంద్యాల, కర్నూలు, ఆళ్లగడ్డలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ నంద్యాల పట్టణంలో నిన్న నిర్వహించిన లక్ష జన ఘోషకు విశేష స్పందన లభించింది. ఉద్యోగులు.. కార్మికులు.. వ్యాపారులు.. ప్రజా సంఘాలు.. అన్ని వర్గాల ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా సమైక్యాంధ్ర నినాదాన్ని మారుమ్రోగించారు. పల్లెలు.. పట్టణం నలుమూలల నుండి ర్యాలీగా కార్యక్రమ వేదికైన పొట్టి శ్రీరాములు కూడలికి జనం చీమల పుట్టల్లా తరలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించారు.