సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కోడుమూరు టౌన్, న్యూస్‌లైన్: సమైక్య రాష్ట్ర పరిరక్షణ కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీకి అండగా నిలవాలని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి ప్రజలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని కోరారు. పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎం.మణిగాంధీ అధ్యక్షతన పట్టణంలోని స్నేహ వినాయక కల్యాణ మంటపంలో శనివారం నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజకు వ్యతిరేకంగా పోరాడుతున్నది జగన్ మాత్రమే నన్నారు. రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు తప్పవని, నిత్యం తాగు, సాగునీటి కోసం ప్రజలు కొట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పిన గౌరు దీన్ని దృష్టిలో ఉంచుకునే జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారన్నారు.
బడుగుల సంక్షేమమే జగనన్న ధ్యేయం:
బుట్టా రేణుక
బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బుట్టా రేణుక అన్నారు. అణగారిన, వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో జగనన్న పనిచేస్తున్నారని, అందులో భాగంగానే వెనుకబడిన తరగతులకు చెందిన తనకు కర్నూలు ఎంపీ టికె ట్ ఇచ్చారని తెలిపారు. ‘నేను మీ ఆడపడుచును, మీరే నా బలం’ అంటూ ఆమె ఉద్వేగంగా ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉతే ్తజాన్ని నింపారు. అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న, దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకావాలన్నా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ స్వర్ణయుగం : మణిగాంధీ
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో మరోసారి వైఎస్సార్ సువర్ణ యుగం రాబోతోందని కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ అన్నారు. సమైక్యాంధ్ర కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న జగనన్నకు మనమంతా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామగ్రామాన పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థుల గెలుపు కోసం అకుంఠిత దీక్షతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల కోసం పనిచేసే వారిని ఆదరించండి : కొత్తకోట.ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
‘ప్రజల కోసం పనిచేస్తున్న వారిని గెలిపించండి. గత ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ఎక్కడుంటారో కూడా తెలియని పరిస్థితి ఉంది. అలాంటి వారిని కాకుండా ప్రజా సంక్షేమం నిరంతరం పరితపిస్తున్న జగన్‌ను అండగా నిలిచి ఆదరించండి’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నాయకుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి కోరారు. వచ్చే ఎన్నికలు కచ్చితంగా సమైఖ్యాంధ్రలోనే జరుగుతాయని, వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని పార్టీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమడగుంట్ల క్రిష్ణారెడ్డి అన్నారు.
పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు యూవీ రాజారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ మరణంతోనే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో బీసీలు అణగారిపోయారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచి రోజులు వస్తాయని తెలిపారు. వైఎస్సార్ అభివృద్ధి పాలనను జగన్ మరోసారి తెస్తారని ఆకాంక్షించారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బుట్టా నీలకంఠ, ఎదురూరు రాంభూపాల్‌రెడ్డి, స్థానిక నాయకులు కేఈ రాంబాబు, లాయర్ ప్రభాకర్, బీవీ గోపాల్‌నాయుడు, కృష్ణారెడ్డి, లింగారెడ్డి, భీమలింగన్నగౌడ్, ఎల్లప్ప, మస్తాన్, రామకృష్ణారెడ్డి, సర్వేశ్వరరెడ్డి, అయ్యపురెడ్డి, నంద్యాల శ్రీను, రాఘవేంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు.