గంగమ్మా చూడమ్మా..!
- కమిషనర్ అనుమతి లేకనే కాంట్రాక్ట్ గడువు పెంపు
- చేతులు మారిన రూ.లక్షలు!
- బోయకొండ ఆలయానికి భారీ నష్టం
బోయకొండ(చౌడేపల్లె): ఆలయాధికారులు, పాలకవర్గం మాయాజాలంతో బోయకొండ గంగమ్మ ఆలయానికి భారీ మొత్తంలో నష్టం వాటిల్లింది. వివిధ హక్కులకు సంబంధించి అనుమతులను రెండు నెలలు పొడిగించారు. ఈ తతంగంలో లక్షలు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా బోయకొండ గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల నుంచి నిత్యం భక్తులు తరలి వస్తుంటారు.
ఆలయంలో వివిధ హక్కుల కోసం ప్రతి ఏటా వేలంపాట నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మిది హక్కుల కోసం గతేడాది మార్చి 22న వేలంపాట నిర్వహించారు. హక్కులు పొందిన వారి గడువు ఈ ఏడాది మే 31న ముగిసింది. ఇక్కడే ఆలయ పాలకులు, అధికారులు మాయాజాలం ప్రదర్శించారు. తలనీలాల హక్కులు మినహాయించి మిగిలిన ఎనిమిదింటి గడువును రెండు నెలలు పెంచేశారు.
ఇలా చేయాలంటే దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి పొందాల్సి ఉంది. అయితే బోయకొండలో ఇందుకు భిన్నంగా అనుమతులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే కొత్త ఏడాది హక్కుల కోసం గత నెల 17న వేలం పాటలు నిర్వహించారు.
అక్రమాల విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఆలయ పాలకవర్గం, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం ద్వారా ఆలయ ఆదాయానికి లక్షల రూపాయల్లో గండి పడిందని అంటున్నారు. ఈ అక్రమాలపై దేవాదాయశాఖ కమిషనర్ విచారణ చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అనుమతి లేని విషయం నిజమే
కాంట్రాక్ట్ గడువు పెంపుదలలో దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి లేని విషయం నిజమే. గతంలో పనిచేసిన ఈవో, పాలకవర్గం తీర్మానం చేసి కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపారు. ఉత్తర్వులు రాకుండానే గడువు పెంపు, తిరిగి వేలం నిర్వహించిన సంగతి వాస్తవమే.
- ఏకాంబరం, ఇన్‌చార్జి ఈవో, బోయకొండ