సరెండర్..సస్పెన్షన్.. | Surrender .. suspension | Sakshi
Sakshi News home page

సరెండర్..సస్పెన్షన్..

Published Tue, Feb 17 2015 1:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

సరెండర్..సస్పెన్షన్.. - Sakshi

సరెండర్..సస్పెన్షన్..

పాలనపై పట్టుబిగిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్
పారిశుధ్య విభాగంపై డేగకన్ను
ఆందోళనలో అవినీతి ఉద్యోగులు

 
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతిపై కమిషనర్ జి.వీరపాండియన్ కొరడా ఝుళిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ఆయన అక్రమార్కులను సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పాలనపై పట్టు బిగిస్తూ అవినీతిపరును బెంబేలెత్తిస్తున్నారు. పనిచేయని అధికారులను సరెండర్ చేసేందుకు వెనుకాడటం లేదు. సాకులు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించే ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు.
 
మస్తర్ల మస్కాపై నిఘా

పారిశుధ్య విభాగంలో మస్తర్ల మస్కాపై కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించారు. నగర పర్యటనలో భాగంగా  డివిజన్లలో పారిశుధ్య కార్మికుల హాజరును ఆయన నిశితంగా పరిశీలించారు. 30 నుంచి 40శాతం వరకు కార్మికులు విధులకు డుమ్మా కొడుతున్నారని గుర్తించారు. ఇటీవల పారిశుధ్య కార్మికుల జీతాల బిల్లు సుమారు రూ.2.30కోట్లు కమిషనర్ చాంబర్‌కు వెళ్లింది. 87 శాతం హాజరు చూపినట్లు సమాచారం. దీనిపై కమిషనర్ అభ్యంతరం వ్యక్తంచేశారు. 60 నుంచి 70 శాతం మాత్రమే కార్మికులు విధుల్లో పాల్గొంటుంటే ఇంత మొత్తంలో బిల్లు ఎందుకు వచ్చిందో చెప్పాలని నిలదీశారు. అప్పటికే అకౌంట్స్ విభాగం చెక్కు తయారుచేయడంతో కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చీఫ్ మెడికల్ ఆఫీసర్, సూపరింటెండెంట్, అకౌంట్స్ అధికారి, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు మెమోలు జారీ చేసినట్లు తెలిసింది.

 కథలు చెప్పొద్దంటూ క్లాస్..!
 
పారిశుధ్య విభాగంలో 2,984 మంది డ్వాక్వా, సీఎంఈవై కార్మికులు పనిచేస్తున్నారు. మస్తర్ల మాయతో లక్షల రూపాయలను అక్రమార్కులు నొక్కే స్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేం దుకు గతంలో పనిచేసిన కమిషనర్ సి.హరికిరణ్ బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మొత్తం 55 శానిటరీ డివిజన్లు ఉండగా, మూడు సర్కిళ్ల పరిధిలో 12 డివిజన్లలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఈ విధానం అందుబాటులోకి రాలేదు. దీంతో అక్రమార్కులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. మస్తర్ల మస్కాపై ప్రస్తుత కమిషనర్ కన్నెర్ర జేయడ ంతో కంగుతిన్న అధికారులు కొందరు కార్మికులు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారంటూ సర్ధిచెప్పేందుకు ప్రయత్నించగా.. కథలు చెప్పొద్దంటూ క్లాస్ తీసుకున్నట్లు సమాచారం.
 
పనిచేయకపోతే అవసరం లేదు..

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగులపై కమిషనర్ వేటు వేస్తున్నారు. వెహికల్ డిపోలో పనిచేసే లోక్‌నాథ్ ఆయిల్ బిల్లు సకాలంలో బ్యాంక్‌లో జమ చేయకపోవడంపై సీరియస్ అయ్యారు. తాను ఈ నెల 14న బ్యాంక్‌కు వెళ్లానని, శనివారం కావడంతో మధ్యాహ్నం వరకే బ్యాంక్ పనిచేయడంతో నగదు చెల్లించలేకపోయానని వివరణ ఇచ్చారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కమిషనర్ బ్యాంక్ మేనేజర్‌తో మాట్లాడి సీసీ టీవీ వీడియో పుటేజ్‌ను తెప్పించారు. సంబంధిత ఉద్యోగి బ్యాంక్‌కు వెళ్లినట్లు పుటేజ్‌లో లేకపోవడంతో ఆయన్ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. తరుచూ సెలవు పెడుతున్న యూసీడీ పీవో కె.శకుంతలను మాతృసంస్థకు సరెండర్ చేశారు. తద్వారా పనిచేయని ఉద్యోగులు అక్కర్లేదన్న సంకేతమిచ్చారు. పాలనను గాడిలో పెట్టేందుకు కమిషనర్ స్పీడ్ పెంచడంతో కొందరు ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement