నగరవ్యాప్తంగా 40 సీసీ కె మెరాల ఏర్పాటు
ఎస్పీ కార్యాలయానికి అనుసంధానం
చీమ చిటుకుమన్నా సమాచారం చేరవేత
నిజామాబాద్ క్రైం,న్యూస్‌లైన్ :
జిల్లాకేంద్రంలో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ సమస్యలను అధిగమించడం, శాంతిభద్రతల రక్షణకు అడుగడుగున నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇకపై రోడ్డు మీద ఎలాంటి ప్రమాదాలు, నేరాలు జరిగినా వెంటనే ఎస్పీ కార్యాలయానికి సమాచారం అందనుంది.
ఎస్పీ నిర్ణయంతో...
జిల్లాకేంద్రంలో నేరాలు,రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఎస్పీ తరుణ్‌జోషి మూలనపడ్డ సీసీ కెమెరాలను వాడుకలోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకేంద్రంలో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదం, గుర్తుతెలియని వాహనాలు ఢీకొని ద్విచక్ర వాహనాదారులు, పాదచారులు మృత్యువాత పడటం షరా మామూలుగా మారింది. వీటికి తోడు తరుచూ ట్రాఫిక్ కష్టాలు తలెత్తడం జరుగుతోంది. వీటన్నింటిని దూరం చేసేందుకు స్వయంగా జిల్లా ఎస్పీ రంగంలోకి దిగారు. ఎస్పీ ఆదేశాలతో నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో పనులు చకచక జరుగుతున్నాయి.
ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటు...
జిల్లాకేంద్రంలో ఇది వరకు ఎప్పుడు లేని విధంగా నగరవ్యాప్తంగా మొత్తం 40 సీసీ కెమెరాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద 17 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
మిగిలిన కెమెరాలను నగరంలోని సమస్యత్మాక ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాల పనితీరును ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ కంట్రోల్ రూమ్‌తోపాటు,జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి వీక్షించవచ్చు. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సీసీ కెమెరా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎల్‌ఈడీ టీవీల ద్వారా నగరంలోని రోడ్లపై జరిగే తతంగాన్ని ఒకేసారి వీక్షించవచ్చు. గతంలో 2011లో నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ట్ర యల్ కూడా చేశారు. ఇక సీసీ కెమెరాలు ప్రారంభకానున్న తరుణంలో మున్సిపల్‌తో ఒప్పందం సరిగ్గా కుదరలేదన్న కారణంతో పనులు నిలిచిపోయాయి. దీంతో సదరు కంపనీ మళ్లీ ఇటువైపు రాకపోవటంతో ఈ పనులు మూలన పడ్డాయి. కొత్తగా ఏర్పాటు కానున్న సీసీ కెమెరాల పనులు నిలిచిపోకుండా అధికారులు చర్యలు చేపడితే నగరంలో నిఘా చేకూరే అవకాశం ఉంది.
ట్రాఫిక్ నియంత్రణ ఇలా ...
జిల్లాకేంద్రంలో ఏదైనా ప్రమాదాలు జరిగిన సందర్భాలతోపాటు రాస్తారోకోలు, ధర్నాలు,ర్యాలీలతో ట్రాఫిక్ జామైన సందర్భంలో కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే మొబైల్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారాన్ని చేరవేస్తారు. ట్రాఫిక్ పోలీసులు వెంటనే సంఘటన ప్రాంతానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారు. దీని ద్వారా రాస్తారోకోలు, దర్నా, ర్యాలీల కారణంగా జామైన ట్రాఫిక్‌ను దారిమళ్లించే అవకాశం ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిని, చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవారిని గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.కార్యాలయం నుంచే సీసీ కెమెరాల ద్వారా ఎస్పీ ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంటారు. నగరంలో ఎక్కడ ధర్నాలు, ర్యాలీలు జరిగినా సిబ్బందిని ఎస్పీ అలర్టు చేసే అవకాశం ఉంటుంది.
ఈ చలాన్ల జారీకి యత్నాలు ...
సీసీ కెమెరాల ఏర్పాటుతో ఈ చలాన్ పద్ధతి నగరంలో అందుబాటులోకి తెచ్చేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాల్లోనే అదనంగా ఆటోమేటిక్ ఫ్లాష్ కెమెరాలు అమర్చాల్సి ఉంటుంది. ఇవి జీబ్రాలైన్ దాటగానే ఫ్లాష్ వచ్చి వాహనం నంబరు రికార్డు అవుతుంది. దీని ఆధారంగా వాహనదారుడి ఇంటికి నేరుగా ఈ చలానాలు పంపిస్తారు.
తొలిదశలో 17 కెమెరాలు
నగరంలోని ప్రధాన కూడళ్లలో మొదటి దశలో 17 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో రెండు ప్లేట్ టిల్డ్ జామ్(పీటీజేడ్) కెమెరాలను 360 డిగ్రీల కోణంలో నాలుగు వైపులా రోడ్డు కవర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం బోధన్ బస్టాండ్ వద్ద రెండు కెమెరాలు,ఎన్‌టీఆర్ చౌరాస్తాలో మూడు,పూలాంగ్ చౌరస్తాలో మూడు,పాత ఎల్‌ఐసీ చౌరస్తాలో మూడు, దేవిరోడ్డు చౌరస్తాలో రెండు, ఖలీల్‌వాడీ చౌరస్తా, ఆర్‌టీసీ బస్టాండ్ ముందు,రైల్వేస్టేషన్, కంఠేశ్వర్ చౌరస్తాలలో ఒకటి చొప్పున సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ముంబ యికి చెందిన ఁస్టాన్ పవర్ అనే కంపనీ సహకారంతో ఏర్పాటు చేస్తున్నాం, సీసీ కెమెరాల ఏర్పాటుకు మున్సిపల్ కార్పొరేషన్‌తో ఒప్పందం పూర్తయింది. కేబుల్ లైన్ ఇటీవలే పూర్తియింది. కంట్రోల్ రూమ్‌లో స్టాన్ పవర్ కంపనీకి చెందిన సిబ్బంది మానిటరింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు. సీసీ కెమెరాలో 90 రోజులకు సంబంధించి సమాచారం అందుబాటులో ఉంటుంది
- అనిల్‌కుమార్, నగర డీఎస్పీ
నిజామాబాద్‌పై నిఘానేత్రం
Published Tue, Feb 18 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement