ఓటమి భయంతోనే సర్వేల జిమ్మిక్కులు
- గారడీల బాబుకి ప్రజలే బుద్ధి చెబుతారు
- ఎల్లోమీడియా భజనను ప్రజలు చూడడం, వినడం మానేశారు
- జనం గుండెల్లో జగన్‌కే స్థానం
తిరుపతి(మంగళం), న్యూస్‌లైన్: జనంలో ఆదరణ పూర్తిగా లేకుండా పోయింది.. రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలన్న ఓటమి భయంతోనే ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని సర్వేల్లో టీడీపీకే బాగుంది.. అంటూ చంద్రబాబునాయుడు జిమ్మిక్కులు చేస్తున్నాడని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి పరిధిలోని జయనగర్, లక్ష్మీపురం ప్రాంతాల్లో పార్టీ నాయకుడు మల్లం రవిచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఎమ్మెల్యే ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కరుణాకరరెడ్డి మాట్లాడారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలను అనేక రకాలుగా కష్టాలు పెట్టి కన్నీళ్లు పెట్టించిన చంద్రబాబుకు ఓట్లు వేయరనే భయంతో ఉత్తుత్తి సర్వేలు చేయిస్తున్నారన్నారు. ఈ సర్వేల్లో తమ పార్టీకే బాగుందని సంకలు గుద్దుకుంటున్నాడన్నారు. ఇలాంటి గారడీలు, జిమ్మిక్కులు ఎన్ని చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. తొమ్మిదేళ్లపాటు ప్రజలను కష్టాలపాలు చేసిన పాపం ఊరికే పోదన్నారు.
చంద్రబాబును ఎలాగైనా అధికారంలోకి తేవాలన్న ఉద్దేశంతో ఎల్లోమీడియాలో రాస్తున్న రాతలను చదవడం, చూడడం ప్రజలు మానేశారన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా జనం గుండెల్లో జగన్‌కు మాత్రమే స్థానముందని స్పష్టం చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరేళ్లపాటు పేదల సంక్షేమం కోసం అందించిన పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. జగనన్న అధికారంలోకి రాగానే పొదుపు సంఘాల్లోని 20వేల కోట్ల మహిళా రుణాలను పూర్తిగా రద్దు చేస్తారన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తారని తెలిపారు. అమ్మఒడి పేరుతో బిడ్డలను బడికి పంపించే ప్రతి తల్లిదండ్రులకు నెలకు రూ.500 చొప్పున ప్రతినెలా వారి ఖాతాలో వేస్తామన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడే జగన్‌మోహన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో గెలిపించి ప్రజలను కష్టపెడితే ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చంద్రబాబుకు రుచి చూపించాలని కోరారు.
పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, నాయకులు పులుగోరు ప్రభాకరరెడ్డి, ఎస్‌కె. బాబు, తొండమనాటి వెంకటేష్‌రెడ్డి, కొమ్ము చెంచయ్యయాదవ్, పోతిరెడ్డి వెంకటరెడ్డి, కె.అమరనాథ్‌రెడ్డి, తాల్లూరి ప్రసాద్, ఆమోస్‌బాబు, నల్లాని బాబు, నూరుల్లా, గౌస్‌బాషా, ఎర్రబెల్లి వెంకి, నరసింహారెడ్డి, చెలికం కుసుమారెడ్డి, పునీత, గీతాయాదవ్, శాంతారెడ్డి, సులోచన, కృష్ణవేణమ్మ పాల్గొన్నారు.