
వసతిగృహ విద్యార్థి అనుమానాస్పద మృతి
పొత్తంగి-సిరిపురం గ్రామానికి చెందిన బీసీ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థి పిలక హరికృష్ణ మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మందన: పొత్తంగి-సిరిపురం గ్రామానికి చెందిన బీసీ బాలుర వసతి గృహానికి చెందిన విద్యార్థి పిలక హరికృష్ణ మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు, విద్యార్థుల కథనం ప్రకారం.. హరికృష్ణ స్వగ్రామం పొత్తంగి. తల్లిదండ్రులు పున్నయ్య, కురాలు ఏకైక పుత్రుడు. అయితే తండ్రి పున్నయ్య భార్యాబిడ్డలను విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు. తల్లి కురాలు కూలి పనులు చేసుకుంటూ కుమారుణ్ని చదివించుకుంటోంది. ప్రస్తుతం హరికృష్ణ వసతి గృహంలో ఉంటూ పొత్తంగి-సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
బీసీ వసతి గృహం శిథిలావస్థలో ఉండటంతో అందులో రాత్రి సమయం ఉండకుండా సమీప ఉన్నత పాఠశాల గదుల్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏడాదిగా ఉంటున్నారు. రోజులాగే వసతి గృహంలో భోజనం చేసి పాఠశాల గదిలో చదువుకుని నిద్రించడానికి వెళ్లాడు. తన తోటి ఎనిమిదిమంది విద్యార్థులతో రాత్రి 10 గంటల వరకు చదువుకుని నిద్రించాడని స్నేహితులు తెలిపారు. వేకువ జామున చదువుకోవడానికి లేచి చూస్తే.. హరికృష్ణ లేవకపోవడంతో బయటికి వెళ్లి చూడగా అచేతనంగా పడి ఉండడం చూసి హతాశులయ్యారు. దగ్గరకు వెళ్లి లేపడానికి ప్రయత్నించగా ఎంతకీ లేవకపోవడంతో భయభ్రాంతులకు గురయ్యారు.
ట్యూటర్‌గా వస్తున్న వ్యక్తికి సమాచారం అందించగా, ఆయన వచ్చి చూశారని, హరికృష్ణలో చలనం లేకపోవడంతో ఇటీవల వార్డెన్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకున్న మందస ఎస్‌సీ వసతి గృహ వార్డెన్ సుదర్శనరావుకు సమాచారం అందించడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. అయితే అప్పటికే హరికృష్ణ మృతి చెందివున్నట్లు వారు గ్రహించారు. మృతుడు కేవలం అండర్‌వేర్‌తో పడి ఉండగా, కొంత దూరంలో మల, మూత్ర విసర్జన చేసి ఉన్నట్లు ఉంది. మృతుడి రెండు కాళ్లకూ బురద అంటిఉండటంతో రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా మల విసర్జనకు వెళ్లి ఉంటాడని, అ సమయంలో భయానికి గురై మృతి చెంది ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా బీసీ సంక్షేమ అధికారి రవిచంద్రకు వార్డెన్ సమాచారం అందించడంతో ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుమారుడి మరణవార్తను తల్లికి తెలియజేయడానికి వెళ్లగా ఆమె కట్టెలు తెచ్చుకోవడానికి సమీప కొండకు వెళ్లింది. గ్రామస్తులు ఆమెను తీసుకుని వచ్చారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందాడని తెలుసుకుని ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. అనంతరం ఆమె గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఎస్‌ఐ వి.రవివర్మ విద్యార్థుల నుంచి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేశామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి ఏ విధంగా మృతి చెందాడన్న విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది.