
సాధువులకు వస్త్రాలు, దక్షిణ అందజేస్తున్న స్వామీజీ. చిత్రంలో స్వాత్మానందేంద్ర సరస్వతి
పెందుర్తి: గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామీజీ ప్రతిపాదించారు. గోవుల పరిరక్షణకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా నడుం బిగించాలని కోరారు. చాతుర్మాస్య దీక్షా యాత్రలో భాగంగా ఆదివారం రుషికేష్ శారదాపీఠంలో సాధుసంతుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ అనుగ్రహభాషణ చేస్తూ రుషికేష్, హరిద్వార్‌లో నివసించే స్వాములు ఈ తపో భూమికే అంకితం కాకుండా యావత్ భారతదేశం పర్యటిస్తూ హిందూధర్మ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. గోహత్యలు జరగకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తరభారతంలో హిందూధర్మాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో సదస్సులో చర్చించారు.
పలు ఆధ్యాత్మిక విషయాలపై సందేహాలను స్వామీజీ నివృత్తి చేశారు. అనంతరం స్వాములు, సాధుసంతులకు బండారా (అన్నదానం) ఏర్పాటు చేశారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీతో కలిసి అందరికీ నూతన వస్త్రాలు, విశేష దక్షిణ అందజేశారు. ముందుగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ తరఫున రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఆయనకు కుమారుడు ఎమ్మెల్యే సతీష్ స్వామీజీకి నూతన వస్త్రాలు అందజేశారు. పవిత్ర గంగాతీరంలో ప్రత్యేక పూజలు ఆచరించారు. తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి దంపతులు స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు. వచ్చే జవవరిలో మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించే అశ్వమేధ యాగంలో పాలుపంచుకోవాలని స్వామీజీని ఆహ్వానించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, రంగారావు, డాక్టర్ ఓంప్రకాశ్, ఎలక్షణ్‌రెడ్డి, ప్రసాద్ స్వామీజీ ఆశీర్వచనం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment