‘టీ’ఎజెండా | T-agenda | Sakshi
Sakshi News home page

‘టీ’ఎజెండా

Published Thu, Dec 12 2013 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

‘టీ’ఎజెండా

‘టీ’ఎజెండా

ఎన్నో ఏళ్ల పోరాటం.. ఫలించే వేళ ఆసన్నమైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో తెలంగాణ వాసుల కల నెరవేరే సమయం సమీపించింది. గురువారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు టీ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో పాలమూరు జిల్లా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో ఏం మాట్లాడుతారనే అంశంపై  ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ‘సాక్షి’ ఈ ప్రయత్నమే చేసింది. ఎమ్మెల్యేల గళం ఎలా ఉంటుందో తెలుసుకుంది. అత్యధిక మంది తెలంగాణ సాధనే తమ లక్ష్యమని చెప్పారు. నీటి వాటా కోసం నిలదీస్తామని, పరిహారం కోసం పట్టుబడతామన్నారు. స్థానిక సమస్యలను ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
 
 పాలమూరు, న్యూస్‌లైన్: అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ అంశం ప్రధానం కావడంతో జిల్లా చెందిన శాసన సభ్యులు దానిపైనే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా సభను సాఫీగా నడిపేందుకు యత్నిస్తామని చెబుతున్నారు. తెలంగాణ బిల్లును ఆమోదింప జేయడమే తమ ప్రధాన లక్ష్యమని వివరిస్తున్నారు. జిల్లా నుంచి 14 మంది శాసన సభ్యులు ప్రాతినిధ్యంవహిస్తున్నారు. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నారుు. ఈ నేపథ్యంలో వీరు ఏ సమస్యలపై తమగళం ఏమని వినిపిస్తారోనంటూ జనం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా సాగునీటి సమస్య పట్టి పీడిస్తోంది. ఈ పరిస్థితుల్లో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు రైతాంగాన్ని మరింత అయోమయానికి గురిచేస్తోంది. కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు సాగునీరు చేరేపరిస్థితి లేకుండా పోయింది. దీనికితోడు ఆర్‌డీఎస్‌కు నాలుగు టీఎంసీలు పెంచినట్లు ప్రకటించారు. ఆ పెంచిన నీటివాటా మనజిల్లా వైపు మళ్లిస్తారా లేదా అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
 గతంలోనే ఆర్‌డీఎస్‌ద్వారా సాగునీళ్లు అందడంలేదు. దీనిపై ప్రజా ప్రతినిధులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. జిల్లాకు సాగునీటిని రాబట్టలేకపోతే నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులు దిష్టిబొమ్మలా మారే ప్రమాదం ఉందని రైతులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖలకు నిధుల మంజూరు లేదు. దీనికితోడు అక్టోబర్, నంబరు నెలల్లో వరుసగా తుపాన్ వచ్చి పంటలు దెబ్బతిన్నాయి. ఇల్లు కూలిపోవడం, ఇతర ఆస్తి నష్టాలతోపాటు పశువులు చనిపోయాయి. మనుషులు కూడా మృత్యువాత పడ్డారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయం అందలేదు.  అకాలవర్షాలతో పంటలకు రూ.800 కోట్ల వరకు నష్టం కలిగినట్లు తెలుస్తోంది. బాధితులకు త్వరితగతిన ఆర్థిక సహాయం అందేలా ప్రజాప్రతినిధులు కృషిచేయాలని జిల్లాలోని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా  జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను నిధుల కొరత పట్టిపీడిస్తోంది దీనిపై కూడా శాసన సభ్యులు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 తెలంగాణపై..!
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లును రాష్ట్రపతి నుంచి శాసన సభకు పంపనున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత నాయకులు దాన్ని అడ్డుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆమోదింపచేసుకునేందుకు ఎమ్మెల్యేలు తమ వంతుగా బాధ్యత వహించాలని తెలంగాణ వాదులు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement