భట్టిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్లను పరిశీలిస్తున్న ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎ. సురేష్‌బాబు, సిబ్బంది
సాక్షి, గుంటూరు/ భట్టిప్రోలు/ నూజెండ్ల/ మాచర్ల: రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా అవినీతిపై ఫిర్యాదుల కోసం ప్రభుత్వం ఇటీవల 14400 టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసింది. టోల్ ఫ్రీ కాల్ సెంటర్‌కు అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం రెవెన్యూ శాఖపైనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ రెవెన్యూ అధికారుల భరతం పట్టడంలో భాగంగా శుక్రవారం కొరడా ఝుళిపించింది. ఏసీబీ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాల మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఏక కాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన తనిఖీలు అర్ధరాత్రి వరకూ కొనసాగాయి. జిల్లాలోని భట్టిప్రోలు, మాచర్ల, నూజెండ్ల తహసీల్దార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఏసీబీ ఎస్పీ సురేశ్ బాబు నేతృత్వంలో భట్టిప్రోలులో, సీఐ రవిబాబు నేతృత్వంలో నూజెండ్లలో, శ్రీధర్ నేతృత్వంలో మాచర్లలో తనిఖీలు నిర్వహించారు.
ఆన్‌లైన్ దరఖాస్తులు పెండింగ్‌లో..
ఆకస్మిక తనిఖీల సందర్భంగా మాచర్లలో 148, నూజెండ్లలో 83, భట్టిప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో 118 ఆన్‌లైన్ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను అధికారులు గుర్తించారు. అదే విధంగా భట్టిప్రోలులో 18, మాచర్లలో 12, నూజెండ్లలో 30కుపైగా దరఖాస్తుదారులకు చేరాల్సిన పాస్‌పుస్తాకాలను గుర్తించి వీటిని ఎందుకు దరఖాస్తుదారులకు చేరవేయకుండా పెట్టుకున్నారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. భట్టిప్రోలులో రూ.18,600, మాచర్లలో రూ.65,500 లెక్కల్లో లేని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీఆర్‌వోల వారీగా ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఇటీవల కాలంలో రిజెక్ట్, అప్రూవ్ చేసిన దరఖాస్తులను పరిశీలించారు. అయితే చాలా వరకూ దరఖాస్తులను రెవెన్యూ సిబ్బంది సకాలంలో రిజెక్ట్, అప్రూవ్ చేయనట్టు గుర్తించారు.
పరారీలో సిబ్బంది...
ఏసీబీ అధికారుల తనిఖీల నేపథ్యంలో కొందరు సిబ్బంది పరారయ్యారు. మరికొందరు రికార్డులు తీసుకువస్తామని వెళ్లి తిరిగి రాలేదు. ఇంకొందరైతే ఫోన్‌లకు కూడా అందుబాటులో లేరు. భట్టిప్రోలు మండలంలో తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరేపల్లి వీఆర్‌వో ఎ.నరేంద్ర, ఐలవరం వీఆర్‌వో మోహన్‌రావు విచారణ సందర్భంగా రికార్డులు తీసుకువస్తామని వెళ్లి తిరిగి కార్యాలయానికి రాలేదు. మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్‌ఐ సాంబశివరావు, వీఆర్‌వో సయ్యద్ హుస్సేన్‌లు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. నూజెండ్ల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులు అనధికారికంగా నియమించుకుని పనిచేయించుకుంటున్న ఈ. వెంకటరమణ అనే వ్యక్తి అధికారులు గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో ఏసీబీ సీఐ గంగరాజు, ఎస్సైలు షరీఫ్, శ్రీనివాసమూర్తి ఆరు మంది హెడ్ కానిస్టేబుళ్లు, ఆరు మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు మీడియేటర్లు పాల్గొన్నారు.
తహసీల్దార్ కార్యాలయానికి తాళాలు
మంగళగిరి: రెవెన్యూ కార్యాలయాలపై ఏసీబీ దాడులు చేస్తున్నారనే పుకారుతో మంగళగిరిలో శుక్రవారం కలకలం రేగింది. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారనే సమాచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో సమాచార సేకరణకు విలేకర్లంతా కార్యాలయానికి చేరుకోగా తాళం వేసి ఉంది. తహసీల్దార్‌తో పాటు అధికారులు సిబ్బంది సైతం కార్యాలయంలో లేకుండా పోయారు. ఏసీబీ దాడుల సమాచారం ముందుగానే తెలుసుకొని రెవెన్యూ అధికారులు ఉడాయించారని కార్యాలయం వద్ద పలువురు సందర్శకులు చర్చించుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ రామ్‌ప్రసాద్‌ను వివరణ కోరగా ట్రైనీ ఐఏఎస్ అధికారులు 26 మందికి వివిధ ప్రదేశాలను చూపించే బాధ్యత ఉన్నతాధికారులు తనకు అప్పగించారని చెప్పారు. తాను లేకపోవడం వలనే కార్యాలయానికి తాళం వేశారని పేర్కొన్నారు. సిబ్బంది అంతా విధులలోనే ఉన్నారని తమ కార్యాలయంలో ఎలాంటి ఏసీబీ దాడులు జరగలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment