
జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుకు సత్వర చర్యలు
అధికారులకు సీఎం ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, నిట్, సెంట్రల్ వర్సిటీ తదితర విద్యాసంస్థల ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన బుధవారం మధ్యాహ్నం సచివాలయంలోని తన చాంబర్లో ఉన్నత విద్యాసంస్థల ఏర్పాటు అంశంపై మంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, కార్యదర్శి గిరిధర్ తదితరులతో సమావేశమై సమీక్షించారు.
సెంట్రల్ వర్సిటీ కోసం అనంతపురం, లేపాక్షి, హిందూపురంలలోని స్థలాలను, గిరిజన విశ్వవిద్యాలయం కోసం విశాఖ జిల్లా సబ్బవరంలోని స్థలాన్ని పరిశీలించాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఐఐటీ కోసం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక గ్రామాన్ని, ఐఐఎస్‌ఈఆర్ కోసం ఇదే మండలంలోని పంగూరు గ్రామాన్ని, ఐఐఎం కోసం విశాఖ జిల్లా ఆనందపురం గంభీరం గ్రామాన్ని ఎంపికచేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జాతీయ విద్యా సంస్థల కోసం రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,500 కోట్ల వరకు వ్యయమవుతుందని చెప్పారు.