
జాతీయ విద్యాసంస్థల ఊసేదీ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతిలో జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు సహా రాష్ట్ర మంత్రులు చేసిన హడావుడి అంతా ఒట్టిదేనని తేలిపోయింది. కేంద్రం జాతీయ విద్యా సంస్థలను మంజూరు చేయకనే 11 విద్యా సంస్థలను మంజూరు చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు స్ఫూర్తితో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మరో అడుగు ముందుకేశారు.
విశాఖపట్నంలో గిరిజన, పెట్రో కెమికల్ విశ్వవిద్యాలయం, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతంలో ఎన్‌ఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), ఎయిమ్స్(ఆల్ ఇండియా మెడికల్ సైన్సస్), వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐడీ(జాతీయ విపత్తు నివారణ సంస్థ), తిరుపతిలో ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ), సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐఎస్‌ఈఆర్(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్) క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని జూన్ 18న విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈ విద్యా సంస్థల ఏర్పాటుకు మూడు ప్రాంతాల్లోనూ కనిష్టంగా వెయ్యి ఎకరాల భూమిని గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు-విజయవాడలను ఎడ్యుకేషన్ హబ్‌లుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. లాసెట్ ఫలితాలు విడుదల చేసేందుకు జూన్ 22న తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటికీ వచ్చిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. కానీ.. ఆ సంస్థల ఏర్పాటుపై ప్రధాని నరేంద్రమోడీగానీ, కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీగానీ ఎక్కడా అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేవు.
పోనీ.. ఆ 11 విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా రాష్ట్రంలో క్యాంపస్‌లు ఏర్పాటుచేస్తామని ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎన్‌ఐటీ, ఎయిమ్స్, పెట్రో కెమికల్ యూనివర్సిటీ, గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని మాత్రమే అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం.
అంటే.. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో కూడా ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీలు లేనట్లు స్పష్టమవుతోంది. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు ప్రక్రియ మొత్తం కేంద్ర మానవవనరులశాఖ పరిధిలో ఉంటుంది. ఆ శాఖ ఇప్పటిదాకా జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గురువారం 2014-15 బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాష్ట్రంలో ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు. ఆ మూడు సంస్థల ఏర్పాటుకు నిధులు కేటాయిస్తున్నట్లు స్పష్టీకరించారు.
అంటే.. సీఎం చంద్రబాబు, మంత్రి గంటా ప్రకటించినట్లుగా 11 జాతీయ విద్యా సంస్థలు మంజూరు కానట్లు స్పష్టమవుతోంది. పోనీ.. బడ్జెట్లో మంజూరు చేసిన ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలను రాష్ట్రంలో ఏ ప్రాంతంలో నెలకొల్పుతామన్న అంశాన్ని సైతం కేంద్రం స్పష్టంగా చెప్పలేదు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. కేంద్రం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకుండానే రాష్ట్రంలో 11 జాతీయ విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు స్పష్టమవుతోంది.
ఇదే అదునుగా తీసుకున్న గంటా శ్రీనివాసరావు ఏ ఏ సంస్థను ఎక్కడ నెలకొల్పేది కూడా ప్రకటించేశారు. రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం లేనిది ఉన్నట్లు చూపిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తవుతున్నాయి. రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్, ఐఐటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తిరుపతికి ఏవి కేటాయిస్తున్నారో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని జిల్లా వాసులు డిమాండ్ చేస్తున్నారు.