విభజించే ముందు అసెంబ్లీ ఆమోదాన్ని తీసుకోవాలి: జేపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు కింద బిల్లును ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర శాసనసభ ఆమోదాన్ని తీసుకోవాలని కోరుతూ లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాష్‌నారాయణ బుధవారం రాష్ట్రపతికి ప్రణబ్‌ముఖర్జీకి లేఖ రాశారు. అసెంబ్లీ అభిప్రాయాలతో పనిలేకుండా రాష్ట్రాన్ని విభజిస్తామని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో చేస్తున్న ప్రయత్నాలు భారతదేశ ఫెడరలిజానికీ, ఐక్యతకు పెను ప్రమాదంగా పరిణమిస్తాయని లేఖలో పేర్కొన్నారు.
‘రాష్ట్రపతిగా మీరు రిపబ్లిక్ అధిపతి మాత్రమే కాదు, పార్లమెంట్‌లో భాగం కూడా. పార్లమెంట్ ఉభయ సభల ద్వారా, రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన మీరు.. కేంద్రానికి, రాష్ట్రాలకు కూడా ప్రాతినిద్యం వహిస్తారు. సుప్రీంకోర్టుతో పాటు మీరు రాజ్యాంగానికి, ఫెడరలిజానికి అంతిమ పరిరక్షకులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేందుకు ప్రవేశపట్టే ఏ బిల్లుకైనా సిఫార్సు చేసే ముందు రాష్ట్రపతి తన రాజ్యాంగబద్ధ విధిని స్వతంత్రంగా నిర్వర్తించాల్సిన సందర్భమిది. ఇది ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే కాకుండా మన ఫెడర ల్ రాజ్యాంగానికి, భారతదేశానికి కూడా కీలక సందర్భం. ఆర్టికల్ 3 కింద బిల్లుని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర శాసనసభ ఆమోదం తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం’ అని పేర్కొన్నారు.