పరిహారం.. పరిహాసం!
తమిళనాడు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం సొమ్ము వచ్చేసింది. మీరంతా జిల్లా కేంద్రానికి వచ్చేయండి.. చెక్కులు ఇచ్చేస్తాం..
ఈ నెల 16న జిల్లా అధికార యంత్రాంగం తరఫున హడావుడిగా పిలుపు,.. అదే విషయమై పత్రికా ప్రకటనలు జారీ..
ఈ నెల 17న.. మంత్రి అచ్చెన్నాయుడు, కలెక్టర్ చేతుల మీదుగా బాధితుల తరఫున వచ్చిన వారికి చెక్కుల పంపిణీ..
ఇదంతా జరిగింది.. ప్రతిపక్ష నాయకుడు, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బాధితుల పరామర్శకు వచ్చిన రోజే..
ఆయన వెళ్లే సమయానికి బాధితులు ఇళ్ల వద్ద ఉండకుండా చేయాలన్న దురుద్దేశంతోనే అధికార టీడీపీ నేతలు అధికార యంత్రాంగం ద్వారా హడావుడిగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని అప్పట్లోనే విమర్శలు గుప్పుమన్నాయి.
ఇప్పుడు జరిగింది చూస్తే.. ఆ విమర్శలు.. టీడీపీ కుట్రలు నిజ మేనని తేటతెల్లమవుతోంది. హడావుడిగా ఇచ్చిన ఆ చెక్కులు చెల్లని చిత్తు కాగితాల్లా తిరిగివచ్చాయి.
కొత్తూరు: బాధితులను పరామర్శించడాన్ని.. నష్టపరిహారం పంపిణీని సైతం అధికార టీడీపీ రాజకీయం చేస్తోందనడానికి చెన్నై బాధితులకు హడావుడిగా ఇచ్చిన చెక్కులు చెల్లని ఉదంతం నిదర్శనంగా నిలుస్తోంది. గత నెల చెన్నైలో బహుళ అంతస్తుల భవనం కూలినదుర్ఘటనలో మృతి చెందిన జిల్లాకు చెందిన 14 మంది కుటుంబ సభ్యులకు తమిళనాడు ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ నెల 17న జిల్లా కేంద్రానికి బాధిత కుటుంబీకులను ప్రత్యేకంగా రప్పించి మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ సంతకంతో ఉన్న చెక్కులను అదరాబాదరాగా అందజేశారు. ఇందులో భాగంగా కొత్తూరు మండలానికి చెందిన అమలాపురం రమేష్, రాజేష్‌ల తరఫున వారి తండ్రి అమలాపురం సూర్యారావుకు రెండు చెక్కులు, కిమిడి సుబ్బయ్య భార్య కిమిడి శశిమ్మ పేరిట ఒక చెక్కు అందజేశారు. ఈ చెక్కులను సూర్యారావు స్థానిక ఏపీజీవీబీలో ఉన్న తన ఖాతాలో వేశారు.
కలెక్షన్ కోసం వాటిని కొత్తూరు ఎస్‌బీఐకి పంపగా చెక్కులో పేర్కొన్న ఖాతా(నెం. 11152302687)లో నగదు లేకపోవడంతో ఆ చెక్కులు వెనక్కి వచ్చాయి. శనివారం బ్యాంకుకు వెళ్లిన సూర్యారావుకు ఏపీజీవీబీ మేనేజర్ వినోద్ ఈ విషయం చెప్పి చెక్కులను తిరిగి ఇచ్చేశారు. కాగా కిమిడి శశిమ్మ తన చెక్కును స్థానిక ఎస్‌బీఐలో జమ చేయగా, అది కూడా చెల్లకుండా పోయింది. చెక్కులో సూచించిన ఖాతాలో బ్యాలెన్స్ లేనందున చెక్కు ఇంకా మారలేదని ఎస్‌బీఐ మేనేజర్ ప్రకాశరావు తెలిపారు. ఖాతాలో డబ్బులు వేసిన వంటనే శశిమ్మ ఖాతాకు చెక్కు మొత్తాన్ని జమ చేస్తామని చెప్పారు. కాగా చెక్కులు చెల్లకపోవడంతో లబోదిబోమన్న సూర్యారావు వాటిని తీసుకెళ్లి తాహశీల్దార్‌కు చూపించారు. వెంటనే ఆయన కలక్టరేట్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సోమవారం నాటికి అకౌంట్‌లో డబ్బులు వేస్తారని.. అ రోజు చెక్కులు తీసుకొని బ్యాంకుకు వెళ్లాలని కలెక్టరేట్ అధికారులు సూచించినట్లు తహశీల్దార్ పీవీ శ్యామ్‌సుందరావు తెలిపారు. కాగా పాలకొండ తదితర ప్రాంతాల్లోని బాధితులకు ఇదే అనుభవం ఎదురైనట్లు సమాచారం.
వికటించిన పన్నాగం
ప్రతిపక్ష నేత పర్యటనను విఫలం చేయాలన్న దురుద్దేశంతో అధికార పార్టీ పన్నిన పన్నాగం.. ఖాతాలో నిధులు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా హడావుడిగా చెక్కులు రూపొందించి ఇవ్వడం వల్లే ఈ చిక్కులు వచ్చాయి. అధికార పార్టీ రాజకీయాల కారణంగా బాధితులు అనవసరంగా ఇబ్బందులకు గురవుతున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ జిల్లాకు వస్తున్నారని ముందే తెలిసినా.. టీడీపీ నాయకులు జగన్ పరామర్శించే సమయానికి బాధితులు ఇంటి వద్ద లేకుండా చేసేందుకు జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అకౌంట్‌లో డబ్బులు లేకపోయినా చెక్కులు బ్యాంకు నిబంధనలకు నీళ్లొదిలారు. తీరా ఇప్పుడు చెక్కులు బౌన్స్ కావడంతో తీరిగ్గా సోమవారం నిధులు జమ అవుతాయి.. అప్పుడు వెళ్లి తీసుకోండని చెబుతున్నారంటేనే.. అప్పుడు చేసిందంతా ఆర్భాటమేనని.. బాధితులను పావులుగా చేసుకొని ఆడిన రాజకీయ నాటకమేనని వేరే చెప్పాలా!..