విజయనగరం క్రైం: అప్పుల్లో కూరుకుపోయాడు. అక్రమాలకు పాల్పడ్డాడు. కావలసిన చోట బదిలీ లక్ష్యంగా తన స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగినిని దారుణంగా హతమార్చాడు.
విజయనగరం క్రైం: అప్పుల్లో కూరుకుపోయాడు. అక్రమాలకు పాల్పడ్డాడు. కావలసిన చోట బదిలీ లక్ష్యంగా తన స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగినిని దారుణంగా హతమార్చాడు. అతడే రైల్వే ఉద్యోగి కాళ్ల గోపి. శృంగవరపుకోట రైల్వే విద్యుత్ సబ్ స్టేషన్ ఉద్యోగిని చిట్టిమోజు స్వాతి హత్య కేసులో ప్రధాన నిందితుడైన గోపి, మరో ముగ్గురు సహ నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేకరులకు అందించిన వివరాలివి. కొత్తవలసకు చెందిన కాళ్ల గోపి 1994 నుంచి రైల్వే పీఎస్‌ఐ డిపార్ట్‌మెంట్‌లో కళాసీగా పనిచేస్తున్నాడు. 2005 నుంచి ఎస్.కోటలో విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో డిపార్ట్‌మెంట్ టెస్టులు రాసి ఉత్తీర్ణుడవడంతో పదోన్నతి మీద జగదల్‌పూర్‌లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. తనకు పదోన్నతి ఇచ్చి ఎస్.కోటలోనే నియమించాలని గోపి అభ్యర్థించగా వారు నిరాకరించారు. మరోవైపు అతనికి సుమారు రూ.45 లక్షల వరకు అప్పులున్నాయి. దీంతో కొన్నాళ్లుగా మధు, పవన్ అనే ఇద్దరి సహకారంతో రాత్రివేళ విధుల్లో ఉన్నప్పుడు గొడౌన్‌లోని కాపర్‌ని ముక్కలుగా కోసి తన కారులో తరలించి కొత్తవలస రామకృష్ణకు విక్రయించేవాడు.
దానిపై సుమారు రూ.2 లక్షల వరకు సంపాదించి అప్పు తీర్చాడు. ఈ సంపాదనలో మధు, పవన్‌లకు కొంత వాటా ఇచ్చేవాడు. పదోన్నతిపై జగదల్‌పూర్ వెళ్తే అప్పులు తీర్చడం సాధ్యం కాదని, శృంగవరపుకోటలో ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్‌లో పనిచేస్తున్న టెక్నీషియన్‌ను చంపేస్తే తనకు ఆ స్థానంలో బదిలీ జరుగుతుందని భావించాడు. మే 11వ తేదీ సాయంత్రం ఏడుగంటల సమయంలో కొత్తవలస ఆర్‌టీసీ కాంప్లెక్స్ వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద గోపిని మధు, పవన్, మోహన్‌రాజు కలిశారు. వీరంతా బైకుల్లో పెట్రోల్ పోయించుకుని శృంగవరపుకోట వెళ్లి సబ్‌స్టేషన్ వద్దనున్న లే అవుట్‌లో బైకులను ఉంచారు. రాత్రి సుమారు 9.50 గంటల సమయంలో సబ్ స్టేషన్ ఇనుప తలుపు కింద నుంచి కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న కళాసి పార్వతి ముఖాన్ని వెనుక వైపునుంచి గోనె సంచితో మూసి, స్వాతిని బయటికి తీసుకొచ్చి కర్రలతో కొట్టి చంపారు.
స్వాతి, పార్వతిల వద్ద ఉన్న బంగారు పుస్తెలతాళ్లను సూత్రాలు, సెల్‌ఫోన్‌లను చోరీ చేశారు. ఒక పుస్తెలతాడును మధుకి తెలిసిన రమణ అనే వ్యక్తి ద్వారా కొత్తవలస బ్యాంక్ ఆఫ్ బరోడాలో తాకట్టు పెట్టి, మిగిలిన బంగారు ఆభరణాలను నలుగురు పంచుకున్నారు. శృంగవరపుకోట సీఐకు వచ్చిన సమాచారం మేరకు ఈనెల 16న రాత్రి ఎస్.కోట రైల్వే స్టేషన్ సమీపంలో నలుగురిని అరెస్ట్‌చేసి బంగారు అభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును చేధించటానికి విశేషంగా కృషి చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందించారు.
కేసు దర్యాప్తు కోసం సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలు 27మంది సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిస్టరీ ఛేదించారన్నారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని, వారి కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయన్నారు. సమావేశంలో జిల్లా అదనపు( ఆడ్మిన్) ఎస్పీ ఎ.వి.రమణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ టి.త్రినాథ్, విజయనగరం డీఎస్పీ పి.వి.రత్నం, సీసీఎస్ డీఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, డీసీఆర్‌బీ డీఎస్పీ కె.ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.