టీడీపీ గూండాగిరీ! | TDP Acticvists Attack On Farmers And YSRCP Activists In East Godavari | Sakshi
Sakshi News home page

టీడీపీ గూండాగిరీ!

Published Wed, Mar 4 2020 11:52 AM | Last Updated on Wed, Mar 4 2020 11:52 AM

TDP Acticvists Attack On Farmers And YSRCP Activists In East Godavari - Sakshi

సాక్షి, సీతానగరం(తూర్పుగోదావరి):  చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కోసం జరిగిన బలవంతపు భూసేకరణతో నష్టపోయి, క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న రైతులు కొండ్రు రమేష్, మట్ట వసంతరావు, తోటకూర పుల్లపురాజు, బొమ్మిరెడ్డి సత్యనారాయణ, చిటికినెడ్డి పోశయ్య, కాజా ప్రభాకరరావు తదితరులు మంగళవారం మండలంలోని మునికూడలి గ్రామంలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. వారికి సంఘీభావంగా వైఎస్సార్‌ సీపీ వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ పెదపాటి డాక్టర్‌బాబు, సత్యం రాంపండు, చల్లమళ్ళ సుజీరాజు, వలవల వెంకటరాజు, అంబటి రాజు తదితర నాయకులు కూడా ఆందోళన శిబిరంలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా కూడా వైఎస్సార్‌ సీపీ నాయకులు నిలిచారు.

అదే సమయంలో ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ మంగళవారం మండలంలోని రఘుదేవపురంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ప్రారంభించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్తున్నారు. మునికూడలిలోని ఆందోళన శిబిరం వద్దకు చేరగానే.. నారా లోకేష్, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ల సమక్షంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కర్రలతో రైతులను, వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. ఆందోళన శిబిరాన్ని పీకేశారు. అక్కడే ఉన్న కుర్చీలతో కూడా నిరసనకారులపై దాడి చేశారు. డీఎస్పీ సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై ఆనంద్‌కుమార్‌తో పాటు ముగ్గురు ఎస్సైలు, 30 మంది పోలీస్‌ సిబ్బంది టీడీపీ శ్రేణులను నిలువరించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఖాతరు చేయకుండా పోలీసులపై కూడా టీడీపీ నాయకులు దాడులు చేసి, భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడుల్లో వడ్లమూరి ప్రభాస్, వడ్ల మూరి దివాకర్‌వర్మతో పాటు పలువురికి గాయాలయ్యాయి.

సీతానగరం కానిస్టేబుల్‌ నవ్య తలకు తీవ్ర గాయమవడంతో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గోకవరం కానిస్టేబుల్‌ జాహ్నవికి స్వల్పంగా గాయపడ్డారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు గంటకు పైగా స్వైరవిహారం చేస్తూ ఆందోళనకారులను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. సమాచారం అందుకున్న రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, యువ నాయకుడు జక్కంపూడి గణేష్‌ సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. 

వీధిరౌడీలు, గూండాల్లా ప్రవర్తించారు 
టీడీపీ నాయకులు, కార్యకర్తలు వీధి రౌడీలు, గూండాల్లా ప్రవర్తించారని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధిత రైతులపై దాడులు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురైన రైతులు నిరసన కార్యక్రమం చేపడితే, ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్, పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్, టీడీపీ శ్రేణులు కర్రలతో దాడికి దిగడం అప్రజాస్వామికమని అన్నారు. దాడుల కోసం రాజమహేంద్రవరం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకువచ్చి కర్రలతో దాడులు చేశారన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. కార్యక్రమంలో బాధిత రైతులు మడిచర్ల సత్యనారాయణ, మడిచర్ల అన్నవరం, వైఎస్సార్‌ సీపీ నాయకులు బొల్లి సుబ్బన్న, కోన రామకృష్ణ, ఏసు, ఏక రాజు, నల్లా శ్రీను, యలమాటి చిట్టియ్య, కవల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. 


పొద్దున్న లేస్తే ప్రజల గురించే ఆలోచిస్తున్నట్టు సుద్దులు చెప్పే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌ సాక్షిగా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు మునికూడలి గ్రామంలో ప్రజలపై చెలరేగిపోయారు. మూడు రాజధానులు కావాలంటూ శాంతియుతంగా ఆందోళన చేసిన ప్రజలపై గూండాగిరీ ప్రదర్శించారు. ఏకంగా కర్రలతో దాడులకు దిగి, పలువురిని గాయపరిచారు. ఈ దాడుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ కూడా గాయపడ్డారంటే టీడీపీ శ్రేణులు ఎంతలా చెలరేగిపోయాయో అర్థం చేసుకోవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement