ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయలక్ష్మి
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. అధికార పార్టీ నాయకుల వేధింపులతో ఇదంతా జరిగిందని టీడీపీ నాయకులు హడావుడి చేశారు.వివరాలు.. మచిలీపట్నంలో ఆశ కార్యకర్తగా పనిచేస్తున్న జయలక్ష్మి, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు అనుచరురాలిగా టీడీపీలో క్రీయాశీలకంగా పనిచేసేవారు. ఆశ కార్యకర్తగా పనిచేస్తూనే 2014 మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైంది. ఆ తరువాత మంత్రి రవీంద్ర సిఫార్సుతో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో సెక్యురిటీ గార్డు ఉద్యోగాన్ని సంపాదించింది.
కాగా ఆమె రెండు ఉద్యోగాలపై∙ఫిర్యాదుల మేరకు ఇటీవల ప్రభుత్వాస్పత్రి ఉన్నతాధికారులు ఆమెను పిలిపించి ఏదో ఒక ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో చేసేది లేక సెక్యురిటీ గార్డు ఉద్యోగానికి రాజీనామా చేసింది. రెండో ఉద్యోగం కూడా ఎక్కడ పోతుందోనని ఆందోళనతో మనస్తాపంతో శనివారం మధ్యాహ్నం నిద్ర మాత్రలు మింగి జయలక్ష్మి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. విషయాన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే టీడీపీ నాయకులు పరామర్శించి అధికార పార్టీ వేధింపులతోనే ఆత్మహత్య యత్నం చేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment