టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.. | TDP activists attacked | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు..

Published Tue, Aug 26 2014 2:05 AM | Last Updated on Tue, Mar 19 2019 6:03 PM

TDP activists attacked

* గ్రీవెన్స్‌లో రూరల్ ఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు
* రక్షణ కల్పించాలని వినతి
గుంటూరు క్రైం: ‘మా క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ భార్య ఉద్దేశపూర్వకంగా నిత్యం మమ్మల్ని దుర్భాషలాడుతోంది. ఇదేమిటని ప్రశ్నిస్తే మాపై అక్రమ కేసులు బనాయిస్తోంది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం గుంటూరులోని నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో మాపై అక్రమ కేసు బనాయించింది...’ అని జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని పోలీసు క్వార్టర్స్‌కు చెందిన పలువురు మహిళలు రూరల్ ఎస్పీ పి.హెచ్.రామకృష్ణను కలిసి రక్షణ కల్పించాలని వేడుకున్నారు.

జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలోని రూరల్ ఎస్పీ కార్యాలయంలో సోమవారం పోలీసు గ్రీవెన్స్ జరిగింది. మొత్తం వందకు పైగా అందిన ఫిర్యాదులను ఎస్పీ రామకృష్ణ, అదనపు ఎస్పీ డి.కోటేశ్వరరావులు పరిశీలించారు. సంబంధిత ఫిర్యాదు వివరాలను ఆయా స్టేషన్‌లకు అధికారులకు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు.
 కొందరు బాధితుల సమస్యలు వారి మాటల్లోనే...
 
కక్ష పెంచుకున్నారు..
గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేశాను. అప్పటినుంచి నాపై కక్ష పెంచుకున్న  టీడీపీకి చెందిన కార్యకర్తలు చల్లా రాజశేఖరరెడ్డి, ఓర్సు శ్రీను, గోవిందు, గరికపాటి శ్రీను, ఎస్.మంగమ్మలు నిత్యం పలు సాకులు చూపుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈనెల 24న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఐదుగురు మా ఇంటిపై దాడి చేశారు. దుర్భాషలాడి కులం పేరుతో దూషించడంతోపాటు, కాలనీ వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రెండ్రోజుల్లో ఇల్లు ఖాళీ చేయకపోతే హతమారుస్తామని హెచ్చరించారు. వారినుంచి ప్రాణ రక్షణ కల్పించి కులం పేరుతో దూషించినవారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి.
 - జాజుల శాంత, ఆదర్శనగర్ కాలనీ,పిడుగురాళ్ళ మండలం
 
ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు..
మా గ్రామంలోని సి.హెచ్.మహేశ్వరరెడ్డి 21 సెంట్ల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు నా వద్ద తాకట్టు పెట్టి రూ.10 లక్షలు ఈ ఏడాది జూన్‌లో తీసుకున్నాడు. అనంతరం అతని పేరుతో రిజిస్టర్ అయిన స్థలాన్ని నాకు తెలియకుండా రహస్యంగా రిజిస్టర్ రద్దు చేయించాడు. విషయం తెలియడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని నిలదీశాను. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పాడు. ఇదే విషయంపై పిడుగురాళ్ళ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలి.
 - భవిరిశెట్టి సూర్యనారాయణ, పిడుగురాళ్ల  
 
బెల్టుషాపు తొలగించాలి..
రేపల్లె, చెరుకుపల్లి రహదారిలో ఇటీవల నూతనంగా బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించారు. దాని పక్కనే బెల్టుషాపును కూడా కొనసాగిస్తున్నారు. ఈ కారణంగా కళాశాలలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థినులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో బెల్టుషాపులు కొనాగిస్తుండటంతో సమీప ప్రాంతంలో ఉన్న మేం తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నాం.
 - కె.సాయికుమారి, నగరం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement