ఒంగోలు టౌన్: ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల గుర్తును విస్తృతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించింది. అందుకు పాఠశాలల బాలికలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు హడావుడిగా ఏర్పాట్లు చేస్తోంది. విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సిన సైకిళ్లను చివర్లో ఇవ్వనుంది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఈ సమయంలో బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయడం ద్వారా రెండు విధాలా ప్రయోజనం పొందవచ్చన్న ఆలోచనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఒకవైపు బాలికలు సైకిళ్లు తొక్కుకుంటూ పాఠశాలలకు వెళ్తుంటే, ఆ సైకిళ్లను అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పించిందని ప్రచారం చేయించడం, ఆ ప్రచారం ఎన్నికల్లో తమకు అనుకూల ఓటింగ్‌కు ఎంతగానో దోహదపడుతుందన్న అంచనాల్లో అధికారపార్టీ నాయకులు ఉండటం విశేషం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతి చదువుతున్న 24948 మంది బాలికలకు సైకిళ్లను అందజేసేందుకు ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఎన్నికల కోడ్ వస్తే సైకిళ్ల పంపిణీకి ఎక్కడ బ్రేక్‌లు పడతాయోనన్న ఉద్దేశంతో హడావుడిగా బాలికల గణాంకాలను సేకరిస్తోంది.
నవ్విపోదురుగాక నాకేంటి!
బాలికల్లో డ్రాప్ అవుట్స్‌ను తగ్గించేందుకు సైకిళ్లను గత కొన్నేళ్ల నుంచి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలను లక్ష్యంగా చేసుకొని వారికి సైకిళ్లు అందిస్తున్నారు. ఆ బాలికలు తమ ఇళ్ల నుంచి పాఠశా>లలకు సకాలంలో చేరుకోవడం ద్వారా బాలికల్లో డ్రాప్ అవుట్స్ తగ్గుతాయనేది సైకిళ్ల పంపిణీ ముఖ్య ఉద్దేశం. పాఠశాలల వారీగా ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు ఎంత మంది ఉన్నారో పాఠశాల విద్యాశాఖలో స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతమంది ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలు ఉన్నారో గుర్తించి అందుకు అనుగుణంగా జిల్లాల వారీగా సైకిళ్లను అందజేస్తే సరిపోతోంది.
అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం చివరి దశకు చేరుకున్న సమయంలో ప్రభుత్వం హడావుడిగా బాలికల సైకిళ్లను తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశమైంది. పాఠశాలలు ప్రారంభించిన ఒకటి రెండు నెలల్లో సైకిళ్ల పంపిణీ ప్రక్రియను పూర్తిచేస్తే సరిపోతోంది. అయితే పాఠశాలలు మూసే సమయం దగ్గరపడుతున్న తరుణంలో ప్రభుత్వం సైకిళ్లు పంపిణీ చేసేందుకు జిల్లాల వారీగా ఇండెంట్లు తీసుకొని దానికి అనుగుణంగా వాటిని అందజేస్తామంటూ హడావుడిగా ప్రకటన చేయడంపై అటు బాలికలతోపాటు ఇటు ఉపాధ్యాయ వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా సంవత్సరం చివర్లో ఏ ఒక్క బాలిక డ్రాప్ అవుట్ కాదు. ఒకవేళ పాఠశాల మానివేయాలనుకున్నా ఈ రెండు నెలలు చదువుకొని మానివేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం డ్రాప్ అవుట్స్‌ను తెరపైకి తీసుకువచ్చి సైకిళ్లను పంపిణీ చేయాలని చూడటంపై ఉపాధ్యాయ వర్గాల నుంచే విమర్శలు వస్తున్నాయి. డ్రాప్ అవుట్స్ బాలికలపై ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యా సంవత్సరం ప్రారంభంలో సైకిళ్లను పంపిణీ చేసి ఉండేదని, విద్యా సంవత్సరం చివర్లో డ్రాప్ అవుట్స్ అంశాన్ని తీసుకువచ్చి హడావుడిగా సైకిళ్ల పంపిణీకి కసరత్తు చేస్తుండటంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పంపిణీ ప్రచారాస్త్రం
ఎనిమిది, తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికలకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు ప్రతి ఏటా టెండర్లు పిలుస్తారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియను మొదట్లోనే పూర్తి చేయాల్సి ఉంది. అయితే ప్రభుత్వం ‘ఎన్నికల’ దృష్టితో ఆలోచించి కాలయాపన చేసుకుంటూ వచ్చింది. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుండటం, అదే సమయంలో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడనుండటంతో చంద్రబాబు ప్రభుత్వం ‘డబుల్ ధమాకా’గా సైకిళ్లను తెరపైకి తీసుకువచ్చింది. ఒక సైకిల్‌తో రెండు రకాల ప్రయోజనాలంటూ వాటిని బాలికలకు పంపిణీ చేసేందుకు టెండర్లను ఖరారుచేసి హడావుడిగా అందించేందుకు కంకణం కట్టుకొంది. బాలికలకు సైకిళ్లను పంపిణీ చేయకముందే ప్రభుత్వ నిర్ణయం నవ్వులపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment