సాక్షి, ఏలూరు : ఏలూరు అసెంబ్లీ స్థానానికి పోటీచేస్తున్న టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి బుజ్జి నామినేషన్ కార్యక్రమానికి రండి రూ.1000 పట్టుకెళ్లండి అంటూ కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగరంలోని పలు డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు డ్వాక్రా మహిళలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేటర్ పిలుస్తున్నారు, వెళ్లకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందకుండా చేస్తారేమోనని వెళ్తున్న మహిళలకు కార్పొరేటర్లు ఈ ఆఫర్లు ఇస్తున్నారు. బుజ్జి నామినేషన్ సందర్భంగా నిర్వహించే ర్యాలీకి వస్తే కార్పొరేటర్లు రూ.500, బుజ్జి మరో రూ.500 ఇస్తారని చెబుతున్నారు.
అలాగే బుజ్జిని రెండోసారి కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత డ్వాక్రా మహిళలపై ఉందని, ఇప్పటివరకూ వారికి ప్రభుత్వం నుంచి వివిధ విధాలుగా అందిన రుణాలు, రుణమాఫీ వంటివన్నీ బుజ్జి చలువే అన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఎన్నికల్లో బుజ్జికి ఓటు వేసేందుకు కొంత మొత్తాన్ని చెల్లిస్తారని(ఎంత ఇస్తారో ప్రకటించడం లేదు) చెబుతున్నారు. బుజ్జి అత్యధిక మెజార్టీతో గెలిస్తే ప్రతి డ్వాక్రా మహిళకూ ఖరీదైన చీర బహూకరిస్తారని ప్రలోభ పెట్టారని ఈయా సమావేశాలకు హాజరైన మహిళల్లో కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ‘సాక్షి’ దృష్టికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment