అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ కౌన్సిలర్ ఎస్.మురళీధరరావు
శ్రీకాకుళం, ఆమదాలవలస: అధికారులను కార్యాలయంలో పెట్టి తన్నాలంటూ టీడీపీ కౌన్సిలర్ ఎస్.మురళీధరరావు అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ తమ్మినేని గీత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. వైఎస్సార్ సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ బొడ్డేపల్లి రమేష్‌కుమార్‌తోపాటు కౌన్సిలర్లు ప్రజాసమస్యలపై మాట్లాడుతూ అధికారులను, పాలకులను నిలదీశారు. మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి సాధారణ నిధులు, మున్సిపల్ బడ్జెట్ తదితర అంశాలపై లోతుగా అధ్యయనం చేసి కౌన్సిలర్లందరికీ వివరాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ తరుణంలో టీడీపీ కౌన్సిలర్ ఎస్.మురళీధరరావు లేచి ఈ సమాచారం అంతా మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులే ప్రతిపక్ష నాయకులకు అందిస్తున్నారని, అధికారులను కార్యాలయంలో పెట్టి తంతే బుద్ధి వస్తుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారుల వల్లే గోప్యంగా ఉంచాల్సిన సమాచారం వైఎస్సార్ సీపీ నాయకులకు తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నిరసన తెలియజేస్తూ చైర్‌పర్సన్ పోడియం వద్దకు చేరారు. అధికారుల పట్ల అసభ్యకరంగా మాట్లాడడం తగదన్నారు. వెంటనే మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంతలో మున్సిపల్ చైర్‌పర్సన్ జోక్యం చేసుకొని రమేష్‌కుమార్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడటంతో విపక్ష, స్వపక్ష కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment