జీవోఎం భేటీకి వెళ్లం: టీడీపీ | TDP decides not to go to GoM meeting | Sakshi
Sakshi News home page

జీవోఎం భేటీకి వెళ్లం: టీడీపీ

Published Fri, Nov 8 2013 2:35 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

TDP decides not to go to GoM meeting

మొత్తం ఎనిమిది పార్టీలను ఆహ్వానించిన జీవోఎం
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటు చేసిన జీవోఎం భేటీకి  తమ పార్టీ  వెళ్లబోవడంలేదని తెలుగుదేశంపార్టీ స్పష్టంచేసింది. రాష్ట్ర విభజనపై పార్టీలో వైరుధ్యాలున్నాయని, ఈ భేటీకి తమ ప్రతినిధులెవ్వరూ హాజరు కాబోరని ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టంచేశారు. విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడమే కాకుండా దానిని ఇప్పటివరకు వెనక్కు తీసుకోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరిన మేరకే యూపీఏ ప్రభుత్వం జీవోఎంను ఏర్పాటు చేసింది. తర్వాత ఢిల్లీలో జరిపిన ధర్నా సందర్భంగా విభజన అంశంపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిన చంద్రబాబు సీమాంధ్రకు సమన్యాయం చేయాలని కోరారు. కానీ జీవోఎంకు మాత్రం ఎలాంటి నివేదిక ఇవ్వకుండా ప్రధానికి లేఖ రాసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు జీవోఎం భేటీకి ఆహ్వానం వచ్చినా.. వెళ్తే తన వైఖరి చెప్పాల్సి వస్తుందనే భయంతో వెళ్లకూడదని నిర్ణయించుకోవడం గమనార్హం.
 
ఎనిమిది పార్టీలకు ఆహ్వానం
రాష్ట్ర విభజనపై ఏర్పాటయిన కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) తో ఈనెల 12, 13 తేదీలలో చర్చలకు ఢిల్లీ రావాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రంలో మొత్తం ఎనిమిది పార్టీలకు లేఖలు పంపింది. జీవోఎంకు నివేదికలిచ్చిన ఐదు పార్టీలనే మొదట ఆహ్వానించినప్పటికీ, జీవోఎంకు నివేదికలు సమర్పించని వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, టీడీపీలను సైతం ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే గురువారం ప్రకటించారు. ఈ మూడు పార్టీలకు 13న అరగంట చొప్పున విడిగా సమయం కేటాయించారు. జీవోఎం భేటీకి ఆహ్వానిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్ రాసిన లేఖలు అందాయని సీపీఐ, సీపీఎం, బీజేపీ నిర్ధారించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement