
ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరుతున్న టీడీపీ నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన క్రమంలో ప్రతిపక్ష పార్టీల నేతలు, క్యాడర్ అధికార పార్టీ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వలసల హడావుడి భారీ స్థాయిలో మొదలైంది. సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ వలసలు కొనసాగుతుంటాయి. కానీ దీనికి భిన్నంగా నెల్లూరు రూరల్ టీడీపీ నాయకత్వంపై నమ్మకం లేక తమ ఉనికిని చాటుకునేందుకు ఆ పార్టీ క్యాడర్ వైఎస్సార్‌సీపీ వైపు చూస్తోంది. తాజాగా సోమవారం నలుగురు మాజీ కార్పొరేటర్ల చేరిక ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
సాక్షి, నెల్లూరు: గడిచిన ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌సీపీ విజయదుందుబి మోగించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో పదికి పది స్థానాలు గెలిచి జిల్లాలో ప్రతిపక్ష పార్టీ ఉనికిని గల్లంతు చేసింది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధికారంలోకి రాగానే కొద్ది రోజులు నేతల చేరికతో హడావుడి కొనసాగింది. తాజాగా ఇప్పుడు నెల్లూరు రూరల్‌లో వలసల పర్వానికి నేతలు శ్రీకారం చుట్టారు. పార్టీలో దీర్ఘకాలంగా ఉన్న క్యాడర్ మనోభావాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు వలసలకు ప్రజాప్రతినిధులు అంగీకారం తెలుపుతున్నారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో సోమవారం టీడీపీకి చెందిన నలుగురు మాజీ కార్పొరేటర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీలో చేరారు. 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్, 30వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పి.మాధవి భర్త పి.ప్రసాద్, 27వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మల్లెబోయిన వెంకటేశ్వర్లు యాదవ్, 18వ డివిజన్ మాజీ కార్పొరేటర్ డి. సరోజనమ్మ కుమారుడు వంశీ తదితరులు ఉనికి దాట్లు పార్టీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లతో పాటు నెల్లూరు రూరల్ మండలం ఉంది. ఈ క్రమంలో టీడీపీలో ఉన్న మాజీ కార్పొరేటర్లు అందరూ అధికార పార్టీలో చేరేందుకు నేతలతో మంతనాలు నిర్వహిస్తున్నారు.
వాస్తవానికి రెండు నెలల క్రితమే పెద్ద సంఖ్యలో టీడీపీ మాజీ కార్పొరేటర్లు, నేతలు, మండల నేతలు, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతామని కోరారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్‌యాదవ్, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు ఆదాల ప్రభాకర్‌రెడ్డిని సైతం కోరారు. అయితే రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పార్టీ క్యాడర్‌తో చర్చించి వారు అంగీకరిస్తే పార్టీలోకి ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ నిర్ణయానికి అనుగుణంగా చేరికలకు శ్రీకారం చుట్టారు.
నెల్లూరు రూరల్‌లో టీడీపీ ఖాళీ
సార్వత్రిక ఎన్నికల అనంతరం నెల్లూరు రూరల్ టీడీపీ నేతలు ముఖం చాటేశారు. ఎన్నికలు పూర్తయి రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ క్యాడర్‌కు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, కనీసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా గడిచిన మూడు నెలల్లో నిర్వహించని పరిస్థితి. దీంతో పాటు పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్న వారు కూడా పూర్తిగా పార్టీకి దూరంగా ఉండటంతో రూరల్ టీడీపీ చుక్కాని లేని నావలా తయారైంది. దీంతో నేతలందరూ వైఎస్సార్‌సీపీ వైపు మళ్లుతున్నారు. మరో వైపు అభివృద్ధి కార్యక్రమాలు, క్ష్రేతస్థాయి పర్యటనలతో వైఎస్సార్‌సీపీ నేతలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు అంతా వైఎస్సార్‌సీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా స్థానిక నేతలు మొదలుకొని ఎమ్మెల్యే వరకు అందరిని కలిసి మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment