► చర్చకు రాని ప్రజా సమస్యలు
► కేంద్రాన్ని ప్రశ్నించడంలో అదే వెనకడుగు
► సొంత డబ్బా, ప్రతిపక్షాలపై ఆరోపణలకే పరిమితం
►బాబు ప్రసంగాలతో విసిగిపోయిన తమ్ముళ్లు
► సంక్షేమంలో ఆంధ్రాకన్నా తెలంగాణే బెటర్
విశాఖ వేదికగా ఆంధ్రాయూనివర్సిటీలో టీడీపీ నిర్వహించిన మహానాడు ఎంత ఆడంబరంగా ప్రారంభమైందో.. అంతకంటే నీరసంగా ముగిసింది. దాదాపు 26 వేల మందికి పైగా మహానాడు పండక్కి వస్తున్నారని డప్పేసిన తెలుగు నాయకులు తీరా కార్యక్రమం ముగిశాక మీడియాకు ముఖం చాటేశారు. ప్రతి సంవత్సరం వచ్చే పార్టీ పండగ్గా చెప్పుకునే మహానాడు ప్రెస్‌మీట్‌ల కాంబోగానే మిగిలింది. షరామామూలుగానే చంద్రబాబు తన ప్రసంగంలో ప్రతిపక్ష వైయస్సార్‌సీపీని, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌ని తిట్టిపోయడంలోనే మునిగిపోయారు.
సాధారణంగా పార్టీ పరంగా నిర్వహించే ఇలాంటి కార్యక్రమాల ద్వారా కార్యకర్తలకు ఏదొక సందేశం ఇస్తారు. దిశా నిర్దేశం చేస్తారు. భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారు. పైగా టీడీపీ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి రాష్ట్రంపై ఎంతో బాధ్యతగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగానే మహానాడుకు ముందు ఉత్తరాంధ్ర నాయకులు చాలా ఆశలే పెట్టుకున్నారు. రాష్ట్రంలో బాగా వెనకబడిన ప్రాంతంగా పేరున్న ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏదో ఒరగబెడతారని ఆశించారు. పార్టీకి కూడా గట్టి పట్టున్న ప్రాంతంకావడంతోపాటు పార్టీ అధికారంలో కూడా ఉండటంతో మేలు జరుగుతుందని ఊహించిన నాయకులు భంగపాటు తప్పలేదు.
సమస్యల ప్రస్తావనే లేదు
గత ఏడాది చెప్పినట్టుగా విశాఖకు రైల్వే జోన్ తీసుకొస్తానని ముక్తసరిగా చెప్పేసి చంద్రబాబు ముగించేశారు. రాష్ట్ర విస్తీర్ణంలో 15 శాతంగా దాదాపు కోటి మంది జనాభా ఉన్న ఉత్తరాంధ్రను మహానాడు సాక్షిగా చంద్రబాబు విస్మరించారు. విశాఖ రైల్వేజోన్ సహా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య, వంశధార ప్రాజెక్టు బాధితులకు నష్ట పరిహారం, మూత పడే స్థితిలో ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ వంటి ఎన్నో సమస్యలను ప్రస్తావించకుండానే మహానాడును మమ అనిపించేశారు.
మహానాడు జరిగిన ప్రతిసారీ ఎన్టీఆర్‌కు భారతరతన్న ఇవ్వాలని తీర్మానం.. ఆనక ఉట్టికెక్కించేయడం మామూలే. ఈసారీ అదే జరిగింది. కాకపోతే కేంద్రమంత్రి సుజన చౌదరి మరో అడుగు ముందుకేసి ఎన్టీఆర్‌కి భారతరత్న ఫైలు ప్రధాని టేబుల్ మీదే ఉందన్నారు. కార్యకర్తలు విసిగిపోయి బాబు మాటలమీద విశ్వాసం కోల్పోతున్నారని గుర్తించినట్టున్నారు.
గొప్పల కుప్పగా బాబు ప్రసంగం
మహానాడు ముగిసిన అనంతరం చివరి రోజున చంద్రబాబు ప్రెస్‌మీట్ నిర్వహించారు. మూడు రోజులు .. 27గంటలు.. 94 మంది ప్రసంగం.. 34 తీర్మాణాలు చేశామని గర్వంగా చెప్పారు. అయితే చేసిన తీర్మానాలన్నీ రాజకీయ తీర్మాణాలే కావడం విశేషం. మూడేళ్లలో రెండు మూడు తాత్కాలిక భవనాలకే పరిమితమైన అమరావతిని భవిష్యత్ తరాలకు కానుకగా ఇస్తానని చెప్పుకొచ్చారు. 2050 వరకు కూడా ఆంధ్రాలో టీడీపీ అధికారంలోనే కొనసాగాలని, రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా టీడీపీని అధికారంలోకి తీసుకొస్తానని నెరవేరని కోరికలు కోరారు.
గతేడాది కార్యకర్తల పిల్లలకు స్కూళ్లు కట్టిస్తానని చెప్పిన హామీ నెరవేరనే లేదు. ఈసారి పేద కార్యకర్తలకు రాయితీపై స్మార్ట్ ఫోన్లు ఇస్తానని ప్రకటించారు. జనానికి కనీస అవసరాలైన నీరు, విద్య, వైద్యం అందిస్తానని చెప్పడం మాని టెక్నాలజీ కా బాప్ నేనే అన్నట్టుగా ఈ ఏడాది చివరికి 40 లక్షల మందికి ఫైబర్ నెట్ ఇస్తానని ప్రగల్భాలు పోయారు. కరువుతో తాగడానికే నీళ్లు లేక అల్లాడుతున్నాం మహాప్రభో అని జనం మొత్తుకుంటుంటే నీటికి, కరెంటుకు మీటర్లు బిగిస్తానని జనం నెత్తిన శఠగోపం పెట్టే వచనాలు చెప్పారు.
మహానాడు వేదికపైనే ఒకవైపు పోలవరం.. మరోవైపు హైటెక్ సిటీ బొమ్మలను ఏర్పాటు చేయడంలోనే తెలుస్తుంది బాబుకి ఇంకా హైదరాబాద్‌పై మనసు చావలేదని. నిజానికి దేవెగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే పోలవరం పూర్తి కావాల్సి ఉన్నా చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే మరుగున పడిందని సడుగుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇటీవలే చెప్పుకొచ్చారు. వైయస్‌ఆర్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాలువల పనులు దాదాపు 90 శాతం వరకు పూర్తయితే కోర్టుకెళ్లి స్టేలు తీసుకొచ్చి కాలయాపన చేసింది కూడా బాబే.
ఇప్పుడు అదే ఎడమ కాలువను పట్టిసీమ అని, కుడి కాలువను పురుషోత్తమ పట్నం అని పేరు పెట్టి వాటిమీద కాఫర్ డ్యామ్‌లు కట్టి ప్రాజెక్టు పూర్తయ్యిందని చెప్పడం.. ఒక్కోదానికి నాలుగైదు సార్లు శంకుస్థాపనలు చేయడం బాబుకే తెలిసిన విద్య. కేంద్రం పూర్తిచేస్తానన్న పోలవరం ప్రాజెక్టును రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీకి ఇచ్చి నిర్మాణాన్ని ప్రశ్నార్థకం చేసిన ఘనతా ఆయనదే. తానే మేధావిలా ప్రజెంట్ చేసుకోవడం బాబుకు అలవాటు.
ప్రజా సమస్యలు పక్కనపెట్టి జనానికి అర్థంకాని పర్ క్యాపిటా ఇన్‌కం, జీడీపీ, జీఎస్‌డీపీల ప్రస్తావన తీసుకొచ్చారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.. ఈవీఎంల మీద అనుమానం అక్కర్లేదు.. ఓటేస్తే స్లిప్పురావాలి వంటి సందర్భం కాని విషయాలను ప్రస్తావించి ప్రజా సమస్యలను దారి మళ్లించారు. ఇవన్నీ వినలేకనే ఏమో బాబు స్పీచ్‌లో ఉంటే.. తమ్ముళ్లు బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ గడిపేశారట.
తండ్రిని మించిపోయిన లోకేష్
పనితీరును పక్కన పెడితే నారా లోకేష్ నాయుడు గొప్పలు చెప్పుకోవడంలో చంద్రబాబును మించిపోయారు. రాబోయే రెండేళ్లలో విశాఖను ఐటీ హబ్‌గా మార్చేస్తానని ప్రతినబూనారు. నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబే ఇప్పటికీ ఒక్క ఐటీ పరిశ్రమ విశాఖకు తీసుకురాలేకపోతే ఈయనొచ్చి ఎకాఎకిన ఐటీ హబ్‌గా మార్చేస్తానని చెప్పుకొచ్చారు. తాము ఏపని చేద్దామన్నా జగన్ అడ్డుపడుతున్నాడని వీరి అసమర్థతను ప్రతిపక్ష నాయకుడి మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్లు బాబుకే తెలిసిన విద్యను లోకేష్ కూడా బాగానే వంట పట్టించుకున్నాడని అనిపిస్తుంది.
ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేయడంలో బాబు కన్నా ఒక ఆకు ఎక్కువే చదివాడనిపిస్తుంది. అయితే కొంచెం ఇంప్రూవ్‌మెంట్ సాధించారు. ఇప్పటివరకు మాట్లాడిన ప్రతిసారీ ఏదో ఒక తప్పు చదివి విమర్శకులకు ఆయుధంగా మారే లోకేష్ నాయుడు ఈసారి మాత్రం తేలిగ్గానే బయటపడ్డారు. రాసిచ్చిన ప్రసంగమే అయినా తప్పులు లేకుండా చదివేయడంతో తెలుగు తమ్ముళ్లందరూ హమ్మయ్యా అని ఊపిరిపీల్చుకున్నారు.
వివాదాలతో మొదలెట్టి...
మహానాడు ప్రారంభమే వివాదాలతో మొదలైంది. గీతం కాలేజీ అధినేత ఆంధ్రా యూనివర్సిటీని దెయ్యాల కొంపతో పోల్చి నిప్పు రాజేస్తే.. యూనివర్సిటీలో ఏర్పాట్ల కోసమని ఏయూ స్వాగత ద్వారం కూల్చివేత మరింత మంట రాజేసింది. ఒక పెద్ద కాలేజీకి యజమాని అయ్యుండి కూడా యూనివర్సిటీని ఛీత్కారంగా మాట్లాడటంపై ఏయా ఉద్యోగ, విద్యార్థి, నాన్‌టీచింగ్ స్టాఫ్ నుంచి భారీగానే నిరసన వ్యక్తం కావడంతో మూర్తిచేత మహానాడు వేదికపై చంద్రబాబు క్షమాపణలు చెప్పించాల్సి వచ్చింది. లేదంటే ఈ నిరసనలు మరింత రాజుకుని మహానాడు జరగకుండా చేస్తాయని బాబు అనుకున్నట్టున్నాడు. మొత్తానికి ఆ వివాదాన్ని అలా ముగించారు.
గత 35 సంవత్సరాలుగా సాగుతున్న మహానాడు ఈసారీ అంతే ఆడంబరంగా మొదలై పేలవంగా సాగడంతో బాబు స్పీచ్‌లో ఉంటే తమ్ముళ్లు బీచ్‌లో సందడి చేశారు. ఎప్పుడైనా చంద్రబాబు ఏదైనా కార్యక్రమం చేపడితే అనుకూల మీడియా మొదటిగా రాసేది వంటకాల గురించే. ఇప్పుడూ అదే జరిగింది. వంటకాల విషయంలోనూ బాబు ఆరంభశూరుడని నిరూపించుకున్నాడు. మొదటి రోజు 40 వంటలకాలతో మెనూ తయారు చేస్తే రెండో రోజు ఆ సంఖ్య 34కి పడిపోయింది.. చివరి రోజు కేవలం 21 వంటకాలతోనే మమ అనిపించారు.
తెలంగాణలో అలా.. ఆంధ్రాలో ఇలా..
మహానాడు వేదికపై తెలంగాణ రాష్ట్ర టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్‌ఎస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో రుణమాఫీ, సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్‌ను మహానాడు వేదికగా రేవంత్ నిలదీశారు. ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికి 15 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కేసీఆర్‌ను ఆడిపోసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్‌ను కడిగిపారేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ అదే వేదికపై ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆ మాత్రమైనా ఏపీలో అమలు చేస్తున్నారో లేదో ముందుగా రేవంత్ అడిగి తెలుసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. నిజానికి సంక్షే మ పథకాల అమల్లో ఏపీ కంటే తెలంగాణ ప్రభుత్వమే ముందంజలో ఉంది.
అంగన్‌వాడీలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 15 వేలు ఇస్తుంటే ఆంధ్రాలో మాత్రం రూ. 7 వేలే ఇస్తున్నారు. ఆశావర్కర్లకు అక్కడ రూ. 6 వేలు ఇస్తుంటే.. ఇక్కడ రూ. 1500 ఇస్తున్నారు. మధ్యాహ్న భోజన వర్కర్లను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుంటే ఆంధ్రాలో మాత్రం తొలగించేశారు. తెలంగాణలో 24 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం మావల్ల కాదని చేతులెత్తేసింది. ప్రతిసారీ మహానాడులో ఒకతంతులా మారిన ఆత్మస్తుతి – పరనింద అన్న విమర్శల నుంచి ఈసారి కూడా చంద్రబాబు మహానాడు బయటకు రాలేదన్నది రూఢీ అయ్యింది.
– షేక్ కాలీషావలీ (వలీ)