
సర్వేచేస్తున్న వ్యక్తులను ట్యాబ్‌లతో సహా పోలీసులకుఅప్పగిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు.
మళ్లీ అధికారంలోకి రావాలని అన్నిరకాల అడ్డదారులు తొక్కుతున్నారు. ఓటర్లను సామ... భేద... దాన... దండోపాయాలతో లొంగతీసుకోవాలని చూస్తున్నారు. మాయోపాయంతో వారిని ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. సంతృప్తస్థాయి తగ్గుతోందని భావిస్తున్న సర్కారు లెక్కలేనన్ని డ్రామాలకు తెరతీసింది. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తోంది. మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించేవారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. ఇందులో భాగంగానే సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపిస్తోంది. కాల్ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:‘నమస్కారం. నేను, మీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. ఉన్నామంటే ఒకటి నొక్కండి, ఫర్యాలేదంటే రెండు నొక్కండి, చాలా బాగుందంటే మూడు నొక్కండి, అసలేం బాగోలేదంటే నాలుగు నొక్కండి’... అంటూ మీకు ఫోన్ చేసి అడుగుతున్నారా.!
‘మేం ఒక సంస్థ నుంచి వచ్చాం. రాష్ట్ర రాజకీయాలపై సర్వే చేస్తున్నాం. మేం అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. చంద్రబాబు, జగన్, పవన్‌కల్యాణ్.. ఈ ముగ్గురిలో వచ్చే ఎన్నికల్లో ఎవరు సీఎం ఐతే బాగుంటుందనుకుంటున్నారు.’ అంటూ మీ వద్దకు వచ్చి ఎవరైనా ఆరాతీస్తున్నారా.!
ఈ రెండింటికీ మీరు సమాధానంచెప్పాక ఒక సారి మీ ఓటరు లిస్టు చెక్ చేసుకోండి. ఎందుకంటే వారడిగిన ప్రశ్నలకు మీరు ఇచ్చిన సమాధానం టీడీపీకి వ్యతిరేకంగా ఉంటే మీ ఓటు తీసేసినా తీసేస్తారు. అవును..ఇన్నాళ్లూ దీనిపై అనుమానాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఇది నిజమేనేమోనినించేలా కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. పూసపాటిరేగ మండలంలోని కుమిలి గ్రామంలో ఎన్నికల రాజకీయ సర్వే పేరిట ఓటర్ల జాబితాతో కూడిన ట్యాబ్‌లను తీసుకుని సర్వే చేస్తున్న వ్యక్తులను వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం గుర్తించారు. వారిని పట్టుకుని, ట్యాబ్‌లతో సహా పోలీసులకు అప్పగించారు.
ఏం జరిగిందంటే: గజపతినగరానికి చెందిన గొల్లు కృష్ణ, గొల్లు దేముడుబాబు, తొత్తిడి దేముడు అనే యువకులు ‘పీపుల్స్‌పోల్ సర్వే’ పేరిట కుమిలి గ్రామంలో గురువారం సర్వే ప్రారంభించారు. ఆ గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితా ట్యాబ్‌లో వుండటంతో పాటు అధికారపార్టీకి అనుకూలంగా ప్రశ్నలు చేయడంతో అక్కడే ఉన్న వైఎస్‌ఆర్ సీపీ నాయకులు మహంతి శ్రీనివాసరావు, గుజ్జు సురేష్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అనుమానం వచ్చింది. అధికారపార్టీకి వ్యతిరేకంగా సమాధానాలిస్తున్న వ్యక్తుల వివరాలు ట్యాబ్‌లలో నమోదు చేసుకుని తర్వాత వారి ఓట్లు తొలగించే అవకాశం వుందని భావించి సర్వే సిబ్బందిని అడ్డుకున్నారు. పూసపాటిరేగలో ప్రతిపక్షానికి చెందిన సుమారు 140 ఓట్ల వరకు ఫారం–7 ఇవ్వకుండానే తొలగింపుల జాబితాలో కనిపిస్తున్నాయి. వీరంతా సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన వాయిస్ మెసేజీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాధానమిచ్చినవారని భావిస్తున్నారు. ఇదేమిటని తహసీల్దార్ జి.సూర్యలక్ష్మిని అడిగితే అమె తనకేమీ తెలియదన్నట్లు సమాధానమిస్తున్నారు. ఈ నేపధ్యంలో కుమిలిలో ఓటర్ల జాబితా సహా సర్వే జరుగుతుండటంతో తొలిగింపు ప్రక్రియలో భాగంగానే సర్వే జరుగుతోందనే అనుమానాలకు బలం చేకూరింది.
పోలీసుల హైడ్రామా
వైఎస్సార్‌సీపీ నేతలు అప్పగించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పూసపాటిరేగ ఎస్‌ఐ వి.బాలా జీరావు వారిని తూతూ మంత్రంగా విచారించి వదిలేశారు. వారిపై కేసు నమోదు చేయాలని నాయకులు కోరగా.. సర్వే చేయడం నేరం కాదంటూ తోసిపుచ్చారు. పైగా ట్యాబ్‌లు ఎందుకు తీసుకున్నారు... వాటిని వారికి అప్పగించేయండి... అంటూ పట్టుకున్న వైఎస్సార్‌సీపీ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఈ సంఘటనపై వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన మీడియాను పోలీస్ స్టేషన్ లోపలికి కూడా రానివ్వకుండా గేట్లు మూసేశారు. ‘నచ్చింది రాసుకోండి, మమ్మల్నేమీ అడగవద్దు’ అంటూ ఫోన్లలో సంప్రదించిన మీడియా ప్రతినిధులకు పోలీసులు సమాధానమిచ్చారు.
సీరియస్‌గా తీసుకున్న వైఎస్సార్ సీపీ
విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రం గా స్పందించారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్, డీజీపీ కార్యాలయం అధికారులతో మాట్లాడారు. పలువురు పార్టీ నేతలతో పాటు వెళ్లి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, రాష్ట్ర డీజీపీని కలవాలని నిర్ణయించారు. నిబంధనలకు విరుద్ధంగా ఓటరు లిస్టులను ట్యాబ్‌లలో ఉంచి, సర్వేలు చేస్తున్న వారిపైనా, వారి వెనకుండి ఈ పని చేయిస్తున్న వారిపైనా ఫిర్యాదు చేయనున్నారు. సర్వే పేరుతో ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వమే చేయిస్తుందనే కోణంలో విచారణ జరిపించాల్సిందిగా ఎన్నికల కమిషన్‌కు, డీజీపీని కోరనున్నారు. అవసరమైతే జాతీయ ఎన్నికల కమిషన్‌ను కూడా కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధపడుతున్నారు.
ఎన్నికల కమిషన్ పట్టించుకోవాలి
ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని పట్టించుకుని పారదర్శకంగా ఎన్నికలు జరిపించడానికి చర్యలు తీసుకోవాలి. సర్వేల పేరిట ఓటర్ల వద్దకు వెళ్లి వారి నాడి తెలుసుకొని అధికారపార్టీకి అనుకూలం అయితే ఓటు ఉంచుతారు. ప్రతి పక్షం అయితే వెంటనే ఓటును తీసేస్తున్నారు. అలా కుమిలి గ్రామంలో సర్వేపేరిట ట్యాబ్‌లలో సమాచారం సేకరిస్తుండగా ముగ్గురు వ్యక్తులు మాకు దొరికారు.– గుజ్జు సురేష్‌రెడ్డి, కుమిలి గ్రామం
ఓట్లు తొలగించడానికే సర్వే
కుమిలి గ్రామంలో జరిగిన సర్వే కేవలం ఓట్లను తొలగించడానికే. ట్యాబ్‌లో ఓటరు జాబితా వుంది. అధికార పక్షానికి అనుకూలంగా మాట్లాడితే ఓటు ఉంటుంది. ప్రతి పక్షానికి చెందిన వారని భావిస్తే ఓటును తీసేయడానికే సర్వే జరుగుతోంది. సర్వే చేసిన వారిని ప్రశ్నిస్తే సరైన సమాధానం రాలేదు. ఆ వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించాం.– మహంతి శ్రీనివాసరావు, రెల్లివలస.
Comments
Please login to add a commentAdd a comment