నంద్యాల నుంచే టీడీపీ పతనం
కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి శిల్పా ప్రకటన
- 14న జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరతా
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. ఇక్కడి నుంచే అధికార తెలుగుదేశం పార్టీ పతనం ప్రారంభమవుతుందని మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి ప్రకటించారు. అధికార పార్టీలో తమకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయని.. తమ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఈ నెల 14వ తేదీన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు ఆయన కర్నూలు జిల్లా నంద్యాలలో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సమావేశానికి పలువురు నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో భూమా నాగిరెడ్డిని చేర్చుకున్న తర్వాత కూడా సర్దుకుపోయిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకపోయినప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. పార్టీకి చేస్తున్న సేవలనూ గుర్తించలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సీటు విషయంలో నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నారని మండిపడ్డారు. తమ నేతలు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్న పార్టీలో ఇక కొనసాగలేమన్నారు.
వ్యతిరేకత పెరుగుతోంది
అధికారం చేపట్టి మూడేళ్లు గడిచినప్పటికీ జిల్లాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదని ఈ సందర్భంగా కార్యకర్తలు మండిపడ్డారు. నంద్యాలను సీడ్ హబ్‌గా మారుస్తామన్న సీఎం మాటలు ప్రకటనలకే పరిమితం అయ్యాయని విమర్శించారు. నంద్యాల పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడా కేటాయించని విషయాన్ని ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు ఎత్తి చూపారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన అనంతరం జరిగిన మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు.