ప్రలోభ పెట్టి గెలిచారు | YS Jaganmohan Reddy comments on Nandyal by polls results | Sakshi
Sakshi News home page

ప్రలోభ పెట్టి గెలిచారు

Published Tue, Aug 29 2017 1:09 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

ప్రలోభ పెట్టి గెలిచారు - Sakshi

ప్రలోభ పెట్టి గెలిచారు

నంద్యాలలో ఓటర్లను బెదిరించారు.. భయపెట్టారు: వైఎస్‌ జగన్‌
- కొనుగోలు చేసిన ఆ 20 మందితో రాజీనామాలు చేయించండి
ఎన్నికల్లో వాళ్లను గెలిపించండి... అదీ రెఫరెండం... సవాల్‌
విలువలే మాకు ప్రాణం..  శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్‌
మాకూ టైం వస్తుంది... మేమూ సత్తా చూపిస్తాం
బాబు మోసాలపై ప్రజలకు అవగాహన ఉంది
 
సాక్షి, హైదరాబాద్‌: అధికార దుర్వినియోగంతో గెలిచిన నంద్యాల ఉప ఎన్నికను చంద్రబాబు తన విజయంగా భావిస్తే అంతకన్నా దిగజారుడు రాజకీయం మరొకటి ఉండదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఇంకో ఏడాది ఆయన పాలనే ఉంటుందని ప్రజలు భయపడి ఓట్లేశారని విశ్లేషించారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురిచేసినా, ప్రలోభాలకు పాల్పడినా తమ పార్టీకి ధైర్యంగా ఓటేసిన నంద్యాల ప్రజలకు జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచీ విలువలకే కట్టుబడి ఉంటోందని, ఇక ముందు కూడా ఇదే కొనసాగుతుందని జగన్‌ పునరుద్ఘాటించారు. అలాంటి విలువలను గౌరవించిన శిల్పా సోదరులకు హాట్సాఫ్‌ తెలిపారు. ఉప ఎన్నికలో పార్టీకి అండగా నిలిచిన ప్రతీ కార్యకర్తకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే....
 
అడుగడుగునా బెదిరింపులే...
‘‘నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ అన్ని రకాల అధికార దుర్వినియోగానికి పాల్పడింది. రూ. 200 కోట్లకు పైగా డబ్బులు పంచారు. పోలీసులను ఇష్టానుసారం వాడుకున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే...  ఓటర్ల దగ్గరకు మనుషులను పంపించి, ఇదిగో మీ ఆధార్‌ కార్డు, ఓటేయకపోతే పెన్షన్‌ కట్‌ అంటూ భయపెట్టారు. అయినా ధైర్యంగా ఓట్లేసిన నంద్యాల ప్రజలందరికీ చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతున్నాను. నంద్యాల ఎన్నికల్లో పార్టీ కోసం ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య, ఇన్ని ప్రలోభాల మధ్య, ఇన్ని భయాల మధ్య పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలకు చేతులెత్తి  ధన్యవాదాలు చెబుతున్నాను. 
 
విజయంగా భావిస్తే మూర్ఖత్వమే...
ఈ ఎన్నికను చంద్రబాబు నాయుడు విజయంగా భావిస్తే అది చాలా దిగజారుడు రాజకీయమే. కారణం ఏమిటంటే ఎన్నికల ప్రచారంలోనే అందరూ చూశారు. ప్రతీ చోట ప్రజలతో మమేకమయ్యాను. ప్రజలకే ప్రశ్నలు వేసి, సమాధానాలు రాబట్టాను. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన మోసం ప్రజలే చెప్పారు. రైతులు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు... ఆ తర్వాత ఏ విధంగా మోసం చేశాడనేది వాళ్ళే చెప్పారు.  ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి, అ«ధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నిరుద్యోగులను మోసం చేశాడో వాళ్ళే చెప్పారు.

నిరుద్యోగులకు రూ. 2 వేల  నిరుద్యోగ భృతి అని ఏ విధంగా మోసం చేశాడో చెప్పారు. రేషన్‌ కార్డుల దగ్గర్నుంచి, రేషన్‌ షాపుల్లో ఇచ్చే బియ్యం వరకూ... ఆఖరుకు కరెంట్‌ బిల్లులతో సహా ప్రతి విషయంలోనూ ఏ విధంగా మోసపోయామనేది ప్రజలే చెప్పారు. బాబు మోసం చేసిన వ్యక్తి అని  ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు చేతులెత్తే పరిస్థితి ప్రతీ మీటింగ్‌లోనూ చూశాం. ఈ పరిస్థితుల్లో టీడీపీ గెలవడానికి ఒకే ఒక కారణం ఏమిటంటే... ఇవి సాధారణ ఎన్నికలు కావు.  కాబట్టి ఈ రోజు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేసినా ఆయన వెంటనే అధికారంలోంచి తప్పుకోడు. ఇంకా  ఒక సంవత్సరం ఆయనతోనే కొనసాగక తప్ప, మరో గత్యంతరం లేదు కాబట్టే ప్రజలు భయపడి, ఆయనిచ్చిన డబ్బులకు ఒప్పుకుని టీడీపీకి ఓట్లు వేశారే తప్ప... ఇది ఏ రకంగానూ చంద్రబాబు విజయం కాదు. ఇదే విజయం అనుకుంటే ఇంతకంటే మూర్ఖుడు ప్రపంచంలోనే ఉండడు. 
 
విలువలే మా ప్రాణం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ విలువలతో కూడిన రాజకీయాలకే కట్టుబడి ఉంది. ఎప్పుడు ఎన్నికలకు వెళ్ళినా... వేరే పార్టీ ఎమ్మెల్యేలు వైఎస్సార్‌ సీపీలోకి రావాలనుకుంటే కచ్చితంగా రాజీనామాలు చేసి రావాలనే విలువలతో కూడిన రాజకీయాలే చేశాం. అలా చేసిన తరువాతే పార్టీ కండువాలు వేస్తాం. అలాంటి విలువ అన్న పదానికి శిల్పా మోహన్‌రెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి అర్థం తీసుకొచ్చారు. పార్టీలో చేరాలంటే ముందుగా పదవికి రాజీనామా చేయాలంటే ... ఆరేళ్ళు ఉన్న ఎమ్మెల్సీ పదవికి కేవలం మూడు నెలల్లోనే మారు మాట్లాడకుండా శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేశారు. శిల్పా సోదరులకు హ్యాట్సాఫ్‌ చెబుతున్నా..
 
ఆ 20 మందిని గెలిపించండి చూద్దాం
ఇది రెఫరెండం ఎలా అవుతుంది? ఒకే ఒక్కచోట ఎలక్షన్‌ జరపడం... మొత్తం రూ.200 కోట్లు డబ్బు గుమ్మరించడం... మంత్రులందరినీ కూర్చోబెట్టడం ... భయభ్రాంతులను చేసే విధంగా పోలీసులను వాడుకోవడం లాంటి పరిస్థితులు సృష్టించి ఎన్నిక జరిపితే ఇది రెఫరెండం ఎలా అవుతుంది? చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నా ...వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను ఒకేసారి తీసుకుని రా. 20 చోట్ల రూ.4,000 కోట్లు ఎలా ఖర్చు పెడతావో చూస్తా. 20 చోట్ల పోలీసులు నీ మాట వింటారేమో చూస్తా... 20 చోట్ల ఎలా భయపెట్టగలవో చూస్తా... అదీ రెఫరెండం అంటే. 
 
మా పార్టీ గుర్తుమీద గెలిచి, తన పార్టీలో చేరిన వాళ్ళను... తన గుర్తు మీద మళ్ళీ వాళ్ళను గెలిపించుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. రాజకీయాల్లో గుండె ధైర్యం ఉండాలి. అవతల వ్యక్తి దెబ్బలు కొట్టినప్పుడు కాస్త వెనక్కు పోగలుగుతామే తప్పా....కొట్టాడే అని అనుకోవాల్సిన అవసరం లేదు. 
 
అవతల వ్యక్తి ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తీసుకోగలిగితే అదీ ఎన్నికల్లో అసలు విజయం. ఇదే రేపటి విజయానికి నాంది. కొట్టాడు.... తీసుకున్నాం. మా టైం వస్తుంది.. మేమూ కొడతాం’’ అని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జగన్‌తో పాటు ఆయన రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇంకా పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు ఉన్నారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement